Thursday 21 August 2014

'గోవులొస్తున్నాయి జాగ్రత్త!' కబుర్లు - మొదటి భాగం


ఒక నవలకి ఒకటికి మించి పేర్లు ఎప్పుడైనా విన్నారా? బీనాదేవి 'హేంగ్ మి క్విక్'కి పుణ్యభూమి కళ్ళుతెరు అనీ, కేశవరెడ్డి 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్'కి క్షుద్రదేవత అనీ మారుపేర్లు వున్నాయి. అయితే ఇవి సీరియల్‌గా వచ్చినప్పుడు ఒక పేరుతోనే వచ్చాయి. నవలగా అచ్చైనప్పుడు రెండోపేరు తగిలించుకున్నాయి. రాచకొండ విశ్వనాథశాస్త్రి మాత్రం రాసేప్పుడే తన నవలకి ఏకంగా 'గుర్రపుకళ్ళెం అను మరిడిమహాలక్ష్మి కథ (లేక) గోవులొస్తున్నాయి జాగ్రత్త!' అంటూ మూడు పేర్లు పెట్టేసుకున్నాడు!

కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా అంటూ శ్రీశ్రీ 'ఋక్కులు' రాసుకున్నాడు. 'మహాప్రస్థానం'పై ఘోరమైన అభిమానంతో 'కుక్కపిల్ల' మొదలుకుని 'గుర్రపు కళ్ళెం' దాకా కథలు రాసేశాడు రావిశాస్త్రి. ఆయనీ కథని 'గుర్రపు కళ్ళెం' అన్నాడే గానీ - ఈ కథావస్తువుకి గుర్రపు కళ్ళెంతో సంబంధం లేదు. అందువల్లనే - ఉంటానికి మూడు పేర్లున్నా, ఈ నవల 'గోవులొస్తున్నాయి జాగ్రత్త!'గానే ప్రసిద్ధి చెందింది.

అనాదిగా ఎందఱో మహానుభావులు ఈ నవలని చపాతీ పిండిలాగా పిసికేసి తీవ్రంగా విశ్లేషించారు, ఇంక విశ్లేషించడానికి ఎవరికీ ఏమీ మిగల్చలేదు. కావున - ఇప్పుడు మీరు చదువుతున్నది నవలా పరిచయమో, విశ్లేషణో కాదు. ఇవి నా 'గోవులొస్తున్నాయి జాగ్రత్త' ఆలోచనలు లేక కబుర్లుగా అనుకోవచ్చు.

"పేదలెవ్వరూ ఇది చదవరాదు. చదివినచో వారు శిక్షలకు పాత్రులగుదురు" - కిరీటిరావు.

అనే వాక్యంతో ఈ నవల మొదలవుతుంది. కిరీటిరావు అనే ఒక 'నెగెటివ్ క్యారెక్టర్' ద్వారా కథ చెప్పిస్తాడు రావిశాస్త్రి. కథ యావత్తు (పేదలని అసహ్యించుకుంటూ) బ్రిటీష్ ఇండియా జమీందార్ల దృష్టికోణం నుండి చెప్పబడింది.ఈ రకమైన ఎత్తుగడ చాలా తెలివైనది, గడుసైనది, క్లిష్టమైనది. కొత్తగా రావిశాస్త్రిని చదివేవాళ్లకి ఆశ్చర్యంగా వుండొచ్చు (అర్ధం కాకనూ పోవచ్చు)!

కిరీటిరావు 1917 జనవరి ఫస్టున పుట్టాడు. మెజిస్ట్రేట్‌గా పనిచేసి అర్లీగా రిటైరైపొయ్యాడు. ఈ కిరీటిరావు బంధువైన రాజయోగి పెదనాయనగారి చిన్నప్పటి జ్ఞాపకాలే ఈ నవల.

