Thursday 14 August 2014

జ్ఞాని


మొన్నొక డాక్టర్‌తో కబుర్లు చెబుతున్నాను. ఆయన హార్ట్ స్పెషలిస్ట్. 

నేను సాధారణంగా డాక్టర్లతో స్నేహానికి పెద్దగా ఆసక్తి చూపను. ఇందుకు కార్డియాలజిస్టులు మాత్రం మినహాయింపు. ఎందుకైనా మంచిదనే (భవిష్యత్తులో నాకేదన్నా గుండెజబ్బొస్తే ఉపయోగపడతారనే) ముందుచూపే ఇందుకు కారణం!

ఆ డాక్టర్‌తో మాట్లాడేప్పుడు నా చేతిలో ఒక పుస్తకం వుంది.

"ఆ పుస్తకమేంటి?" ఆ డాక్టర్ కుతూహలంగా అడిగాడు.

"ఇది జనులందరూ చదివి తరించాల్సిన పుస్తకరాజం. సగం చదివాను, మీక్కావాలంటే తీసుకోండి." అన్నాను.

"అబ్బే! చదివే టైం నాకెక్కడిది? ఊరికే తెలుసుకుందామని అడిగానంతే." అన్నాడాయన.

"మీరేమీ మొహమాట పడనక్కర్లేదు. చదువుతానంటే పుస్తకం వదిలేసి పోతాను." కావాలంటే ఇంకో రెండుచుక్కలు నెయ్యి వడ్డిస్తాననే స్టైల్లో అన్నాను.

"నాకు మీదగ్గర మొహమాటం లేదు. నాకు పుస్తకాలు చదివే టైమ్ లేదు, ఇంటరెస్టూ లేదు." స్థిరంగా, ఖచ్చితత్వంతో చెప్పాడాయన. 

నాకీ డాక్టర్ నచ్చాడు. బాగా పధ్ధతి గల మనిషిలాగున్నాడు. తన గూర్చి తనకి చక్కని అంచనా ఉన్నట్లుంది. నేనా డాక్టర్ వైపు ఈర్ష్యగా చూశాను!

నాకీ బుద్ధిలో సగమైనా ఉంటే బాగుణ్ణు! చాలా పుస్తకాలు చదవాలనే ప్రణాళిక వేసుకుంటాను. కానీ - భారతదేశ దారిద్య్ర నిర్మూలనా ప్రణాళికలా నా పుస్తక పఠనం ఒక్కంగుళం కూడా ముందుకు నడవదు. పోనీ - 'చదవలేను' అని ఒప్పుకోవచ్చుగా? లేదు - రాజకీయ నాయకులకి మల్లే నాకు అహం అడ్డొస్తుంది.

దేవుడి సృష్టిలో రకరకాల జీవులు. ఈ జీవుల్లో కొందరికి ఆత్రం ఎక్కువ. ఎన్నో పన్లు చేద్దామని ఆయాసపడుతుంటారు, ఏదీ చెయ్యలేక నీరసపడుతుంటారు. పోనీ - ఆ తర్వాతైనా రియలైజ్ అయ్యి వాస్తవిక దృక్పధం అలవరచుకుంటారా అంటే - అదీ వుండదు!

కావున - తన పరిమితులు గుర్తించిన వాడే అసలైనా జ్ఞాని అని అనుకుంటున్నాను. ఈ నిర్వచనం ప్రకారం నేను అజ్ఞానిని అయిపోతాను. కానీ - నా అజ్ఞానాన్ని ఒప్పుకోకపోతే పరమ అజ్ఞానిని మిగిలిపోతాననే శంకతో ఈ నిజాన్ని అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను!