Monday, 8 December 2014

వాస్తు మహిమ


"ఎవరదీ?"

"నేను మావాఁ!"

"వార్నీ! నువ్వా అల్లుడూ! రా రా, ఆ కుర్చీ లాక్కుని కూర్చో!"

"ఎలాగున్నావ్ మావాఁ?"

"బాగానే వున్నానల్లుడూ! వయసయిపోతుందిగా! ఆమధ్య కొద్దిగా దెబ్బ తిన్నాన్లే!"

"తెలుసు, అమ్మ చెప్పింది. అందుకే చూసి పోదావఁనొచ్చా."

"మంచిది."

"అత్త ఇంట్లో లేదా మావాఁ?"

"ఏం చెప్పమంటావల్లుడూ? మీ అత్తకీ మధ్య మూతి పక్షవాతం వచ్చింది. పక్కూళ్ళో రమణయ్యని గొప్ప సిద్ధాంతిగారున్నారు. ఆయనేదన్న పరిష్కారం చెబుతాడేమోనని వెళ్ళింది."

"రోగవొఁస్తే డాక్టర్ దగ్గరకెళ్ళాలిగానీ.. సిద్ధాంతెందుకు మావాఁ!?"

"రోగాలెందుకొస్తాయల్లుడూ? వాస్తుదోషంతోనో, గ్రహబలం బాగోకే కదా? అట్లాంటప్పుడు డాక్టర్లు మాత్రం ఏం చేస్తారు?"

"రోజులు మారాయి మావాఁ!"

"అదేంటల్లుడూ? రోజులెక్కడ మారాయి? చంద్రబాబు ఇప్పటివాడేగా!"

"మధ్యలో చంద్రబాబేం చేశాడు మావాఁ?"

"చంద్రబాబు మొదట క్రిష్ణాజిల్లాలోనే రాజధాని అన్నాడు కదా! ఇప్పుడు గుంటూరు జిల్లా వైపుకి ఎందుకు మళ్ళాడంటావ్?"

"రాజకీయ కారణాలు..."

"కాదు కాదు! వాస్తు, వాస్తు ఒప్పుకోలేదల్లుడూ!"

"వాస్తు ఒప్పుకోలేదా?!"

"మన తెలుగునాట గొప్ప జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు వున్నారు. వారంతా జన్మ నక్షత్రాన్ని బట్టి జాతకాలు చెబుతుంటారు. వారిలో ఒకాయన చాలా లోతుకెళ్ళి - ఆడవారి రజస్వల సమయం బట్టి వారి మనస్తత్వం నిర్ణయమవుతుందని ఓ గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ పండితులవారే మన చంద్రబాబుకిప్పుడు ముఖ్య సలహాదారుడు."

"అలాగా! నాకు తెలీదు."

"జగనెందుకు ముఖ్యమంత్రి అవ్వలేకపొయ్యాడంటావ్?"

"జగన్ తండ్రినే నమ్ముకున్నాడు. చంద్రబాబు మోడీనీ, రైతుల ఋణమాఫీ హామీనీ నమ్ముకున్నాడు."

"గాడిదగుడ్డేం కాదు! జగన్ హిందువు కాదు, అందుకే గ్రహాలు మొరాయించాయి."

"గ్రహాలు హిందువులకేనా మావాఁ?"

"ఇట్లాంటి గొప్పవిషయాలు నీలాంటి సామాన్యులకి అర్ధం కావులే అల్లుడూ!"

"మావాఁ! జాతకాల్ని, వాస్తుని నమ్మడం వ్యక్తిగతం. ఎవరి నమ్మకాలు వారివి. ఆ నమ్మకాల్ని వారు తమ సొంతపనులప్పుడు పాటిస్తే ఎవరూ తప్పు పట్టరు. కానీ - కొన్ని కోట్లమందికి సంబంధించిన రాజధాని విషయంలో ఈ వాదనేంటి మావా?"

"చంద్రబాబు గురువుగారు క్రిష్ణా నదికి గుంటూరు వైపునైతేనే తెలుగువారు సుఖసంతోషాలతో ప్రకాశిస్తారని సెలవిచ్చారు. ఆయన మాట చంద్రబాబుకి వేదవాక్కు. కాదన్డానికి నువ్వెవరు?"

"సర్లే మావాఁ! ఇక నేవెళ్తా. అత్తని అడిగానని చెప్పు."

"అడగడం మర్చేపొయ్యాను. నీ కొడుక్కి డాక్టర్ సీటొచ్చిందా?"

"కష్టపడి చదివాడు. అయినా రాలేదు, ఈసారి లాంగ్ టెర్మ్ కోచింగ్ తీసుకుంటాట్ట మావాఁ!"

"వాడికి సీటెలా వస్తుంది? రాదు. కష్టపడి చదివితే సరిపోతుందా? వాస్తు సహకరించొద్దూ?"

"మావాడి చదువుక్కూడా వాస్తు లింకుందా మావాఁ?"

"నాకన్నీ తెలుసులేవోయ్! మీ అత్తెప్పుడో చెప్పింది. నీ ఇంట్లో ఈశాన్యం మీద బరువు పెడుతున్నావంట!"

"ఈశాన్యం మీద బరువా!?"

"అవును, నీ కారు పార్కింగ్ ఇంటికి ఈశాన్యం వైపుందిట. ఇవ్వాళ్టినుండి ఆ పాడు కారు అక్కణ్నించి తీసెయ్! ఈశాన్యం మీద బరువుండకూడదు."

"మరి కారెక్కడ పెట్టుకోను?"

"రోడ్డు మీద పెట్టుకో."

"కారుని రోడ్డు మీద పడేస్తే దొంగలెత్తికెళ్ళరూ!"

"పోతే పొనీ! వెధవ కారు. ఒకటిపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, నీకు పిల్లాడి సీటు ముఖ్యమా? కారు ముఖ్యమా? అయినా ఇంకెన్నాళ్ళు? వొచ్చే నెల్లో నాకు మీ ఊళ్ళో కొద్దిగా పనుంది. వచ్చేప్పుడు రవణయ్య సిద్ధాంతిని తీసుకొస్తాను. ఆయన్నీ ఇంటికి చేయించాల్సిన మార్పుచేర్పులు చెబుతారు. ఆ ప్రకారం ఇల్లు బాగుచేసుకో."

"మావాఁ! వెళ్ళొస్తాను."

"మంచిది. నీదే ఆలస్యం, నాకు పూజకి వేళైంది."

(posted in fb on 26/07/2017)