Monday 14 April 2014

జీవితమే సఫలము.. థాంక్స్ టు 'బైజూ బావ్రా'


మనది మానవ జన్మ, అంచేత మనని 'మనుషులు' అంటారు (ఈ విషయం చెప్పడానికి ఒక పోస్ట్ రాయడం చాలా అన్యాయం). మనలో చాలామంది చాలా అవుదామనుకుంటాం. చాలామంది పిల్లలు పెద్దయ్యాక డాక్టర్ అవుదామనుకుంటారు (బహుశా తాము కూడా డాక్టర్లై ఎదుటివారికి ఇంజక్షన్ పొడుద్దామనే ఉత్సాహం / కసి కారణం కావచ్చు), కానీ అందరూ డాక్టర్లు కాలేరు. పిల్లలు ఇంజనీర్ అవుదామని పెద్దగా అనుకోరు (ఇంజనీర్లు చేసే పనేంటో తెలీకపోడం వల్ల), కానీ చచ్చినట్లు అందరూ ఇంజనీర్లే అవ్వాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది.

అలాగే - (పెళ్లి కాకో, మొగుడి బాధలు తట్టుకోలేకో) మగాడిగా పుడితే బాగుండేదని అనుకునే ఆడాళ్ళు నాకు తెలుసు (ఆడదానిగా పుట్టినట్లైతే బాగుండేదని అనుకున్న మగాళ్ళని నేనెప్పుడూ చూళ్ళేదు). ఎక్కువమంది (నాతో సహా) డబ్బులున్న కొంపలో పుడిదే ఎంతో బాగుండేదని అనుకుంటారు (ఇది మాత్రం వాస్తవిక దృక్పధం). మనుషులకి ఇట్లాంటి ఆలోచనలు పలు సందర్భాల్లో వస్తుంటాయి.

ఈపాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది.. ఇంత ఉపోద్ఘాతం రాస్తున్నానంటే అది నా సొంత గోల రాసుకోడానికేనని. ఇప్పుడు నా గొడవ (ఇది కాళోజి 'నా గొడవ' కాదు, నా గొడవే). మానవునిగా జన్మించినందుకు నేను కొన్నిసార్లు చాలా దుఃఖించాను. ఒక్కోసారి నా జీవితం ఫైవ్ స్టార్ హోటల్లో మసాల దోసెలా రుచీపచీ లేకుండా దరిద్రంగా ఉందనిపించేది, ఇంకోసారి గోడ మీద బల్లిలా చలనం లేకుండా ఆగిపోయిందని కూడా అనిపించేది.

ఇప్పుడు కొన్ని నా దుఃఖసమయాలు (అనగా ఏడుపుగొట్టు సందర్భాలు అని అర్ధం). నేను ఇష్టపడ్డ అమ్మాయి తన పుట్టిన్రోజు పార్టీకి నన్ను పిలవకుండా, నా స్నేహితుణ్ని మాత్రమే పిలిచినప్పుడు.. శ్రీదేవి బోనీకపూర్ ని పెళ్లి చేసుకున్నప్పుడు.. పనికిమాలిన సినిమాలు చూట్టమే కాకుండా, తమ అభిమాన హీరో చెప్పిన రాజకీయ పార్టీకే ఓటేద్దామనుకునే వెర్రివెంగళప్పలైన సినిమా పిచ్చోళ్ళని గాంచినప్పుడు.. యిలాంటి సందర్భాలు చాలా రాయొచ్చు.

అయితే - నిజమైన, నిఖార్సైన దుఃఖసమయం మాత్రం పరీక్షల సమయమే. సబ్జక్టు పుస్తకాలు చదవలేక ఎన్నోసార్లు 'జన్మమెత్తితిరా.. అనుభవించితిరా.. ' అని పాడుకుంటూ మిక్కిలి దిగులు చెందేవాణ్ని. ఊర్వశి శారదలా డగ్గుత్తికతో 'దేవుడా! యిలాంటి కష్టం ఆ పగవాడిక్కూడా రానీయొద్దు' అని ఏడిచేవాణ్ని. 'ఓ అష్ట దిక్పాలకులారా! నేనే గనక మహా పతివ్రతనైతే ఈ పరీక్షలు నశించుగాక!' అని శపించేవాణ్ని. ఎన్నిరకాలు ప్రయత్నించినా పరీక్షలు ఆగేవి కావు.

