Monday, 5 May 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 4


సినిమాల్లోంచి సమాజంలోకి - 3 లో మన ఆలోచనల్లో రాచరిక లక్షణాల గూర్చి రాశాను. ఇవ్వాళ - మన 'సమాజంలో స్త్రీపురుషులు సమానులేనా?' అన్న పాయింటుతో కొన్ని ఆలోచనలు రాస్తాను.   

రాచరిక, ఫ్యూడల్ వ్యవస్థల్లో మగసంతానానికి ఎంతో విలువుంది. పురాణాల్లో కూడా రాజులు కొడుక్కోసం యజ్ఞాలు చేశారే గానీ, కూతురు కోసం చేసిన దాఖలా లేదు (నాకు తెలిసి). అంచేత - నేటి యువరాజే రేపటి రాజు, నేటి రాజకీయ నాయకుడి పుత్రుడే రేపటి ఎమ్మెల్యే, నేటి హీరో కొడుకే రేపటి హీరో. విషయం ఇంతుంది కాబట్టే గర్భిణీ స్త్రీల పొట్ట స్కానింగ్ అంత (అన్)పాపులర్ అయ్యింది.

స్త్రీలు పురుషుల కన్నా పరమ తక్కువ, ఈ పాయింట్ ప్రూవ్ చెయ్యడం కోసం ఎన్ని సినిమాల్నైనా కోట్ చెయ్యొచ్చు. పాత సినిమాల్లో 'ఏవండి! మీకు దణ్ణం పెడతాను, మీకు భార్యలా కాకపోయినా కనీసం మీ పాదాల దగ్గర ఇంత చోటైనా ఇవ్వండి, పనిమనిషిలా మీకు సేవ చేసుకుంటాను' మార్కు ఏడుపుగొట్టు డైలాగులు బోల్డెన్ని! భర్త ఎంతమంది ముండలెంట తిరిగినా, తిరిగితిరిగి చివరికి తన దగ్గరకే వస్తాడని పాత హీరోయిన్ల (ప్రేక్షకుల) నమ్మకం.

అవును మరి! పెళ్ళంటే నూరేళ్ళ పంట గదా! (ఏవిటోయ్? మన పవిత్ర హిందూ సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నావు? అయినా - ఈ సెంటిమెంటు మగాళ్ళకి బాగానే వర్కౌట్ ఆయిందిగా? అది మన మగాళ్ళకి గోల్డెన్ పీరియడ్. ఇంక ఆపు నీ ఏడుపు) నాకైతే మాత్రం ఆ సినిమాలు ఇప్పుడు చూస్తే ఆ వీర పతిభక్తి డోకొచ్చేంత రోతగా ఉంటుంది.

మిత్రులారా! ఇన్ని మాటలేల? సినిమా కథల్లో స్త్రీ వివక్ష నాగార్జునా సిమెంటంత ధృఢమైనది, మన్నిక గన్నది. ఒక బాక్సాఫీసు ఫార్ములాగా పేరు గాంచినది. అంచేత - ఆ సినిమాల్ని వాటి మానాన వదిలేసి.. ఇవాల్టికి సినీజీవుల్ని ఉదాహరణగా తీసుకుంటాను. తెలుగువాడు సెల్ ఫోన్లు వాడతాడు, కానీ - ఆలోచనలు మాత్రం గ్రహం బెల్ టెలీఫోన్ కనిపెట్టినప్పటి కాలం నాటివి. ఇంటర్నెట్ పుణ్యామాని 'అంతర్జాతీయ పురాణ పురుషులు' కూడా అవతరించారు, ప్రస్తుతం వీరు సోషల్ మీడియా ద్వారా పవిత్ర హిందూ ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపిస్తున్నారు.

ఎన్టీఆర్ మొదటి భార్య చనిపోయింది, కొన్నాళ్ళకి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు. అలా చేసుకునేందుకు ఎన్టీఆర్ కి పూర్తి స్వేచ్చ ఉంది. ఇది పూర్తిగా ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన వ్యక్తిగత విషయం. వారి చర్యని విమర్శించే హక్కు ఎవరికీ లేదు, ఉండరాదు కూడా. కానీ మన తెలుగు సమాజం ఎన్టీఆర్ రెండోపెళ్లి పట్ల నెగెటివ్ గా స్పందించింది. 

మొదటి భర్తకి విడాకులు ఇచ్చినందుకు లక్ష్మీ పార్వతిని ఒక విలన్ గా చూసింది. ఈ కారణాన - ప్రజల్లో ఆవిడ పట్ల ఉన్న దురభిప్రాయాన్ని చంద్రబాబు రాజకీయంగా కేష్ చేసుకున్నాడు. ఆవిడ రాష్ట్రంపై రాజకీయ పెత్తనం చేస్తున్నట్లు ప్రచారం చేశాడు, అధికారాన్ని కైవసం చేసుకోవటంలో విజయం సాధించాడు. ప్రజలకి లక్ష్మీపార్వతిపై చులకన భావం ఆల్రెడీ మైండ్ లో రిజిస్టరై ఉండటం చంద్రబాబుకి కలిసొచ్చింది.

