Friday 18 October 2013

యుద్ధం కబుర్లు


మహాభారత యుద్ధంలో ఎవరిమాట చెల్లుబాటయ్యింది?

ఒకవైపు ధుర్యోధనుడి మాట శిలాశాసనం.. ఇంకోవైపు ధర్మారాజు మాట వేదవాక్కు.

ఇద్దరూ యుద్ధం కావాలనుకున్నారు.. చేసుకున్నారు.

జీతాల కోసం పనిచేస్తున్న సైనికులు ఇద్దరి తరఫున కొట్టుకుని.. కుప్పలుతెప్పలుగా చచ్చారు.

దుర్యోధన ధర్మరాజులిద్దరూ యుద్ధం వద్దనుకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆపేసుకోవచ్చు.

అందుకు వారు కారణం కూడా చెప్పనక్కర్లేదు.

వారిద్దర్లో ఒకరికి వీపు దురద పుట్టినా.. గోక్కోడానికి కూడా తాత్కాలిక యుద్ధవిరామం ప్రకటించవచ్చు.

వీరికి సలహాలు అనేకులు అనేక రకాలుగా ఇవ్వవచ్చును.. కానీ నిర్ణయాత్మక శక్తి మాత్రం వీరిద్దరిదే.

ఈ యుద్ధం అనేక యుగాల క్రితం జరిగింది.

ఈనాటిక్కూడా మనకి కొద్దిపాటి జ్ఞానమైనా వచ్చిన దాఖలా లేదు.

మన పైవాళ్ళకి యుద్ధం ఆపే ఉద్దేశ్యం ఉండదు.

కానీ - లీకులతో, తియ్యనైన కబుర్లతో మభ్యపెట్టెదరు.

కౌరవుల్లో వందోవాడికి విరోచనాల్ట.. యుద్ధం ఆగిపొయ్యేట్లుంది.

సహదేవుడి గుర్రానికి గుగ్గిళ్ళు అయిపొయ్యాయి.. యుద్ధం కేన్సిల్.

భీష్ముడికి గెడ్డం మరీ పెరిపోయిందట.. యుద్ధం వాయిదా వేస్తారా?

యుద్ధానికయ్యే జమాఖర్చులు రాసే వేతనశర్మలు సహాయ నిరాకరణ చేస్తున్నార్ట!

'అయితే ఏంటంట?'

నిర్ణయం తీసుకున్న ధుర్యోధనుడు, ధర్మరాజు.. వాళ్ళ మానాన వాళ్ళు యుద్ధం చేసేసుకుంటూ పోతున్నారు.

వాళ్ళతో మాట్లాడే ధైర్యం ఇంకా ఎవరికీ వచ్చినట్లు లేదు.

ఒకప్పుడు నర్తనశాల సినిమాలో ఉత్తరకుమారుణ్ని చూసి పగలపడి నవ్వుకున్నాం.

ఇప్పుడు సర్వం ఉత్తరకుమారుల మయం.

'చేతనైతే యుద్ధం ఆపేస్తున్నామని చెప్పాల్సినవాళ్ళతో చెప్పించు.. అంతేగానీ ఈ చీకట్లో రాళ్ళు విసరడం మానెయ్యి.' అని అనకు.

నిన్నొక శతృగూఢచారిగా జమ కట్టెదరు.

మనందరం గాంధీగారి కోతుల్లాంటివాళ్ళం.

అందుకే మనకి నచ్చింది మాత్రమే చూస్తాం, వింటాం, మాట్లాడతాం.

ఇదొక అంతులేని అజ్ఞానం, అది మనకెంతో ఆనందదాయకం.

'ఉరే అబ్బాయ్! ఏనాదైతే కిష్టుడి రాయబారం ఫెయిలయిందో, ఆరోజే మహాభారత యుద్ధం జరగాలని నిర్ణయమైపోయింది. కత్తి పదును పెట్టుకోడానికి ఆకురాయి కనబళ్ళేదని మర్డర్ చెయ్యడం మానుకుంటామా ఏమిటీ? అందుకే - ఈ వెర్రిమొర్రి ఆలోచనాలు కట్టిపెట్టి జరగాల్సిందేవిటో ఆలోచించు.'

'ఎవడ్రా వీడు? వీణ్ని తన్ని తగలెయ్యండి.'