Monday 1 December 2014

ముషిరుల్ హసన్ సాబ్! గెట్ వెల్ సూన్!


ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ముషిరుల్ హసన్ మొన్న ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని హిందూలో చదివాను. ఈ వార్త చదివాక చాలా దిగులుగా అనిపించింది. నేను చాలాయేళ్ళుగా హిందూలో ప్రచురితమయ్యే ముషిరుల్ హసన్ వ్యాసాలు చదువుతున్నాను. దేశ విభజన, విభజనాంతర పరిణామాలు, మతరాజకీయాలు.. ఇలా అనేక విషయాలపై ఆయన ఆలోచింపజేసే రచనలు చేశాడు.

ముషిరుల్ హసన్ అంతకుముందు కొన్ని ఎకెడెమిక్‌ పుస్తకాలు రాసినప్పటికీ.. నాలాంటివాడికి బాగా తెలీడానికి కారణం - సల్మాన్ రష్దీ! రష్దీ రాసిన 'సెటనిక్ వెర్సెస్' అన్న పుస్తకం ముస్లిం మతచాందసులకి కోపం తెప్పించింది. దాంతో ఆయతొల్లా ఖొమైనీ రష్దీని చంపెయ్యమని ఓ ఫత్వా (?) జారీ చేశాడు. ముస్లిం వోట్లని దృష్టిలో వుంచుకుని - ఆనాటి భారత ప్రభుత్వం హడావుడిగా రష్దీ పుస్తకాన్ని నిషేధించింది (ఎంతైనా పుస్తకాల్ని నిషేధించడంలో ప్రభుత్వాలు భలే ఉత్సాహంగా వుంటాయి)!

అనాడు - 'సెటనిక్ వెర్సెస్' నిషేధించడాన్ని వ్యతిరేకించిన వ్యక్తిగా - జామియా మిలియా ఇస్లామియా హిస్టరీ ప్రొఫెసర్‌ ముషిరుల్ హసన్ వార్తలకెక్కాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా మతవాదులకి లిబరల్స్ ఆలోచన బూతుగానే అనిపిస్తుంది. అంచేత - ముస్లిం మతచాందసులు - క్లాసుల్లో పాఠాలు చెప్పుకుంటూ, పుస్తకాలు రాసుకునే మన ప్రొఫెసర్‌గార్ని తుక్కుబడ తన్నారు. పాపం! ఆ దెబ్బలకి ఆయన ఆస్పత్రి పాలయ్యాడు.

ముషిరుల్ హసన్ రాసిన ఓ పుస్తకం కొన్నాను గానీ - చదవలేకపొయ్యాను. ఆకలిగా లేనప్పుడు మసాలాదోసె ఆర్డరివ్వం కదా? మరప్పుడు చదివే ఓపిక లేనప్పుడు పుస్తకం కొనడం దేనికి? ఎందుకో నాకు తెలీదు. తెలిస్తే - చాలా పుస్తకాలు కొనేవాణ్నే కాదు

ముషిరుల్ హసన్ సాబ్! గెట్ వెల్ సూన్!