Sunday 25 May 2014

మోడీ విమర్శకుల్లారా! ఖబడ్దార్


"ఒరే సూడో సెక్యులరిస్టూ! నీకు దమ్ముంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గూర్చి రాయి." సవాలు విసిరాడు నా మిత్రుడు.

నా మిత్రుడు ఆరెస్సెస్ సభ్యుడు, మోడీకి వీరాభిమాని. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ద్వేషిస్తాడు. రాజకీయంగా ఈ అభిప్రాయాలు కలిగి వుండటం అతని హక్కు. ఆ హక్కుని ఎవరైనా గౌరవించాల్సిందే, ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు.

కొందరు అమాయకులు మనకి భావ ప్రకటనా స్వేచ్చ ఉందని అనుకుంటారు. కానీ ఆ స్వేచ్చ వంకాయ కూర గూర్చో, సినిమాల గూర్చో రాసినప్పుడు మాత్రమే ఉంటుంది. రాజకీయ భావాలకి మాత్రం స్వేచ్చ ఉండదు, ఈ స్వేచ్చ దేవతా వస్త్రాల్లాంటిది. (రాజకీయాలంటే రోజూ తెలుగు పత్రికలు రాసే జగన్, చంద్రబాబుల నామస్మరణ, విమర్శల పరంపర కాదు).

బాల్ థాకరే చనిపోయినప్పుడు ముంబాయిలో సెలవు ప్రకటించడాన్ని ఒక యువతి ఫేస్ బుక్ లో ప్రశ్నించింది, ఇంకో అమ్మాయి ఆ అభిప్రాయానికి లైక్ కొట్టింది. ఏవో సెక్షన్ల కింద ఇద్దర్నీ అరస్టు చేశారు. వాస్తవానికి ఆ అమ్మాయిలు లేవనెత్తిన ప్రశ్న విలువైనది, వివరంగా చర్చించదగ్గది. కానీ, దైవసమానుడైన థాకరే గూర్చి ప్రశ్నించడమే నేరంగా ముంబాయి పోలీసులు భావించారు.

ప్రొఫెసర్ U.R. అనంత మూర్తికి నరేంద్ర మోడీ రాజకీయాలు నచ్చవు. అందుకు ఆయనకున్న కారణాలు ఆయనకున్నాయి. ఆ కారణాలు అందరికీ నచ్చాలని లేదు కూడా. మోడీ గనక ప్రధాని అయితే తాను దేశం వదిలేస్తానన్నాడు. ఇదేమీ నేరపూరితమైన ప్రకటన కాదు. అనంత మూర్తి రాజకీయ అభిప్రాయాల గూర్చి చర్చ ఎంత జరిగిందో తెలీదు కానీ..  ఆయన్ని ఎగతాళి చెయ్యడం, కించపరచడం మాత్రం ఒక ఉద్యమంలా సాగింది. పాపం, ఇవ్వాళ అనంతమూర్తి పోలీసువారి రక్షణలో ఉన్నాడు!

మనకి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగింది. ఇందువల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల, ఎమర్జన్సీలో ఇందిరాగాంధీలా రాజకీయ వ్యతిరేకుల్ని అణిచెయ్యడం కుదరకపోవచ్చు (అనుకుంటున్నాను). అలాగే - కార్పోరేట్ మీడియా వండి వారుస్తున్న వార్తల్ని మాత్రమే చదివి ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాల్సిన దుస్థితి తప్పింది.

అయితే - ఇదే ఇంటర్నెట్ అనేక ముసుగు వీరుల్ని కూడా తయారు చేసింది. ఈ వీరులు తమకి నచ్చని భావాలు వ్యక్తం చేసినవారిని హీనంగా తిడతారు. ఆ రాసిన వ్యక్తిని చికాకు పెట్టడమే వీరి ఉద్దేశం. ఇదొక 'పధ్ధతి' ప్రకారం జరుగుతున్న కుట్ర. గత కొన్ని నెలలుగా రాజకీయంగా తమ నాయకుణ్ని వ్యతిరేకించిన వారిని ఎంత ఛండాలమైన భాషలో వీరు తిట్టారో చూస్తే ఆందోళన కలుగుతుంది. 

