Friday, 8 August 2014

మన ఎంపీగారి గొప్పసలహా


నిన్న పార్లమెంటులో మన తెలుగు ఎంపీగారు 'ఆడవాళ్ళు హుందాగా వుండే దుస్తులు ధరించాలని' గొప్ప సలహా ఇచ్చారు. సాధారణంగా ఇట్లాంటి అమూల్యమైన సలహాలు ఏ మతపెద్దల నుండో, మతతత్వ రాజకీయ పార్టీలవాళ్ళ నుండో వింటుంటాం. అయితే ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఈ విధమైన సలహా ఇవ్వడం ఆశ్చర్యమే. 

నాకయితే మన ఎంపీగారు పురుషాహంకారంతో మాట్లాడినట్లు అనిపించలేదు. ప్రసంగం ఆయనే రాసుకున్నాడో, ఎవరన్నా రాసిచ్చారో తెలీదు గానీ - చివర్లో కొంత గుమ్మడి మార్కు ఫినిషింగ్ టచ్ ఇద్దామనుకుని (గొప్ప కోసం) అలా చదివాడనిపిస్తుంది. మీడియావాళ్ళతో ఆయన తత్తరపాటు చూస్తే ఆయనకసలు తను మాట్లాడింది 'తప్పు' అనికూడా తెలిసినట్లుగా లేదు పాపం!

గత కొంతకాలంగా కోస్తాంధ్ర ఎంపీలుగా పారిశ్రామికవేత్తలే ఎన్నికవుతున్నారు. ఇది తెలుగువారికి గర్వకారణం. మనవాళ్ళు కొన్ని వందల కోట్లు సంపాదించిన తరవాత, ప్రజాసేవ చెయ్యాలనే ఉత్తమ తలంపు కలిగి, ఎంతో కష్టపడి తమ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇది ఎంతో ఆనందదాయకం. వీరు ఎంపీలుగా అయ్యేది తమ వ్యాపార అభివృద్ధి కోసమేనని కొందరు గిట్టనివాళ్ళు అంటారు. ఇది కేవలం కుళ్ళుబోతు వాదన. 

'టు ఎర్ ఈజ్ హ్యూమన్' అన్నారు పెద్దలు. మనమందరం తప్పులు చేస్తూనే వుంటాం. చాలాసార్లు చేసేది తప్పు అని తెలీకే చేస్తుంటాం. అమెరికావాడు వరలక్ష్మి వ్రత మహత్యం గూర్చి, ఆఫ్రికావాడు ఆవకాయ గూర్చి మాట్లాడుతున్నప్పుడు వినడానికి బహుముచ్చటగా వుంటుంది. అందులో తప్పులున్నా అదేమంత పట్టించుకోవలసిన విషయం కాదు. కారణం - వాళ్ళు ఆ మాత్రం మాట్లాడమే గొప్పవిషయం!