రాజయోగి పెదనాయనగారు తన జమీలో లచ్చయ్యమ్మ అనే ఒక పాలు పితికే స్త్రీ యొక్క కళ్ళు చెదిరే అందానికి తీవ్రంగా ఆకర్షితుడవుతాడు. ఆనక ఆ లచ్చయ్యమ్మ అనబడు మరిడి మహాలక్ష్మిని బలవంతంగా చెరబడతాడు. అందుకు సహకరించని ఆమె కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. లచ్చయ్యమ్మని బంధించి లొంగదీసుకుంటాడు. ఆమెకి ఒక కొడుకుని కంటాడు. తన కొడుకు జమీకి హక్కుదారుడంటుంది లచ్చయ్యమ్మ. తక్కువ కులం స్త్రీకి పుట్టినవాణ్ణి వారసుడుగా ఒప్పుకోడానికి ఇష్టపడక, కిరీటిరావుని దత్తత తీసుకునే ఉద్దేశంతో జమీకి (సువర్ణసుందర పురం) పిలిపించుకుంటాడు రాజయోగి. అటు తరవాత అక్కడ జరిగే కథ ఈ నవలకి క్లైమేక్స్.

నవల మొదటి లైన్ దగ్గర్నుండి చివరదాకా ఒకేరకమైన మూడ్ కొనసాగుతుంది. ఇందుకు రావిశాస్త్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని అర్ధం అవుతుంది. తెలుగులో ఒక నవల ఆసాంతమూ వ్యంగ్యంగా ఇంకెవరన్నా రాశారా? నేనైతే ఎవరూ రాయలేదని అనుకుంటున్నాను. రావిశాస్త్రి కథ చెప్పే విధానం ఎంత విలక్షణంగా వుంటుందో పరిపూర్ణంగా కాంచవచ్చును.

కారణం - జమీందార్ల వంశానికి చెందిన కిరీటిరావు ఫస్ట్ పర్సన్‌లో కథ మొత్తం చెబుతాడు. 'మా రాజయోగి పెదనాయనగారు ఎంతో మంచివారు. లచ్చయ్యమ్మ మా పెదనాయనగారి మంచితనానికి లొంగని తక్కువ కులపు అలగా ముండ' అంటూ తీవ్రంగా విమర్శిస్తూ కథనం కొనసాగుతుంది!

డబ్బుతో, అధికారంతో బలిసిన ఒక దుర్మార్గపు కోణం నుండి (అమాయకంగా) కథని చెబుతున్నట్లుంటుంది. కథనంలో లోతైన వ్యంగ్యం వుంటుంది. అదే సమయంలో - రచన ఆద్యంతమూ అవతలి పక్షం యొక్క (పేదప్రజలు) అమాయకత్వం, మొండితనం, నిస్సహయాతల్ని హైలైట్ చేస్తూ వుంటుంది. రచయిత మాత్రం నిస్సందేహంగా లచ్చయ్యమ్మ పక్షమే. కానీ బయటకి మాత్రం రాజయోగి పార్టీ! 

ఇంతటితో మొదటి భాగం సమాప్తం.

నా ఘోష -

ఇదేంటి నాయనా? నువ్వేమన్నా సీరియల్ రాస్తున్నావా? ఈ భాగాల గోలేంటి?

'గోవులొస్తున్నాయి జాగ్రత్త!' కబుర్లు రాయాలని ఒక సంవత్సరం నుండి అనుకుంటున్నాను. ఏవేవో పోస్టులు రాస్తున్నాను గానీ - 'గోవులొస్తున్నాయి జాగ్రత్త!' మాత్రం వెనక్కిపోతుంది. ఇందుకు నాకు కొంత గిల్టీగానూ, మరికొంత దిగులుగానూ వుంది.

కావున - ఇవ్వాళ రాయడం కొంచెం మొదలెట్టేసి మొదటి భాగంగా పోస్టుతున్నాను. ఈ పార్ట్స్ కిల్ బిల్ 1, 2 వంటివే గానీ - గాడ్‌ఫాదర్ 1, 2 వంటివి కాదని మనవి చేస్తున్నాను.

ఇలా ఎందుకు తిప్పలు పడటం? అసలంటూ రాయడం మొదలెడితే - కుక్కలాగా చచ్చినట్లు మిగిలిన భాగాలు పూర్తి చెయ్యగలననే దురాలోచన! అంతకు మించి మరేం లేదు. ఏది ఏమైనప్పటికీ - నా అభిమాన నవల గూర్చి ఇలా ముక్కలుగా రాస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాను!