Wednesday, 23 April 2014

'చెత్త' కబుర్లు


GHMC పారిశుధ్య కార్మికుల సమ్మె అట, హైదరాబాద్ రోడ్లన్నీ చెత్తతో నిండిపొయ్యుంటాయి. నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నట్లున్నారు, వారికి నా సానుభూతి.

సమాజంలో అనేక రకాల వృత్తులున్నయ్. క్షురక వృత్తి, చెప్పులు కుట్టే వృత్తి, న్యాయవాద వృత్తి, వైద్య వృత్తి.. ఇలా ఎన్నోరకాలు. 'తమలో ఎవరు గొప్ప?' అంటూ కళ్ళూ, చెవులు, ముక్కు వాదించుకునే ఓ సరదా కథ మనకి తెలిసిందే. అదేవిధంగా.. సమాజానికి అత్యంత అవసరమైన వృత్తి ఏది? అనే చర్చ చేస్తే, చెత్తని శుభ్రం చేసే పారిశుధ్య కార్మిక వృత్తే అత్యంత ముఖ్యమైనదని నా అభిప్రాయం.

ఎలా చెప్పగలం? సింపుల్. ఒక వృత్తి యొక్క విలువ తెలియాలంటే..ఆ వృత్తి సేవలు బంద్ చేసి, జరిగే నష్టాన్ని చూసుకోవాలి. వైద్యులు సమ్మె చేసినప్పుడు రోగులు చచ్చిపోతున్నారని మీడియా బాగా హైలైట్ చేస్తుంది. మరి - సమ్మె చెయ్యనప్పుడు ఆ చావులేమన్నా తగ్గుతున్నయ్యా? అనేది మాత్రం మీడియా రిపోర్ట్ చెయ్యదు. అందువల్ల వైద్యుల వల్ల మరణాలు తగ్గుతున్నయ్యని చెప్పేందుకు తగిన ఆధారాల్లేవు. అయితే - పారిశుధ్య కార్మికుల సమ్మె వల్ల సమాజానికి తీవ్రమైన అసౌకర్యం కలుగుతుందని చెప్పేందుకు మీడియా అవసరం లేదు.. సమ్మె సమయంలో వీధిలోకొస్తే చాలు, భరింపరాని దుర్గంధమే చాలా ఎఫెక్టివ్ గా చెబుతుంది.

ఎంతో ముఖ్యమైన ఈ చెత్త శుభ్రం చేసేవారి వృత్తి సమస్యల పట్ల మనం పెద్దగా స్పందించం. కుళ్ళు కంపు, ఈగల గుంపు మధ్యన పని చేస్తున్న ఆ కార్మికుల్ని అసలే పట్టించుకోం (నాకు పతంజలి 'ఖాకీవనం' గుర్తొస్తుంది.. పారిశుధ్య కార్మికులు, పోలీసుల మధ్య ఘర్షణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది). అత్యంత దుర్గంధ భూరితమైన ఈ పెంట పని చేసే కార్మికులు కూడా తప్పనిసరి పరిస్తితుల్లో మాత్రమే ఈ పని చేస్తుంటారు. అందుక్కొన్ని సామాజిక కారణాలు ఉన్నాయి. 

మధ్యతరగతి మేధావులు కులం పేరెత్తితేనే మొహం చిట్లిస్తారు, వాళ్ళ దృష్టిలో 'కులం' అనే పదం ఒక బూతుమాటతో సమానం. అసలు రోగాన్నే గుర్తించడానికే ఇష్టపడనప్పుడు వైద్యం ఎలా చేస్తాం? పారిశుధ్య కార్మికుల్లో అత్యధికులు అట్టడుగు కులాల వారవడం యాధృచ్చికం కాదు, ఇది మన పురాతనమైన కుల వ్యవస్థకి అద్దం పడుతుంది. ఈ విషయం మనం గుర్తించకపోతే, సమాజం అర్ధం కాదు. (మన దేశంలో కులం, దాని ప్రభావం అర్ధం చెసుకోదలచినవారు జైళ్ళలో ఎక్కువమంది తక్కువ కులంవారే ఎందుకుంటారో కూడా ఆలోచన చెయ్యాలి).

చివరగా - మనం ఆరోగ్యంగా జీవించడానికి, మన పరిసరాలు శుభ్రంగా ఉండడానికి పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో అవసరం. కావున ఇది చాలా పవిత్రమైన వృత్తి. పారిశుధ్య కార్మికుల సేవల్ని గుర్తిద్దాం, గౌరవిద్దాం. ఈ వృత్తిలో జీవిస్తున్నవారు చాల పేదవారు. కావున వీరి న్యాయమైన కోర్కెలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, అందుకు సభ్యసమాజం కూడా ప్రభుత్వాలపై తగినంత ఒత్తిడి తేవాలని కోరుకుంటున్నాను.


(photos courtesy : Google)