Wednesday 14 January 2015

శబరిమలై సంప్రదాయ గోడలు


మన ఇంటికి అతిథులు వస్తారు. అందరికీ కాఫీ ఇచ్చి, ఒకరికి మాత్రం మంచినీళ్ళే ఇస్తాం. ఆ మంచినీళ్ళ వ్యక్తి మొదట ఆశ్చర్యపోతాడు, తరవాత చిన్నబుచ్చుకుంటాడు, ఆ తరవాత కోపగించుకుంటాడు. కాఫీ ఆరోగ్యానికి హాని అనీ, అందుకే నీకు ఇవ్వలేదనీ మనం బుకాయించబోయినా అతడు ఒప్పుకోడు. వాస్తవానికి అతనికి కాఫీ తాగే అలవాటు లేదు. అయినా, అందరితో పాటు తనకి కాఫీ ఆఫర్ చెయ్యనందుకు కోపగిస్తాడు. తను కాఫీ త్రాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవల్సింది అతడే గానీ మనం కాదు.

కేరళలో శబరిమలై అనేచోట అయ్యప్ప అనే దేవుడు వున్నాడు. నల్ల దుస్తుల్తో (సీనియర్లు కాషాయ దుస్తుల్తో) దీక్ష తీసుకుని దేవుణ్ణి దర్శించుకుంటారు. సంక్రాంతినాడు జ్యోతి కనబడుతుందిట గానీ - దాన్ని దేవస్థానం బోర్డు ఉద్యోగులే చాలా కష్టపడి వెలిగిస్తారని ప్రభుత్వమే వొప్పుకుంది. శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల ఆడవాళ్ళకి ప్రవేశం లేదుట. దీనిక్కారణం ఈ వయసు ఆడవాళ్ళు menstruate అవుతారు. 

ప్రజలు నమ్మకాల్నీ, భక్తినీ ప్రశ్నించడానికి సందేహిస్తారు. 'మనకెందుకులే' అనుకుని అలా ఫాలో అయిపోతూ వుంటారు. అయితే కాలం ఎల్లకాలం ఒకేలా వుండదు. ఏదోక రోజు నమ్మకాల్నీ, సాంప్రదాయతనీ ప్రశ్నించేవాళ్ళు బయల్దేరతారు. అంటు, మైల, ముట్టు - మొదలైన ముద్దుపేర్లతో menstrual bleed ని చీదరించుకునేవాళ్ళని చీదరించుకుంటూ కొందరు అమ్మాయిలు happy to bleed అనడం మొదలెట్టారు (పిదప కాలం, పిదప బుద్ధులు). 

'ఉరే భక్త స్వాములూ! మగ ఆడ sexual intercourse చేసుకున్న ఫలితంగా, గర్భాశయంలో తొమ్మిది నెలలు గడిపి, స్త్రీ జననాంగం ద్వారా మీరు బయటకొచ్చారు. మరప్పుడు మీ పుట్టుక అపవిత్రం కాదా?' అనడిగారు. అంతటితో వూరుకోకుండా - 'అయ్యప్పని దర్శించుకునే హక్కు menstruating women అయిన మాకూ వుంది' అంటూ ఎన్నాళ్ళనుండో వస్తున్న 'పవిత్రమైన' ఆనవాయితీని ప్రశ్నిస్తూ కోర్టుకెక్కారు (ఎంత అన్యాయం!).

కోర్టుక్కూడా న్యాయదేవత వుంది. కానీ ఆ దేవత చూడ్డానికి వీల్లేకుండా కళ్ళకి గుడ్డ కట్టేసి వుంటుంది. గౌరవనీయులైన కోర్టువారు చట్టాల దుమ్ము దులిపి నిశితంగా పరిశీలించారు. వాళ్లకి menstruating women కి వ్యతిరేకంగా యే ఆధారమూ కనబడక - 'bleeding women దేవుణ్ణి ఎందుకు చూడకూడదు?' అని తీవ్రంగా హాశ్చర్యపొయ్యారు. 'ట్రావన్కూరు దేవస్థానం వాళ్ళు రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నారా?' అంటూ కించిత్తు మధనపడుతూ సందేహాన్ని వ్యక్తం చేశారు. అంతిమ తీర్పు ఇంకా రావలసి వుంది. 

సమాజం నిశ్చలంగా వుండదు, నిరంతర మార్పు దాని గుణం. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి నిలబడనిదేదైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి తావు లేని సమాజం నిస్సారమైనది, అనాగరికమైనది. అందుకే - 'ఎందుకు?' అన్న ప్రశ్న చాలా ప్రమాదకరమైనది కూడా! ఈ ప్రశ్న వినపడ్డప్పుడల్లా కొందరు గుండెలు బాదుకుంటూనే వున్నారు. ఆ గుండెలు బాదుకునే వాళ్ళు గుండె పగిలి చచ్చేలా సమాజం ముందుకు పురోగమిస్తూనే వుంది. ఇవ్వాళ శబరిమలైలో అగ్గిపుల్ల రాజుకుంది. ఈ అగ్గి పుల్లతోనే ఆరిపోదనీ, ఇది ఇంకెన్నో మంటల్ని రాజేస్తుందనీ ఆశిస్తున్నాను.