Friday 9 January 2015

'స్వచ్ఛపుస్తక్'


"ఈమధ్య తెలుగు సాహిత్యాన్ని ఉద్ధరిద్దామనే కోరిక కలిగిందోయ్! ఒక మంచి రచయితని సజెస్ట్ చెయ్యి! చదివి పెడతాను."

"అలాగే! మీ టేస్టేవిఁటో చెబితే.. "

"స్వచ్ఛమైన రచయిత, స్వచ్ఛమైన పుస్తకం!"

"అర్ధం కాలేదు."

"ఓ పన్జెయ్! నీకిష్టమైనవాళ్ళ పేర్లు చెప్పు! చదవాలో లేదో నేను తేల్చుకుంటాను."

"రావిశాస్త్రి బాగా రాస్తాడు."

"నేను తాగుబోతులు రాసిన సాహిత్యం చదవను."

"పోనీ - కుటుంబరావు?"

"కమ్యూనిస్టులు దేశద్రోహులు, వాళ్ళని చదవరాదు."

"చలం?"

"చలంది క్రమశిక్షణ లేని జీవితం."

"శ్రీశ్రీ?"

"నథింగ్ డూయింగ్, శ్రీశ్రీ స్మోకర్."

"గురజాడ అప్పారావు?"

"...... "

"సార్సార్! ఇంకేం మాట్లాడకండి. గురజాడని తీసుకెళ్ళి చదూకోండి, నన్ను విముక్తుణ్ని చెయ్యండి."

"ఎందుకలా తొందర పడతావ్? కొంచెం ఆలోచించనీ! గురజాడకే అలవాటూ లేదని ఎలా చెప్పగలవ్? ఏమో ఎవరు చెప్పొచ్చారు - నశ్యం అలవాటుందేమో!"

"ఒట్టు! నన్ను నమ్మండి! ఆయనకే అలవాటూ లేదుట! పొద్దున్నే యోగాసనాలు కూడా వేసేవాట్ట! చరిత్రలో రాశారు."

"ఈ రోజుల్లో చరిత్రని నమ్మేదెవరు? ఎవరికనుకూలంగా వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఓ పన్జెయ్! గురజాడకి ఏ అలవాటు లేదని రూఢి చేసుకుని నీకు ఫోన్జేస్తాను. అప్పుడాయన పుస్తకాలు పంపీ! నాకు రచన బాగా లేకపోయినా పర్లేదు కానీ - రచయితకి మాత్రం ఆరోగ్యకరమైన అలవాట్లు, ఉక్కు క్రమశిక్షణ వుండాలి! అర్ధమైందా?"

"అర్ధం కాలేదు! అయినా - రచన బాగుండాలి గానీ రచయిత గూర్చి మనకెందుకండి?"

"కావాలి, రచయిత గూర్చే కావాలి! ప్రధానమంత్రి 'స్వచ్ఛభారత్' అంటూ ప్రజల చేతికి చీపుళ్ళిస్తున్నాడు. ఎందుకు?"

"ఎందుకు?"

"ఎందుకంటే - రోడ్లు శుభ్రంగా వుంటేనే ఊరు శుభ్రంగా వుంటుంది కాబట్టి! అందుకే చీపుళ్ళ పథకాన్ని 'స్వచ్ఛభారత్' అన్నారు. రచయితైనా అంతే! ముందు తను స్వచ్ఛంగా వుంటేనే స్వచ్ఛమైన పుస్తకం రాయగలడు! అప్పుడే దాన్ని 'స్వచ్ఛపుస్తక్' అంటారు!"

"స్వచ్ఛపుస్తక్!"

"అవును! ముందు నువ్వా నోరు మూసుకో, ఈగలు దూరగలవు! ఇక నే వెళ్తాను!"