Monday 25 August 2014

బకెట్‌తో సవాల్? బీ కేర్‌ఫుల్!


సమయం సాయంకాలం ఆరుగంటలు. పిల్లల కోసం నూడిల్స్ చేస్తున్నాను. ఇంతలో నా సుపుత్రుడు స్టవ్ దగ్గరకొచ్చి ఒక యూట్యూబు వీడియో చూపించాడు. అదేదో ఐస్ బకెట్ ఛాలంజ్‌ట! నెత్తిన బకెట్లతో ఐస్ కుమ్మరించుకుంటున్నారు. 'ఇదంతా ఒక నరాల రోగానికి చందా వసూలు చెయ్యటానికి!' పిల్లాడు తన జ్ఞానాన్ని నాక్కొంత పంచాడు. ఏవిటో! కొందరికి సరదా, మరికొందరికి పబ్లిసిటీ పిచ్చి, ఇంకొందరికి రోగుల పట్ల ప్రేమ. సరే! ఎవరి గోల వారిది, కాదన్డానికి మనమెవరం?

అయినా మనకి ఈ సవాళ్ళు కొత్త కాదు. 'చెంచులక్ష్మి' సినిమాలో అంజలీదేవి జిక్కి కృష్ణవేణి స్టోన్లో 'చెట్టులెక్కగలవా? ఓ నరహరి పుట్టలెక్కగలవా?' అంటూ నాగేస్సర్రావుకి సవాల్ విసిరిందిగా! అయితే - మన దేశంలో ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ కుదర్దనుకుంటున్నాను. కారణం - మనకి నీళ్ళ సమస్య వుంది. నీళ్ళున్నా ఫ్రిజ్జులుండవు. ఫ్రిజ్జులున్నా నీళ్ళు గడ్డకట్టేదాకా కరెంటుండదు. ఎవరన్నా మరీ ముచ్చట పడితే శవాల్ని పడుకోబెట్టే ఐస్ దిమ్మల్ని కొనుక్కుని, సుత్తితో ముక్కలుగా కొట్టుకుని, బకెట్లో పోసుకుని నెత్తిన కుమ్మరించుకోవాలి. అయినా మన మండుటెండలలో, ఉక్కపోతలో - నెత్తిన ఐస్ నీళ్ళు పోసుకోవడం ఛాలెంజ్ ఎలా అవుతుంది! అయితే గియితే వేణ్ణీళ్ళు గుమ్మరించుకోడం ఛాలెంజ్ అవ్వాలి గానీ!

వుంటానికి దేశాలన్నీ ఒక ప్రపంచ మేప్‌లోనే వున్నాయి. కానీ సమస్యలు మాత్రం వేరువేరు. ఆఫ్రికా ఖండం సమస్త రోగాలకి నిలయం. అమెరికావాడికి టీబీ, మలేరియా సమస్య లేదు. టైఫాయిడ్, కలరా అంటే ఏంటో తెలీదు. కాబట్టే వాళ్ళు నరాల రోగ స్పృహ కోసం ఐస్ బకెట్లు నెత్తిన కుమ్మరించుకుంటున్నారు. ఐస్ కుమ్మరించుకోటానికి రోగానికి సంబంధం ఏంటో తెలీదు.

తిండానికి తిండే లేనివాడికి చద్దన్నమే పరమాన్నం. తిండి సమస్య కానివాడికి - భోజనంలో ఎన్ని పదార్ధాలు వుండాలి? అవి యెలా వడ్డించుకోవాలి? అన్నదే సమస్యవుతుంది. అంటే మొదటి సమస్య తీరితే గాని, రెండో సమస్య రాదు. పేదదేశాలు మలేరియా, ఫైలేరియా సమస్యల్తో కునారిల్లుతుంటాయి. కాబట్టి వాళ్లకి నరాల రోగం సమస్యే కాదు. మనది పేదదేశం అంటే దేశభక్తులకి కోపం రావచ్చు గానీ, వైద్యారోగ్య విషయాల్లో మన్ది ఆఫ్రికా దేశాల స్థాయని నా అభిప్రాయం.

