Tuesday 16 December 2014

సావిత్రితో ఓ పాట




"శిష్యా! ఏవిఁటోయ్ ఫోనునలా తినేసేలా చూస్తున్నావ్?"

"గురుగారు! యూట్యూబులో సావిత్రి పాటని చూస్తున్నాను.. మైమరచిపోతున్నానండి."

"ఏవిఁటో ఆ పాట?"

"సంతానం సినిమాలో 'చల్లని వెన్నెలలో' అంటూ ఓ పాటుందండి! పాటలో సావిత్రి అందం గూర్చి ఏమని చెప్పను గురుగారు? చచ్చేంత అందంగా వుంది! సావిత్రినే చూస్తూ ఆనందంగా, హాయిగా పాడుతూ.. ఆహాహా! నాగేస్సర్రావు ఎంతదృష్టవంతుడు! అసూయగా వుందండి!"

"ఒహో అదా నీ సమస్య? నీ అసూయ తగ్గే మార్గం చెబుతా శిష్యా!"

"చెప్పండి గురుగారు."

"ఇంట్లో మంచం వుందా?"

"వుంది."

"దుప్పటుందా?"

"వుంది."

"ఒక పన్జెయ్! మంచం మీద పడుకుని, దుప్పటి కప్పుకుని సావిత్రినే తలచుకుంటూ.. ఆ పాట నువ్వే పాడుతున్నట్లు.. సావిత్రి ప్రేమగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లు.. ఊహించేసుకో!"

"కానీ.. "

"ఊఁ! అడుగు, మొహమాటమెందుకు?"

"నాకు పాడ్డం రాదు గురుగారు!"

"నాగేస్సర్రావుకి మాత్రం పాడ్డం వచ్చా శిష్యా? ఘంటసాల స్టోన్‌ని అరువు తెచ్చుకోలేదూ?"

"అవును కదా!"

"లే మరి! ఇంక నీదే ఆలీసెం, దుప్పటి తన్ని కళ్ళు ఘాట్టిగా మూసుకుని - 'సావిత్రి రా! సావిత్రి రా!' అంటూ పిలుస్తూనే వుండు! దెబ్బకి సావిత్రి దిగొస్తుంది!"

"కానీ గురుగారు.. "

"మళ్ళీ డౌటా శిష్యా! సర్లే - అడుగు."

"నాకు పియానో వాయించడం రాదు గురుగారు!"

"ఓరి దౌర్భాగ్యుడా! నీకు సావిత్రితో డ్యూయెట్ పాడుకునే మార్గం చెప్తుంటే దిక్కుమాలిన డౌట్లతో సమయం వృధా చేస్తావేం! ఇంక నిన్ను బాగు చెయ్యడం నావల్ల కాదు. ఎందులోనన్నా దూకి చావు, పీడా విరగడౌతుంది - నే వెళ్తున్నా!"

"గురుగారు! గురుగారు!!"

(posted in fb on 22/7/2017)