Monday 21 April 2014

హేమమాలిని! బెస్టాఫ్ లక్


పులిని చూపించి 'ఇది పులి' అని చెప్తే నవ్వొస్తుంది. అలాగే పై ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు 'హేమమాలిని' అని రాస్తే కూడా నవ్వొస్తుంది. ఎందుకంటే - హేమమాలిని పరిచయం అవసరం లేని వ్యక్తి (ముఖ్యంగా మా వయసు వాళ్లకి).

హేమమాలిని ప్రస్తుతం బిజెపి తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో ఉంది. ఆవిడ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న ఫొటోలు అడపా దడపా న్యూస్ పేపర్లల్లో కనబడుతూనే ఉన్నయ్. ఆ ఫొటోలు చూసినప్పుడల్లా నాకు పాతరోజులు గుర్తొచ్చి చాలా సంతోషంగా ఉంటుంది.

నేను పదో క్లాసులో ఉండగా నాజ్ అప్సరలో 'సీతా ఔర్ గీతా' అనే హిందీ సినిమా విడుదలైంది. హేమమాలిని ద్విపాత్రాభినయం. నాకు హేమమాలిని పిచ్చపిచ్చగా నచ్చింది. అందుకే సినిమా రెండుమూడుసార్లు చూశాను. కానీ బయటకి చెప్పుకోలేని దుస్థితి. అందుక్కొన్ని కారణాలున్నయ్! ఏమిటవి?

అడవికి సింహం రాజు. కవులు సింహం జూలు, సన్నని నడుం అందానికి చిహ్నంగా రాస్తారు. అడవిలోని జంతువులకి కవులకున్న కళాహృదయం ఉండదు, కానీ - చావు భయం మాత్రం ఉంటుది. అందుకే వాటికి సింహం పంజా దెబ్బన్నా, కండల్ని చీల్చేసే వాడికోరలన్నా భయం. అంచేత సింహం కనబడితే అవి భయం చేత పక్కకి తప్పుకుంటాయ్. రాజంటే కూడా సామాన్య ప్రజలు అలాగే భయపడాలని కవుల అభిప్రాయం కావొచ్చు, అందుకే సింహాన్ని మృగరాజుగా నిర్ణయించేశారు.

సరే! ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం (ఉన్నామా?!), ప్రజలు ఓట్లేస్తేనే లీడర్. అందుకే వాళ్ళు ఓట్లేయించుకోడానికి కుక్కపాట్లు పడతారు. ఎలక్షన్ల సమయంలో సామాన్య ప్రజలు తక్కువ ఆలోచిస్తారు, ఎక్కువమంది ఓట్లేస్తారు. మేధావులు ఎక్కువ ఆలోచిస్తారు, తక్కువమంది ఓట్లేస్తారు!

అడవిలో సింహం కాకున్నా, ఎలక్షన్లో నించోకున్నా.. సూర్యం మా బ్రాడీపేట గ్యాంగ్ నాయకుడుగా ఉన్నాడు. బంగారానికి వెండి తలవంచినట్లు, హెడ్ కానిస్టేబుల్ కి కానిస్టేబుళ్లు ఒదిగుండినట్లు మేం కూడా సూర్యం లీడర్షిప్పుని ఒప్పేసుకున్నాం (మా బ్రాడీపేట గ్యాంగ్ గూర్చి ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్  అనే పోస్టులో కొంత రాశాను).

ప్రజాస్వామ్య స్పూర్తిలో సూర్యానికి ఇందిరా గాంధీ ఆదర్శం. అందుకే - సూర్యానికి నచ్చినవే మనక్కూడా నచ్చాలి, నచ్చకపోతే మనక్కూడా నచ్చరాదు. ఎదురు మాట్లాడినవాడు అసమ్మతివాదిగా నింద మొయ్యాలి. వాడిపై సిబిఐ, ఎఫ్బిఐ మొదలైన నిఘాలు కూడా ఉంచబడతాయ్. ఇది మాకందరికీ ఏదోక స్థాయిలో అనుభవమే కాబట్టి 'బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్'గా ఉండేవాళ్ళం (లేనిచో బ్రతుకు దుర్భరం చేస్తాడని తెలుసు).

మా గ్యాంగ్ లో ఏ విషయంలోనైనా (ఏకపత్నీవ్రతుళ్ళా) ఒక్కళ్ళనే ఇష్టపడాలి. మేమందరం గుండప్ప విశ్వనాథ్ అభిమానులం. గవాస్కర్ అభిమానులకి మాలో చోటు లేదు. ఏకకాలంలో విశ్వనాథ్, గవాస్కర్ల అభిమానిగా ఉండరాదు, రూల్సు ఒప్పుకోవు! 

మా నాయకుడు సూర్యం రేఖ అభిమాని. కావున టెక్నికల్ గా నేను కూడా రేఖ అభిమానిని. ఇప్పుడు నాకు హేమమాలిని నచ్చిందంటే.. పార్టీ మారే రాజకీయ నాయకుళ్ళా చాలా వివరణ ఇచ్చుకోవాలి. అందుకు నేను సిద్ధంగా లేను.