మనదేశంలో ఫేస్బుక్ యువత సంఖ్య భారీగానే వుంది. వీళ్ళకి సామాజిక అవగాహన (వున్నట్లే) వుంది. అందుకే బొంబాయి ఐదు నక్షత్రాల హోటల్ మీద దాడి జరిగినప్పుడూ, ఢిల్లీ రేప్ సంఘటన సమయంలోనూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. సాధారణంగా వీళ్ళు అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళని అనుకరిస్తుంటారు. మరి మన దేశంలోని ఫేస్బుక్కులోళ్ళు నెత్తి మీద ఐస్ బకెట్లు కుమ్మరించుకునే కార్యక్రమం మొదలెట్టారో లేదో తెలీదు.

బకెట్ ఐసో, బూడిదో.. ఏదైతేనేం - నెత్తిన కుమ్మరించుకోడం సరదాగానే వుంటుంది. ఐతే - ఆ సరదా కోసం ఎంచుకోవలసిన కారణం మాత్రం ప్రభుత్వాలకి ఇబ్బంది కలగని విధంగా వుండాలి. ఉదాహరణకి - అమెరికాలో అమెరికావాడి యుద్ధాలకి వ్యతిరేకంగానో, చైనాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలనో బకెట్ కాదు.. కప్పు ఐస్ గుమ్మరించుకున్నా చాలా ప్రమాదం!

ఏ సమాజంలోనైనా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేసినా అభినందనీయమే. మనకైతే నరాల జబ్బుల ఛాలెంజిలు అవసరం లేదనుకుంటున్నాను. అంటే - ఆ రోగాలకి వైద్యం అవసరం లేదని కాదు, అంతకన్నా ముఖ్యమైన సమస్యలే మనకున్నాయని నా అభిప్రాయం. 

అందువల్ల - మన ఛాలెంజిలు వేరుగా వుండాలి. మనకి చాలా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు వున్నాయి. మీరు ఏ హాస్టల్లోనైనా సరే - ఒక ముద్ద అన్నం తినగలరా? ఛాలెంజ్! ఒక గుక్క నీళ్ళు తాగ్గలరా? ఛాలెంజ్! ఆ బాత్రూముల్లో (ముక్కు మూసుకునైనా సరే) ఒక నిమిషం ఉండగలరా? ఛాలెంజ్!

ఇట్లాంటి ఛాలెంజిలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తే రెండురకాల ఫలితం రావచ్చు. ఒకటి - ప్రభుత్వాలకి బుద్ధొచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ స్థితిగతుల్ని యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చెయ్యొచ్చు. రెండు - వాస్తవాల్ని ఎత్తి చూపినందుకు ప్రభుత్వానికి కోపం రావచ్చు, దీన్నో అవమానంగా భావించి మిమ్మల్ని ఏదోక కేసులో ఇరికించొచ్చు. నేనైతే మాత్రం రెండోదే జరుగుతుందని భావిస్తున్నాను.

అంచేత - ప్రభుత్వాలకి కోపం రాకుండా మన సరదా తీర్చుకునే మార్గం గూర్చి ఆలోచిద్దాం. 'గ్లోబల్ వార్మింగ్ పరిశోధన చందాల నిమిత్తం ఒక ఛాలెంజ్!', 'వీధికుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెయ్యాల్సిన ఆవశ్యకతని ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు మరియూ అందు నిమిత్తం నిధుల కోసం ఒక ఛాలెంజ్!' ఇలాంటి ఛాలెంజిల్ని మనం ఎన్నైనా చేసుకోవచ్చు!

ప్రభుత్వాలకి ఇబ్బంది కలిగించని ఇటువంటి ఛాలెంజిల్ని ఎంచుకుంటే మన ఒంటికి మంచిది, పైగా మంత్రిగారు ముఖ్యఅతిథిగా వేంచేసి మన్ని అభినంధించొచ్చు. ఆ విధంగా మన సరదా తీరుతుంది, యూట్యూబులో వీడియో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే - బకెట్లతో నెత్తిన ఏం కుమ్మరించుకోవాలో తోచట్లేదు, ఈ విషయమై మీ సలహాలకి ఆహ్వానం. 

మిత్రులారా! ముందు మీరు మీమీ బకెట్లు రెడీ చేసుకోండి! మిగిలిన సంగతులు తరవాత ఆలోచిద్దాం!

(picture courtesy : Google)