Sunday 6 April 2014

జనం


"బామ్మర్దీ!"

"ఏంది బావా?"

"అమ్మయ్యా! మొత్తానికి కిందామీదా పార్టీ టిక్కెట్టు సంపాదించా, ఓ పనైపోయింది." నాయకుడి ఆనందం.

"కంగ్రాట్స్ బావా!" 

"రేపట్నించి మన ప్రచారం దుమ్ము రేగిపోవాలి. కానీ - జనాల్లేరేంటి బామ్మర్ది?" నాయకుడి సందేహం.

"అందుక్కారణం నువ్వే బావా!" 

"నిజమా!?" నాయకుడి ఆశ్చర్యం.

"అవును బావా! నిన్న నువ్వు ప్రెస్సోళ్ళకి ఏం చెప్పావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో."

ఒకక్షణం కళ్ళు మూసుకున్నాడు నాయకుడు. నిన్న ప్రెస్ కి తనేం చెప్పాడో గుర్తొచ్చింది.

"ఓ అదా? అవినీతి, అక్రమాల్ని తరిమి కొడతానన్నాను. అందులో తప్పేంది? ఆ ముక్క అందరూ చెప్పేదేగా?" పెద్దగా నవ్వుతూ అన్నాడు నాయకుడు.

"అక్కడే దెబ్బ తిన్నావ్ బావా! నీ స్టేట్మెంట్ చూసి జనం నీరసపడిపొయ్యారు." పదేళ్ళు పరిశోధన చేసి భారద్దేశంలో పేదరికానికి కారణం కనుక్కున్న సైంటిస్టులా అన్నాడు బామ్మర్ది.

"ఏదో సీటొచ్చిందనే ఆనందంలో ఎదవ కూతలు కూశాను, జనం లేకపోతే మరి నా ప్రచారం ఎట్లా బామ్మర్ది?" నుదురు కొట్టుకున్నాడు నాయకుడు.

ఆపై - తను ముద్దుగా పెంచుకుంటున్న టామీకి ఇక పిల్లలు పుట్టరని తెలిసి దుఃఖించే దొరసానమ్మలా మిక్కిలి బాధ పడసాగాడు నాయకుడు.

బావ బాధ చూళ్లేకపొయ్యాడు బామ్మర్ది. పుట్టినప్పట్నుండి నొప్పంటే ఏంటో తెలీకుండా పెరిగిన సుకుమారి సున్నిత పాదాలు వేసవి మండుటెండలో సర్రున మండినచో కలుగు బాధ వంటిది బావలో కనిపించింది బామ్మర్దికి.

అంచేత అనునయంగా అన్నాడు బామ్మర్ది.

"సర్లే బావా! ఏదోటి చేసి రేపీపాటికి జనాల్ని పోగేయిస్తాలే. నువ్వు బాగా అలిసిపోయ్యావు. ఇవ్వాల్టికింక పడుకో."

అటుపై బామ్మర్ది మందు చప్పరిస్తూ, సిగరెట్లు తగలేస్తూ దీర్ఘముగా ఆలోచించెను. ఆ విధంగా ఒక 'నల్లకుక్క' బ్రాండు ఫుల్ బాటిల్ విస్కీ, మూడు పెట్టెల గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ సిగరెట్లు ఖర్చు చేసెను. ధూమపానము మరియు సురాపానములు మెదడుని శుభ్రపరచి, ఆలోచనా నరములని పదును పెట్టునని ఆర్యోక్తి. అది నిజము కాబోలు.. అందుకే బామ్మర్దిక్కూడా ఒక కత్తిలాంటి ఐడియా వచ్చింది. పిమ్మట ఏదో పత్రికలో విలేఖరి పన్చేసే ఆత్మీయ స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఇరువురూ తాము చెయ్యాల్సిన పని గూర్చి వివరంగా చర్చించుకున్నారు.

మర్నాడు పేపర్ల నిండా నాయకుడి వార్తలే!

'ఫలానా నాయకుడు పార్టీవాళ్ళకి డబ్బిచ్చి టిక్కెట్టు కొనుక్కున్నాట్ట!'

