Friday, 30 May 2014

ప్రశ్నిజం


వేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం, మండుటెండ, వేడిగాలి. 

అబ్బా! సెగలు, పొగలు, నిప్పుల కొలిమిలో నిల్చున్నట్లు, బొగ్గుల కుంపట్లో పడుకున్నట్లు.. ఇవ్వాళ ఇంత వేడిగా వుందేమిటి!

ఆకాశం ప్రశాంతంగా ఉన్నట్లు దొంగనిద్ర నటిస్తుంది, పైన ఒక్క మబ్బు తునక లేదు. నేల మండిపొతుంది, చెట్లు కాలిపోతున్నాయి, చేమలు మాడిపోతున్నాయి.. అసలు భూదేవే కాలిపోతున్నట్లుంది.

'దేవుడా! నన్ను కాపాడు, నేను నీ బిడ్డని, నామీద కోపమొచ్చిందా తండ్రీ? నీకే కోపమొస్తే నేనెవర్ని వేడుకోవాలి. రక్షించు తండ్రీ! రక్షించు.' వందోసారి దేవుణ్ని వేడుకున్నాడా వృద్దుడు.

అతనో యాచకుడు. ఎన్నోయేళ్ళుగా ఆ రోడ్డు పక్కనున్న వేపచెట్టు కింద అడుక్కుంటున్నాడు. కొన్నాళ్ళక్రితం ఆ రోడ్డు వెడల్పు చేయ నిశ్చయించిన మునిసిపాలిటీ వారు దశాబ్దాల వయసున్న ఆ వేపచెట్టుని కొట్టేశారు. ఆ విధంగా మానవజాతి అభివృద్ధి కొరకు ఒక వృక్షం హత్య చేయబడింది. (ఎవరూ చావకపోతే అభివృద్ధి సాధ్యం కాదు).

ఆ రోజునుండీ అతను నీడ కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు. ఆ చుట్టుపక్కలా ఎక్కడా చెట్టు లేదు, కనీసం నీడ కూడా లేదు. ఆ పక్కగా కొన్ని దుకాణాలున్నాయి. కానీ - ఆ దుకాణాలవారు తమ దుకాణం ముందు వృద్ధుని బిక్షాటన దుకాణాన్ని ఒప్పుకోలేదు.

అతనికి నెత్తిన నీడ కరువైంది. కొన్నిరోజులుగా కడుపుకి తిండి కూడా కరువైంది. అంచేత - ప్రస్తుతం నీడలేక, తిండి లేక, దాహంతో అల్లాడిపోతున్నాడు.

రోడ్డుపై జనసంచారం లేదు. ఆ వృద్ధుని శరీరం ఎండకి కాలిపోతుంది, వణికిపోతుంది. నీరసంతో కళ్ళు మూసుకు పోతున్నాయి, క్రమేపి ఒరిగిపోతున్నాడు.

దాహం.. నోరెండిపొతుంది, దాహం.. నాలుక పిడచకట్టిపోతుంది, దాహం.. నరాలు తోడేస్తున్నాయి, ఆకలి.. కళ్ళ ముందు చీకట్లు, ఆకలి.. గుండెల్లో నిప్పులు.

ఇంక దేవుడు తనని కాపాడడని అర్ధమైపోయింది.

'దేవుడా! నన్ను నీలో కలిపేసుకో. నాకిక ఆకలి కేకలు, దాహపు మాల్గులు, రోగపు నాదాలు, ఆర్తనాదాలు.. ఏమీ లేకుండా చేసెయ్యి.' వృద్దుడు మౌనంగా ప్రార్ధించాడు.

కొద్దిసేపటికి వేటగాని దెబ్బకి ఒరిగిపోయిన జింకలా, నిదానంగా రోడ్డు మీదకి పడిపొయ్యాడా వృద్ధుడు. అక్కడి దుకాణాల వాళ్ళు ఆ వృద్దుడు ఎండకి మండుతూ ఒరిగిపోవడం చూస్తూనే వున్నారు, కానీ - వాళ్ళెవరూ అతన్ని పట్టించుకోలేదు.