నేనామధ్య ఒక పాపులర్ తెలుగు నటుడి సినిమా చూశాను. నాకా సినిమా నచ్చలేదు, అదే అభిప్రాయం నా బ్లాగులో రాసుకున్నాను. కానీ - అప్పుడు నామీద తిట్ల పురాణంతో వేరేచోట ఒక చర్చ నడిచింది. నాకు కోపం, ఆశ్చర్యం కలిగాయి. అయితే ఈ సినీనటుల అభిమానం ఉన్మాద స్థాయిలో ఉంటుందనీ, వారి 'మనోభావాలు' దెబ్బ తిన్నప్పుడు పిచ్చికుక్కల స్థాయిలో మొరుగుతారనీ అర్ధం చేసుకున్నాక పట్టించుకోవటం మానేశాను.

మొన్న ఎన్నికల సందర్భంగా జగన్, చంద్రబాబుల్ని తిట్టడంలో రెండు కులాల మధ్య భీభత్సమైన బూతుల పోటీనే జరిగింది.

అంచేత - ఇప్పుడు నేను మోడీపై ఏదన్నా రాస్తే, అందులో పొరబాటున (నా ఖర్మ కాలి) మోడీ భక్తులకి నచ్చందేదైనా ఉంటే, వారితో తిట్టించుకునే ఓపిక లేదు.

అదే నా స్నేహితుడితో అన్నాను.

"నేను నరేంద్ర మోడీ గూర్చి ఎందుకు రాయడం? మీ ఆరెస్సెస్ వాళ్ళతో కలిసి 'జై శ్రీరాం! శిరో మార్!' అంటూ కవాతు కర్రల్తో నా బుర్ర రాం కీర్తన పాడించటానికా? అందుకే ఒప్పేసుకుంటున్నాను - నాకు నరేంద్ర మోడీ గూర్చి రాసేంత దమ్మూ, ధైర్యం లేదు. నన్నొదిలెయ్! అయినా - నీ అభిమాన నాయకుడు అద్భుత విజయం సాధించాడు. మీ సంఘ పరివారం మోడీ విమర్శకుల్ని భయపెట్టడంలో కూడా గొప్ప విజయం సాధించింది. ఈ విజయాల్ని ఎంజాయ్ చెయ్యక నాతో ఈ చాలెంజ్ లేమిటి?" నవ్వుతూ అన్నాను.

ముగింపు :

నా మిత్రుడు నా సమాధానానికి ఒప్పుకోలేదు. నేను నరేంద్ర మోడీ గూర్చి ఏదోకటి రాయాల్సిందేనని పట్టు పట్టాడు. ఓకే! ఇదుగో రాస్తున్నా.. చదువుకో మిత్రమా!

'శ్రీశ్రీశ్రీ నరేంద్ర మోడీగారు కారణ జన్ములు, అవతార పురుషులు. శ్రీ మోడీగారు భారత దేశ రాజకీయాల్లో కోహినూర్ వజ్రం వంటివారు. జై నరేంద్ర మోడీ! జైజై నరేంద్ర మోడీ!! మోడీ విమర్శకులారా! ఖబడ్దార్. మా మోడీగార్ని ఎవరన్నా ఏమైనా అంటే డొక్క చించుతాం జాగ్రత్త!

ఇట్లు,

ఒక నరేంద్ర మోడీ అభిమాని.'

ఇది చదివిన నా స్నేహితుడు గర్వంగా, తృప్తిగా తలాడించాడు (నేను బతికిపోయ్యాను).  

ఉపసంహారం :

ఇది రాస్తుంటే నా భార్య వచ్చి చూసింది. "ఏంటి మోడీ గూర్చి రాస్తున్నారా? మీకు మాడు పగిలిందే!" అంటూ సంతోషంగా పక్క రూములోకి వెళ్ళింది. ఆవిడకి మొదట్నుండీ నా బ్లాగ్రాతలు ఇష్టం లేదు, అంచేత - నెట్లో నన్ను ఎవరైనా (ఎందుకైనా సరే) తిడితే ఆవిడకదో తుత్తి! అంటే - మోడీ గూర్చి రాస్తే తిట్లు గ్యారెంటీ అని ఆవిడక్కూడా ఒక అవగాహన ఉందన్నమాట!

(picture courtesy : Google)