'నాయకుడి ఫ్లాష్ బేక్ పరమ బేడంట, ఇంతకు మునుపు పార్టీవాళ్ళు ఏదో కార్పోరేషన్లో ఏదో పోస్టిస్తే.. కార్పోరేషన్ నిధులన్నీ మింగేశాట్ట.'

'అదేదే పబ్లిక్ పరీక్షల పేపర్లు లీకు చేసి బాగా వెనకేశాట్ట!'

'అంతేనా? ఇంకా ఉంది. ఒకప్పుడు దొంగసారా అమ్మాడంటా, దొంగనోట్లు మార్చాట్ట, ముండల కంపెనీ నడిపాట్ట!'

'నాయకుడిది రక్తచరిత్ర కూడానంట!'

దాదాపు అన్ని తెలుగు పేపర్లలోనూ అటూఇటుగా ప్రముఖంగా ఈ వార్తలే! కొన్ని పేపర్లైతే బాక్సు కట్టి మరీ ప్రచురించాయి.

పొద్దున్నే పేపర్లు చూసి బావురుమన్నాడు నాయకుడు. అర్జంటుగా బామ్మర్దిని పిలిపించాడు.

హేంగోవర్ కారణాన.. బద్దకంగా, బడలికగా వచ్చాడు బామ్మర్ది.

"వామ్మో!వాయ్యో! ఏందీ వార్తలు బామ్మర్దీ?" నాయకుడి ఆందోళన.

"ఓ! ఆ వార్తలా? అవి రాయించింది నేనేలే బావా!" అంటూ చిద్విలాసంగా నవ్వాడు బామ్మర్ది.

"ఎందుకు?" నాయకుడి అయోమయం.

నాయకుడి చెయ్యుచ్చుకుని ఇంటి ముందుకు లాక్కెళ్ళాడు బామ్మర్ది. ఇంటి ముందు గొర్రెల మందల్లా, ఈగల గుంపుల్లా జనం, జనం మరియు జనం. అక్కడంతా కోలాహలంగా ఉంది.. 'ఆల్కహాలా'హలంగా కూడా ఉంది. జనం ఉత్సాహంగా విజిల్స్ వేస్తున్నారు, ఆనందం పట్టలేక స్టెప్పులేస్తున్నారు, గుండెలు పగిలేలా స్లోగన్లిస్తున్నారు.

"పేదల పెన్నిధి మన నాయకుడు"

"వర్ధిల్లాలి"

"బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన నాయకుడు."

"జిందాబాద్."

"ఈళ్ళందర్నీ ఎప్పుడు పోగేశా?" నాయకుడి ఆశ్చర్యం.

"నే పోగెయ్యలా, నీ గూర్చి పేపరోళ్ళు రాసిన వార్తలే వాళ్ళని పోగేశాయి." నవ్వుతూ అన్నాడు బామ్మర్ది.

ఆ జనం చేస్తున్న హడావుడికి నాయకుడు ఆనందంతో పొంగిపొయ్యాడు. అంతలోనే తన గూర్చి వచ్చిన వార్తలు గుర్తొచ్చి.. బిర్యానీలో బొద్దింకని చూసిన వాళ్ళా మొహం వికారంగా పెట్టాడు.

నల్లగా ఉండేవాణ్ని నల్లోడంటే కోపగించుకుంటాడు, బీదవాణ్ని దరిద్రుడంటే గింజుకుంటాడు. అంచేత - తనగూర్చి అన్నీ నిజాలే రాయించిన బామ్మర్ది పట్ల నాయకుడికి చికాకు కలిగింది. కానీ - బామ్మర్ది తన ఫ్లాష్ బ్యాకంతా తన మంచి కోసమే జనాలకి తెలియజెప్పాడు. ఇందులో బామ్మర్ది తప్పేం లేదు. కానీ - ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా.. బ్రాందీలో భృంగామలక తైలం కలిసినట్లుగా, ఫిష్ కర్రీలో ఫినాయిల్ ఒలికినట్లుగా.. వెగటుగా అనిపిస్తుంది.