నాజ్ అప్సర తెరపై 'సీతా ఔర్ గీతా' చూస్తున్నాను.

"కిశోర్ 'హవా కె సాథ్ సాథ్.. ' భలే పాడాడు కదూ?" 

'ఊతప్పానికి ఉల్లిపాయలే రుచి' అనే సత్యాన్ని ప్రపంచంలో మొదటిసారి కనుగొన్నవాళ్ళా అన్నాడు సూర్యం (మావాడికి కిశోర్ కుమార్ పిచ్చి).

"అవునవును" 

అమెరికా అధ్యక్షుడి మాటకి తల ఊపే ఇండియా ప్రధాన మంత్రిలా అన్నాను.

(కిశోర్ కుమారా? గాడిద గుడ్డేం కాదు! ఇక్కడ ఫుల్లుగా హేమమాలినిని చూసేస్తున్నా.)

'షోలే' మొదటిరోజు ఈవెనింగ్ షో చూశాం. దార్లో బ్రిడ్జ్ పక్కన బలరాం హోటల్లో టీ తాగుతున్నాం.

"సినిమాకి అమితాబ్ చచ్చిపోయ్యే సీన్ హైలైట్."

నిండుసభలో శ్రీకృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దన పద్యాన్ని మెచ్చుకుంటున్నట్లుగా.. తల పంకిస్తూ అన్నాడు సూర్యం.

అదే సభలో ముందునించి మూడో వరసలో నించున్న నాలుగో భటుడిలా, వెంటనే.. "అవునవును!" అన్నాను.

కానీ నాకు హేమమాలిని 'బసంతి' సీన్లే నచ్చాయి. అయితే ద్రోహులే అతి వినయంగా ఉంటారని ఆ రోజు అనుభవ పూర్వకంగా గ్రహించాను. అందుకే - మనసులోని నా 'రాజద్రోహ కుట్ర' (హేమమాలిని అభిమానం) బయట పడనీకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాను.

మెడిసిన్ కోర్స్ అయిన వెంటనే సూర్యం బ్రాడీపేట వదిలేసి అమెరికా వెళ్ళిపొయ్యాడు. రాజు లేని రాజ్యం దిక్కులేనిదైపోయింది. అటు తరవాత సామంత రాజులూ దేశాలు పట్టిపోయారు. ఆ విధంగా మా బ్రాడీపేట గ్యాంగ్ ఆనతి కాలంలోనే ఎండలో ఉంచిన వెనిలా ఐస్ క్రీములా కరిగిపోయింది.

తరవాత కాలంలో హేమమాలిని ఏం చేసిందో తెలీదు, తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఎలక్షన్ల సందర్భంగా హేమమాలిని మొహం కనబడుతుంది. ఆమెలో ఇంకా అదే అందం, అదే డిగ్నిటీ. వావ్!

ప్రతి మనిషికి జీవితంలో ఒక్కోదశ ఉంటుంది. చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే ఇష్టం, సినిమాలంటే ప్రాణం. ఒకప్పుడు హేమమాలిని అందాన్ని అభిమానించాను. ఇవ్వాళ నా దృష్టిలో అందానికి వీసమెత్తు విలువ కూడా లేదు.. అదసలు విషయమే కాదు. ఇవన్నీ సహజమైన పరిణామాలని అనుకుంటున్నాను.

హేమమాలిని ఈరోజుకీ ఇంత అందంగా ఉండడానికి కారణం ఏమైయ్యుంటుంది? బహుశా హేమమాలినికి సావిత్రి, మీనాకుమారిల్లాగా కష్టాలు లేకపోవటం ఒక కారణం అయ్యుండొచ్చు. ఆల్రెడీ పెళ్లై, పిల్లలున్నవాణ్ని వివాహం చేసుకున్న సినిమా హీరోయిన్లు (ఎక్కువమంది) ఇబ్బందుల్లో పడ్డారు. కొందరు మాత్రమే హేపీగా ఉన్నారు. ఆ కొందర్లో హేమమాలిని ఉంది. అందుకు ధర్మేంద్రని అభినందించాలి.

చివరగా - నా జీవితంలో ఒకానొక దశలో నన్ను అలరించి, ఆనందింపచేసిన హేమమాలిని.. కడదాకా ఇలాగే ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బెస్టాఫ్ లక్ టు హేమమాలిని!

అంకితం :

నా జీవితంలో అతిముఖ్యమైన రోజుల్లో నాకు తోడుగా ఉన్నవాడు, నా ప్రియాతి ప్రియమైన నేస్తం సూర్యంకి (Dr.Surya P Ganti, cardiac anaesthesioligist, New Jersey, USA.).  

ఇప్పుడే అందిన ఫోటో :


హేమమాలినితో మా బ్రాడీపేట గ్యాంగ్ సభ్యుడు. పేరు తేజానంద్ గౌతం మూల్పూరు, వృత్తి నరాల వైద్యం (Neurologist), ఊరు వేటపాలెం (Huntsville, Alabama, USA).

(photo courtesy : Google)