అసలు - లక్ష్మీపార్వతి పట్ల తెలుగువాళ్ళకి అంత చులకన భావం ఎందుకు? అందుకు కారణాలు రెండు. ఒకటి - ఆవిడ భర్తని 'వదిలేసిన' భార్య (ఈ పవిత్ర పుణ్యభూమిలో భర్తలు భార్యని ఎందుకైనా వదిలెయ్యొచ్చు, భార్యలు మాత్రం భర్తని ఎందుకైనా సరే వదిలెయ్యరాదు), రెండు - ఆర్ధిక తారతమ్యం. అందుకే - లక్ష్మీపార్వతి తెలుగు సమాజం నుండి వ్యతిరేకతని ఎదుర్కొంది. కావునే - ఎన్టీఆర్ మరణంతో ఆవిడ ఇబ్బందులు పడ్డప్పుడు - 'తిక్క కుదిరింది' అని సంతోషించిన ఆడవాళ్ళున్నారు. అదే ఎన్టీఆర్ ఏ టాటా చెల్లెల్నో, బాటా మేనకోడల్నో రెండో వివాహం చేసుకున్నట్లైతే మన తెలుగువాడి ఆత్మగౌరవం ఉప్పొంగి మురుక్కాలవలా వరదలై ప్రవహించేది.

సమాజానికి తగ్గట్లుగా ఎన్ని ముసుగులేసినా, మన 'పెద్దమనుషుల' మనసులోని అసలు భావాలు చాలాసార్లు బయటకి తన్నుకొస్తాయి. బీసీ, యస్సీ కులాల పిల్లలు అగ్రకులం పిల్లల్ని ప్రేమిస్తేనో / పెళ్లి చేసుకుంటేనో.. తక్కువకులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళని 'వల'లో వేసుకున్నారని అంటారు. ఆ తక్కువ కులంవాళ్ళ పేదరికం వారి 'దురాలోచన'కి తిరుగులేని ఋజువుగా నిలబడుతుంది. మన తెలుగునాట ఒకప్పుడు అమ్మాయిల మౌనపోరాటాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఆ పోరాటాలు చేసిన యువతులు, అబ్బాయి కన్నా 'తక్కువస్థాయి' వారు. అంచేత మన అగ్రకుల మేధావులకి వారి పోరాటం నచ్చలేదు.

ఈ కులమత భావనలకి విరుద్ధంగా తెలుగులో సాహిత్యం అయితే ఉందిగానీ, ఆ సాహిత్యం ఆయా రచయితలకి అవార్డులు, పురస్కారాలకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ సాహిత్య సభలు ఆయా పండితుల కరతాళ ధ్వనుల కోసమే గాని, సమాజానికి ప్రయోజనం ఉన్నట్లు తోచదు. ఈ రచయితలకీమధ్య అమెరికా చాన్సులు కూడా బాగానే తగుల్తున్నాయి, వారికి అభినందనలు, థాంక్స్ టు అమెరికా తెలుగు సంఘాలు. తెలుగునాట సమాజం బాగుపడక పోయినా రచయితలైనా బాగుపడుతున్నారు, సంతోషం.

ఈ సంగతులు రాయడానికి పెద్దగా ఆలోచించనక్కర్లేదు, చాలా కొద్దిగా ఆలోచిస్తే చాలు. ఈ భీకర వేసవిలో కూడా రోజూ ఐదొందలు దాకా మందు, బిరియానిలకి ఖర్చు చేసే 'ధనవంతుల'నీ.. ఒక మంచిపుస్తకానికి కనీసం పది రూపాయిలు కూడా ఖర్చు చేసి కొనలేని 'పేదవారి'నీ.. ఎందెందు చూసినా అందందే కాంచగలము. ఓపిక ఉన్నవాళ్ళు పుస్తకాల షాపులు, బార్లలో సర్వే నిర్వహించుకోవచ్చు. కావున - సాహిత్యం, సమాజం.. దేన్దారి దానిదే అని నా నమ్మకం.

సమాజాన్ని అర్ధం చేసుకోటానికి పనికొచ్చే ఇంకో ఉదాహరణ హీరో కృష్ణ కూతురు ఉదంతం. ఆ అమ్మాయి హీరోయిన్ వేషాలు వేద్దామని ముచ్చట పడింది. కానీ దురదృష్టవశాత్తు - ఆ అమ్మాయి 'గొప్పవంశం'లో పుట్టిన ఆడపడుచు. అంచేత ఆ అమ్మాయి తీసుకున్న కెరీర్ నిర్ణయం మన అభిమాన పంఖాలకి నచ్చలేదు. ఆ అమ్మాయి సినిమాల్లోకి రావడం కుదర్దంటే కుదర్దాన్నారు! కాదనే ధైర్యం చెయ్యలేక ఆ అమ్మాయి ఆ ఉద్దేశం మానుకుంది. ఆ పంఖాధములే కృష్ణ కొడుకుని హీరోగా నెత్తిన పెట్టుకుని మోశారు, అతనికి 'ప్రిన్స్' అని ముద్దు పేరు కూడా పెట్టుకుని పులకించిపొయ్యారు. రాజులు పొయ్యారు, రాజ్యాలూ పొయ్యాయి.. మరీ ప్రిన్సులు పొయ్యేదెన్నడో!

ఇలా జెండర్ బయాస్ గూర్చి చాలాసేపు రాస్తూ పోవచ్చు, కానీ నే చెప్పదల్చుకున్న పాయింట్ చెప్పేశాను కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. అలాగే - 'సినిమాల్లోంచి సమాజంలోకి' అంటూ విషయాన్ని చూయింగ్ గమ్ లాగా సాగదీస్తూ, బుడగలూదుతూ నాలుగు భాగాలు రాశాను. ఇంక ఈ టాపిక్ నాక్కూడా బోర్ కొట్టేసింది, కావున.. సెలవు.

(picture courtesy : Google)