"నాకా వార్తలు నచ్చలేదు." నాయకుడి ఇబ్బంది.

"అదేంటి బావా అట్లా అంటున్నావు! ఆ వార్తల్ని రాయించడానికి చాలా సొమ్ము, పలుకుబడి ఖర్చు పెట్టాను. నువ్విప్పుడు రాష్ట్రస్థాయి నాయకుడివయిపోయ్యావు, తెలుసా?" గర్వంగా అన్నాడు బామ్మర్ది.

"ఆవుననుకో.. " నాయకుడి నసుగుడు.

"బావా! బాధపడకు. ఇట్లాంటి నెగెటివ్ పబ్లిసిటీ పెళ్లిసంబంధానికైతే ఇబ్బంది గానీ.. రాజకీయాల్లో మాత్రం చాలా మంచిది. ఈ వార్తల్తో నీ అభ్యర్ధిత్వానికి గ్లామర్ కూడా జతయ్యింది, అర్ధం చేసుకో." నచ్చజెప్పచూశాడు బామ్మర్ది.

"కానీ.. " నాయకుడి పీకులాట.

"బావా! అడవిలో పులికి చేతిలో పంజా, నోట్లో కోరలే ఆయుధం, పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీకి తగ్గట్టుగానే పులి వేటాడాలి, తప్పదు.. అది దాని జాతిధర్మం. పులి అహింసావాది అయినట్లైతే ఆకలితో చావాల్సిందేగానీ, ఆహారం దొరికించుకోలేదు. అంచేత రాజకీయనాయకుళ్ళో నీతి, పులిలో సాత్వికత.. చూసేవాళ్ళతో చప్పట్లు కొట్టించుకొనుటకు బాగుండునేమో గానీ.. వారికి మాత్రం ఆత్మహత్యా సదృశం." తత్వం బోధించాడు బామ్మర్ది.

"అవునా?" నాయకుడి కుతూహలం. 

"అబ్బా బావా! నీతో ఇదే చిక్కు. నిన్నేమో ప్రచారానికి జనాలు లేరని బాధ పడ్డావు. ఇప్పుడేమో జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చారు, సంతోషించవేం? రాజకీయాల్లో పబ్లిసిటీ ముఖ్యం బావా! అది మంచిదా, చెడ్డదా అన్నది అనవసరం. నిన్న 'నేను నిజాయితీపరుణ్నంటూ' జనాలకి నువ్వు తప్పుడు సంకేతాలు పంపావు, ఇవ్వాళ్టి వార్తల్తో నువ్వెవరివో జనాలకి క్లియర్ గా అర్ధమైంది. నీక్కావలసింది వాళ్ళు చేసిపెడతారు, వాళ్ళక్కాల్సింది నువ్వు ఇచ్చేస్తావు, అంతే! సింపుల్." అన్నాడు బామ్మర్ది.

"అంతేనంటావా?" నాయకుడి నూతనోత్సాహం.

"ఓ బావా! నన్ను నమ్ము. రాజకీయాలు అత్యంత నీచమైనవి, హేయమైనవి. ఈ రంగంలో ఎవడైతే లోఫర్, దగుల్బాజి అన్న పేరొందగలడో వాడే రాణించగలడు. అందువలన నీవు సందేహింపక, అతి ఘనమైన నీ గతాన్ని గళమెత్తి చాటినచో నిశ్చయముగా నిన్ను విజయలక్ష్మి వరించును. నామాట విని నీతివాక్యములు వల్లించుట కట్టిపెట్టుము. నీతిమంతులు టీవీ స్టూడియెల్లో రాజకీయ చర్చలు జరపగలరు, ఎలక్షన్లలో డిపాజిట్ సాధింపలేరు. ఇది సత్యము." అంటూ గీతోపదేశం చేశాడు బామ్మర్ది.

"అవును కదా! నా కళ్ళు తెరిపించావ్, థాంక్సులు బామ్మర్దీ! థాంక్సులు." అంటూ ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతుండగా బామ్మర్దిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు నాయకుడు.

(picture courtesy : Google)