ఆ దుకాణదారులు కొన్నాళ్ళపాటు తమ దుకాణాలు మూసేసి కుటుంబాలతో సహా సంపూర్ణ దక్షిణ భారత దేశ పుణ్య క్షేత్రాల్ని భక్తిగా దర్శించుకుని ఇవ్వాళే దుకాణాల్ని తెరిచారు, అంచేత వాళ్ళు తీవ్రమైన వ్యాపార హడావుడిలో వున్నారు

ఇంతలో అటువైపుగా నలుగురు యువకులు వచ్చారు, వారికి సుమారు ఇరవయ్యేళ్ళు వుండొచ్చు. వారి టీ షర్టుల మీద చె గువేరా బొమ్మ ముద్రించి వుంది. వారు తెలుగు సినిమా హీరో అభిమానుల్ట. ఆ హీరోకి రాజకీయ జ్ఞానం దండిగా వుందిట. ఈమధ్యే ఏదో పుస్తకం కూడా రాశాట్ట. ఆ యువకులు తమ హీరో పిలుపు స్పూర్తిగా - ప్రస్తుతం దేశసేవ చేసే పన్లో వున్నారు.

ఆహా! ఏమి మన సౌభాగ్యము! సినిమాలు తీసి యువతని అభిమాన మత్తులో ముంచి నాలుగు డబ్బులు చేసుకుందామనుకునే స్వార్ధపరులున్న ఈ రోజుల్లో ఒక సినిమా హీరో - యువకుల్ని సామాజికంగా, రాజకీయంగా ఉత్తేజ పరుచుటయా! గ్రేట్!

ఆ యువకులు నేలకొరిగిన వృద్దుడిపై ఒంగి చూస్తూ, ఒకరి తరవాత ఇంకొకరు ప్రశ్నల వర్షం కురిపించారు.

"ఓ పెద్దాయనా! ఎవర్నువ్వు? ఎందుకిలా ఎండలో పడిపొయ్యావు?"

"నీరసంగా వుందా?"

"దాహంగా వుందా?"

"ఆకలిగా వుందా?"

ఆ వృద్దుడికి మాట్లాడే ఓపిక లేదు. నీరసంగా, దీనంగా వాళ్ళని చూశాడు. అతని మొహం ప్రేత కళ పడింది. 

అయితే - అన్ని ప్రశ్నలడిగిన ఆ యువకులు, ఆ తరవాత అతన్ని పట్టించుకోలేదు. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోసాగారు.

"ప్రస్తుతానికింతే! ఈ ముసలాయన మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ - మన హీరో ప్రశ్నించమనే చెప్పాడు. ఆ ప్రశ్నించే పనిని విజయవంతంగా పూర్తి చేశాం."

"అవును, ప్రశ్నలడగమన్నాడే గానీ సమాధానం వినమని మన హీరో తన పుస్తకంలో రాయలేదు."

"ఆయన ప్రస్తుతం సినిమా షూటింగులో ఉన్నాడు, వచ్చాక ఇంకో పుస్తకం రాస్తాళ్ళే! అప్పుడది ఫాలో అవుదాం."

"ఆ పుస్తకం పేరు 'జవాబిజం' అవ్వచ్చు."

"అప్పటిదాకా ఇలా ప్రశ్నిస్తూ ఉండటమే మన రాజకీయ కార్యాచరణ."

"అవునవును, ఇవ్వాల్టికి ఈ ముసలాయన్తో కలిపి మొత్తం పదిమందిని ప్రశ్నించాం."

ఇలా మాట్లాడుకుంటూ ముందుకు సాగారు ఆ యువకులు.

ముగింపు :

రాయడానికి పెద్దగా ఏం లేదు.. కొంతసేపటికి ఆ వృద్దుడు చనిపొయ్యాడు. అంతే!