జీవిత సత్యం, జీవన సారం, జన్మరహస్యం శోధించటానికి తీవ్రప్రయత్నం చేసేవాణ్ని. కానీ - గొప్పవిషయాలు ఆలోచించడానికి నా బుర్రలో ఇడ్లీసాంబారు, విఠాలాచార్య సినిమాల జ్ఞానం మించి మరేదీ లేదు. అయితే - మానవుడు తుచ్ఛజీవి (అందుకు ఉదాహరణ నేనే), అందుకే అర్ధం కాని విషయాల్ని కూడా బుర్ర వేడెక్కేలా ఆలోచిస్తాడు.

'అసలు ఒక జీవికి ఫలానా జన్మ అంటూ ఎలా నిర్ణయమవుతుంది? మానవ జన్మ ఉత్కృష్టమైనది అంటారు గదా! మరి ఇంత గొప్పజన్మకి ఈ పరీక్షలెందుకు? మార్కులెందుకు?'. ఎంత ఆలోచించినా, సాహితీ పురస్కారం పొందిన తెలుగు కథలా.. విషయం మరింత కాంప్లికేట్ అయ్యేది తప్ప, ఛస్తే అర్ధమయ్యేది కాదు (మనకి అర్ధం కానివన్నీ గొప్ప విషయాలే.. ఏలననగా, గొప్పవిషయాలు మనకి అర్ధం కావు కాబట్టి).

నాకా దుఃఖ సమయంలో కుక్కల్ని, పిల్లుల్ని, పక్షుల్ని చూస్తుంటే చాలా ఈర్ష్యగా ఉంటుంది. అవి హాయిగా తింటాయి, పడుకుంటాయి, టైమొస్తే సుఖంగా చచ్చిపోతాయి (వాటికి మనకిలా చచ్చేముందు ICU చెర కూడా ఉండదు కాబట్టి). పెళ్ళీపెటాకులు ఉండవు, కాబట్టి రక్కసులైన భార్యల పీడన కూడా ఉండదు. మరీ ముఖ్యంగా వాళ్లల్లో చంద్రబాబు నాయుళ్ళు, జగన్మోహన రెడ్లు ఉండరు. ఇవన్నీ ఆ జాతులు చేసుకున్న పుణ్యం. మరి నేనెందుకు మనిషిగా పుట్టాను?

ఈ దుఃఖాలన్నీ స్మశాన వైరాగ్యాల్లాగా, పరీక్షలవ్వంగాన్లే మాయమైపొయ్యేవి. 'మానవ జీవితం సేమ్యా పాయసమంత మధురమైనది, బాటా చెప్పంత విలువైనది, గవర్నమెంటు ఉద్యోగమంత స్థిరమైనది. దీనికి కె.విశ్వనాథ్ సినిమాల్లో కుంకుమ బొట్టుకున్నంత పవిత్రత కూడా ఉంది' అనిపించేది.

అటుపై నెమ్మదిగా మనిషికున్న లాభాలు ఒక్కొక్కటే గుర్తుకొచ్చేవి. కుక్కలు, పిల్లులు ఆనంద భవన్లో కుర్చీలో కూర్చుని మసాలా దోసె తిన్లేవు.. నేను తింటున్నాను. పక్షులు కాఫీ, విస్కీ, సిగరెట్లు తాగలేవు.. అవన్నీ నేను తాగుతున్నాను. కావునే పెద్దలు మానవ జన్మ గొప్పదనుంటారు.. ఒప్పుకుంటున్నాను.

