Monday, 28 October 2013

భారతదేశము నా మాతృభూమి'భారతదేశము నా మాతృభూమి,భారతీయులందరూ నా సహోదరులు.నేను నా దేశమును ప్రేమించుచున్నాను.'ఇది మన భారతదేశ ప్రతిజ్ఞ.ఈ ప్రతిజ్ఞ మనకి తారక మంత్రము. ఎంతో స్పూర్తిదాయకము.ప్రజలందరూ అన్నదమ్ముల వలే శాంతిసౌభాగ్యములతో వర్ధిల్లాలి.ప్రజలందరూ అక్కచెల్లెళ్ళ వలె సుఖసంతోషములతో పరిఢవిల్లాలి.ప్రజలందరూ జాతీయ భావములతో నిండుపున్నిమి లాగా ప్రకాశించాలి.ఏమిటీ నీతివాక్య ప్రలాపములు?పక్కరాష్ట్రంవాడు మనకి రావాల్సిన నిధుల్ని దోచేస్తున్నాడు.ఏందుకలా గగ్గోలు పెడుతున్నావ్? పక్క రాష్ట్రం వాడు మాత్రం మన సహోదరుడు కాడా?రండి, కదలండి. కాలవలకి తూములు కొట్టేసి పక్క జిల్లావాడికి నీళ్ళు పోకుండా అడ్డం కొట్టేద్దాం.ఏందుకంత ఆవేశం? పక్క జిల్లావాడు మాత్రం మన సహోదరుడు కాదూ?నువ్వు చెబుతున్నదేదీ నాకు అర్ధం కావట్లేదు. అన్నట్లు ఇది విన్నావా? మా పక్కింటి వాడొట్టి దౌర్భాగ్యుడు. వాడికి ఉద్యోగం పోయింది. వెధవకి తిక్క కుదిరింది.ఏం? పక్కింటివాడు నీ సహోదరుడు కాదా? వాడి కష్టం అర్ధం చేసుకోవా? మరి నీ భారతదేశం ప్రతిజ్ఞ ఏమైంది?ఏవిటోయ్ నీ గోల? ఈ దేశం ఎటు పొతే నాకెందుకు? నేను బాగుండాలి. నా బేంక్ బ్యాలన్స్ బాగుండాలి. నా పిల్లలు గొప్పగా సెటిలవ్వాలి. ఊళ్ళో నేను కొన్నవైపు స్థలాలకి రేట్లు పెరగాలి. అన్నట్టు వడ్డీకి డబ్బులైమైనా కావాలా బ్రదర్? ధర్మవడ్డీ. పది రూపాయిలే. అదీ నీకు మాత్రమే సుమా!భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు.చూస్తుంటే ఒట్టి వెర్రిబాగులవాళ్ళా ఉన్నావు. నీ వాలకం చూస్తుంటే అర్ధమవుతుందిలే.నువ్వు స్వార్ధపరుడివి.సర్లే! ఈ దేశంలో తెలివైనవాణ్ని అంతే అంటార్లే మిత్రమా! మరి నీ సోదరులైన డాక్టర్లు, గవర్నమెంటు ఉద్యోగులు, ప్లీడర్లు నిన్నెందుకు నిలువుదోపిడీ చేస్తున్నారు?మరి మన భారతీయ సోదరులు తమ సోదరుల్ని కారంచేడు, చుండూరుల్లో వెంటాడి, వేటాడి నిలువునా నరికేశారెందుకు?ముందు వాళ్లకి చెప్పి ఆ తరవాత నాకు చెప్పు నీ నీతులు.నువ్వీ భారమాత ముద్దు బిడ్డవు. నీ తల్లికి సేవ చేసుకో.భారతమాతకి సేవ చెయ్యాలా! ఎందుకు?భారతదేశంలో ఒంటరిగా కనిపించిన ఆడపిల్లపై అత్యాచారం చెయ్యొచ్చు.భారతదేశంలో పారిశ్రామిక వ్యర్ధాల్ని నిక్షేపంగా, నిరాటంకంగా త్రాగే నీళ్ళల్లో వెదిలేసుకోవచ్చు.భారతదేశంలో అడవుల్ని అడ్డగోలుగా నరికేసుకోవచ్చు.భారతదేశంలో గనుల పేరుతో భూమికి బొక్క పెట్టేసి ఖనిజ సంపదని అడ్డదిడ్డంగా అమ్మేసుకోవచ్చు.భారతదేశంలో త్రాగే నీటిని, పీల్చే గాలినీ ఎడాపెడా కలుషితం చేసుకోవచ్చును.నీకు బాధగా ఉండదా? గిల్టీగా ఉండదా?అస్సలు ఉండదు. నా చేతికంటిన రక్తం మరకలు తుడిచేసుకునే ఉపాయం కూడా నా దగ్గర ఉంది.ఎవర్రా అక్కడ? రేపు నా పుట్టిన్రోజు. పెద్దాసుపత్రిలో రోగిష్టి దరిద్రులకి బిస్కట్లు, పండ్లు పంచిపెట్టండి. వికలాంగులకి ట్రై సైకిళ్ళు పంచండి. వితంతువులకి కుట్టు మిషన్లు ఇవ్వండి. ప్రెస్సోళ్ళకి మంచిమంచి కానుకలు పంపండి. నాపేరు మీద గొప్ప సమాజ సేవ జరిగినట్లు వార్తలు ప్రముఖంగా వచ్చేలా చూడండి.ఒరే వెర్రిబాగులాడా! ఇప్పుడు చెప్పు ఏం చెబ్తావో!అవును, నీ కీర్తీ దశదిశలా వ్యాపించును. నిన్ను ప్రజలు వేనోళ్ళ శ్లాఘించెదరు.అవును, నువ్వు దయామయుడవు. భారతదేశం ప్రతిజ్ఞ నీకు నరనరాల జీర్ణించుకుపోయింది.అవును, ఇపుడు నీకు పాపపరిహారం అయిపోయింది. ఇక నిశ్చింతగా జీవింపుము బిడ్డా!అవును, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను.నేను వెర్రిబాగులాణ్నే!(picture courtesy : Google)