కానీ - మనకి మసాలా దోసెలు, కాఫీలున్నట్లే జంతువులక్కూడా ఏవో ఉండే ఉంటాయి. అయితే అవేమిటో మనకి తెలిసే అవకాశం లేదు.. ఎందుకంటే అవొచ్చి మనకి చెప్పవు కాబట్టి (లాంగ్వేజ్ ప్రాబ్లం). అన్ని జన్మల్లోకి మానవజన్మే గొప్పదని ప్రవచించిన ఆ మహానుభావుడు.. తన జన్మని జంతువులు, పక్షుల జన్మతో ఎలా తూచాడో మనకి తెలీదు.

మన తెలుగువాడికో రోగం ఉంది. తను తెలుగు మాట్లాడతాడు కాబట్టి 'తెలుగు లెస్స' అంటాడు. అపచారం, అపచారం.. ఈ మాట ఎవరో పి.వి.నరసింహారావులా అనేక భాషలు నేర్చుకున్న బహుభాషా కోవిదుడు (అసలు ఎవరైనా అన్ని భాషలు నేర్చుకోటం ఎందుకు? మాట్లాడుకోటానికి ఒకటి చాలు కదా.. కాదా?) చెప్పిన మాటయ్యుంటుంది.. కావున ఒప్పుకుందాం.

ఇంకా - ఆ తెలుగువాడే మన పంచెకట్టు గొప్పదంటాడు (అంత గొప్పదైతే రోజూ పంచె ఎందుకు కట్టుకోడు? ఉగాది రోజు మాత్రమే పంచె ఉత్తరీయంతో పగటి వేషం ఎందుకేస్తాడు? అదేమన్నా ప్రేమికుల రోజు లాగా పంచెల రోజా?) ఇవన్నీ మనం అడక్కూడదు. అడిగితే నీకు సంస్కృతి, సాంప్రదాయం (ఇలా అడుగుతున్నానని ఎవరికీ చెప్పకండి - అసలు సంస్కృతి, సాంప్రదాయం అంటే ఏంటి?) పట్ల గౌరవం లేదని గయ్యిమంటారు. అయినా ఇవన్నీ పెద్దపెద్ద విషయాలు.. మనలాంటి అల్పులు ప్రశ్నించరాదు (బ్లాగుల్లో రాసుకోవచ్చు).

జంతువులు, పక్షులు సినిమాలు తియ్యవు, పాటలు పాడవు, పుస్తకాలు రాయవు (ఎవరన్నా ఏ సత్యసాయిబాబా బూడిదలాంటిది వాటి నోట్లో కొడితే మాత్రం చెప్పలేం). అంచేత - మనిషి జన్మ మరీ నేననుకున్నంత నాసి కాదని అనిపిస్తుంది. మనిషికి మాత్రమే సాధ్యమైనవి, సంతోషించదగినవి ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. కానీ దురదృష్టం, ఈ అవకాశాన్ని మనుషులందరూ వాడుకోరు (కొందరు తమ జీవితాన్ని పూర్తిగా డబ్బు సంపాదనకి మాత్రమే వెచ్చిస్తారు, వేరే ఇంకేదీ చెయ్యరు).

కొద్దిసేపు ఈ జన్మల గోల పక్కన బెట్టి అసలు విషయంలోకొస్తాను. విసుగ్గా ఉంటే కొందరు ధ్యానం చేస్తారు, మరికొందరు దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రోతారు, మా సుబ్బు రంగ మహల్లో స్పెషల్ నూన్ షోలుగా వేసే మలయాళం సినిమాలు చూసేవాడు (సత్రంలో ఒక రాత్రి, ఆమె అనుభవం, రతినిర్వేదం, అడవిలో అందగత్తెలు వంటి మహిళా చిత్రరాజములు).

దురదృష్టవశాత్తు నాకు ధ్యానం తెలీదు, నిద్ర కూడా అతితక్కువ, రంగ మహాల్ మూతబడి చాల్రోజులయ్యింది. అంచేత - విసుగ్గా అనిపించినప్పుడు యూట్యూబు చూస్తుంటాను. పాత సినిమా పాటలు వింటుంటాను. ఇవ్వాళ 'బైజూ బావ్రా'లో మహమద్ రఫీ పాడిన పాట చూశాను. వెంటనే విసుగు మాయమైంది. మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపించసాగింది. 'జీవితమే సఫలము, రాగసుధా భరితము.. ' అని అనార్కలిలా పాడుకోసాగాను. 

(ఏవిటి మరీ చప్పగా రాస్తున్నాను? కొంచెం స్థాయి పెంచుతాను.)

'బైజూ బావ్రా' పాట వింటుంటే - ఆనందంతో మనసు ఉప్పొంగిపోయింది. ఉదయాన్నే కురిసిన మంచు బిందువుల మృదుస్పర్శకి సిగ్గులమొగ్గైన మల్లెతీగ వంగి, పక్కగా నున్న బంతిపువ్వుని ముద్దాడినట్లు మనసు పరవశంతో బరువెక్కింది. మందార మకరందం గ్రోలిన తుమ్మెద ఆనందంగా ఝూమ్మంటూ చేస్తున్న రెక్కల చప్పుడు ఆనంద భైరవి రాగంలో విన్నట్లుగా పరమానందభరితుడనై వివశుణ్నయ్యాను. నౌషాద్, రఫీలు నా హృదయాన్ని ఒక తేనెలూరు మధుర సాగరంలో ముంచెత్తారు (ఇంకా పైకి తేల్లేదు).

హోల్డాన్! ఆగక్కడ. హేవిటీ అర్ధం పర్ధం లేని వర్ణనలు? నువ్వేమన్నా భావకవి వనుకుంటున్నావా? ఆ రోజులు చచ్చి చాల్రోజులైంది. ఇంతకీ నువ్వు చెప్పేది నీకాపాట బాగా నచ్చింది. అంతేనా?

ఏవిటో! మంచి రచనలకివి రోజులు కావు కదా!

నీకంత లేదు గానీ.. కొద్దిగా అర్ధమయ్యేట్లు మనుషుల భాషలో చెప్పవా?

ఓకే! ఏదో పేరొస్తుందని అలా రాద్దామనుకున్నాన్లే! తెలుగులో ఇట్లాంటి వర్ణనలు రాసి పెద్దాళ్ళైపోయినవాళ్ళు చాలామందే ఉన్నారు, వారి సరసన పీట కాకపోయినా కనీసం పట్టా అయినా వేసుకుని కూర్చుందామని ఓ చిరు ప్రయత్నం చేశాను. సర్లే! ఇప్పుడు నాకు నిజంగా ఎలా అనిపించిందో రాస్తాను, చదూకో.

నాకీ పాట వింటుంటే మైసూర్ కేఫ్ లో తింటున్న రెండో ఐడ్లీకి మూడోసారి సాంబారు పోయించుకున్నంత కమ్మగా ఉంది. పరమ ఏడుపు సినిమా మధ్యలో హఠాత్తుగా జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చూసినంత ఎక్సైటింగ్ గా ఉంది. నేను ప్రేమించిన అమ్మాయి నన్నేకాదు, నా కాంపిటీటర్ని కూడా 'ఛీ' కొడితే కలిగేంత ఆనందంగా ఉంది. మండువేసవిలో చిల్డ్ బీర్ తాగినంత రిలీఫ్ గా ఉంది. ఆర్యూ హేపీ నౌ?

గుడ్, ఇప్పుడు నీ స్టైల్లో చెప్పావు. గో ఎహెడ్.

థాంక్యూ! ఇప్పుడు నన్ను ఎంతగానో ఆనందింపచేసిన 'బైజూ బావ్రా' పాటని ఇస్తున్నాను.. విని ఆనందించండి. 



(picture courtesy : Google)