Friday, 16 January 2015

బీజేపీ ముసుగు


"పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం. ఇవ్వాళ మీడియా వాళ్ళు మమ్మల్ని 'ఫ్రింజ్ గ్రూప్' అంటూ అవమానిస్తున్నారు." అంటూ ఈమధ్య నా మిత్రుడు తన ఆవేదన వెళ్ళబుచ్చాడు, అతను చాలా యేళ్ళుగా ఆరెస్సెస్‌లో ముఖ్యుడుగా వున్నాడు. నాకతని పట్ల జాలి కలిగింది. పాపం! ఆతను ఎన్నికలప్పుడు ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.

బీజేపీ అనే రాజకీయ పార్టీకి సిద్ధాంత మూలాలు ఆరెస్సెస్‌లో వున్నాయి, ఆరెస్సెస్ బీజేపీని రిమోట్‌ కంట్రోల్ చేస్తుంటుంది. ఇక్కడ మనం జనతా పార్టీ ప్రభుత్వంలోంచి బయటకొచ్చేప్పుడు వాజ్‌పాయి, అద్వానీలు 'తాము ఆరెస్సెస్ వారైనందుకు గర్విస్తున్నామని' చెప్పిన విషయం గుర్తు తెచ్చుకోవాలి.

పాకిస్తాన్ ముస్లిముల దేశమనీ, భారద్దేశం హిందువుల దేశమనీ - ఆరెస్సెస్ అభిప్రాయం. ఆరెస్సెస్ క్రైస్తవ మిషనరీలాగా కేవలం మతవ్యాప్తి చేసే సంస్థ కాదు. ఆరెస్సెస్ 'హిందూ రాష్ట్ర్' అనే ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యంతో పని చేస్తున్న సంస్థ. మన ప్రధాని ఈ ఆరెస్సెస్ స్కూల్లోంచే పాఠాలు నేర్చుకుని వచ్చాడు.

ఆరెస్సెస్ అనే వృక్షానికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, శ్రీరామసేన, హిందూ మహాసభ.. ఇట్లా పలు పేర్లతో అనేక పిలకలున్నాయి. ఈ సంస్థల్లో ఎంతో నిబద్ధతతో పన్జేసే కార్యకర్తలున్నారు. ప్రపంచంలో మతాన్ని ఆధారంగా చేసుకుని నడిచే ఏ సంస్థలోనైనా సభ్యులు మొండిగా వుంటారు.

మొన్న ఎన్నికల్లో బీజేపి అధికారంలోకి రావడానికి ఆరెస్సెస్ ఎంతగానో శ్రమించింది. అందుకో ఉదాహరణ వారణాసి ఎన్నికలు. ఎన్నికలకి చాలా ముందునుండే ఆరెస్సెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం మొదలుపెట్టారు. పక్కా ప్రణాళికతో పకడ్బందీ వ్యూహం అమలు చేశారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈర్ష్య పడేంతగా కష్టపడ్డారు.

మోడీ 'అభివృద్ధి' స్లోగన్‌ని నమ్మో, కాంగ్రెస్ అవినీతికి విసిగిపోయ్యో - ప్రజలు కేంద్రప్రభుత్వాన్ని మోడీ చేతిలో పెట్టారు. ప్రభుత్వం రాజ్యంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఒక సంస్థ. దానికి నియమాలు, నిబంధనలు వుంటాయి. అందువల్ల ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి రాజ్యంగ సంస్థలపై నమ్మకం వున్నా, లేకపోయినా - తప్పనిసరిగా ఒక పద్ధతిగా పన్జెయ్యాలి. కాబట్టి సహజంగానే ప్రభుత్వం నడిపేవాళ్లకి కొన్ని ఇబ్బందులుంటాయి.

బీజేపి విజయం కోసం శ్రమించిన సాధువులు, సన్యాసులు, సన్యాసినులకి ఈ సంగతులు పట్టవు, వారికివి అనవసరం కూడా. వారికి తమ మతతత్వ ఎజెండా అమలే పవిత్ర కార్యం. ఒకరకంగా వారిది ముక్కుసూటి వ్యవహారం. 'వాజ్‌పేయి సమయంలో సంపూర్ణ మెజారిటీ లేదని రాముడి గుడి కట్టకుండా తప్పించుకున్నారు, ఇప్పుడు మనకి అడ్డేమిటి?' అనేది వీరి వాదన.

మొదట్నుండీ - హిందుత్వవాదులకి హిట్లర్, గోడ్సేలు ఇష్టులు. అలాగే - వారికి భారద్దేశం మొత్తాన్ని హిందూత్వ దేశంగా మార్చేద్దామనే ఆశయం వుంది. ఉదాహరణకి - హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కని జనాభా సంఖ్య పెంచుకోవాలనేది వారు ఎప్పట్నుండో ఈ దేశానికి ఇస్తున్న గొప్ప సలహా. ఇవ్వాళ హిందుత్వ పార్టీ అధికారంలోకి రాంగాన్లే ఈ విషయాలకి మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది, అంతే!

వాజ్‌పేయి ఒక ముసుగు మాత్రమేననీ, తమ లక్ష్యం వేరే వుందని (వాస్తవం) చెప్పిన గోవిందాచార్య ఇప్పుడెక్కడున్నాడో తెలీదు. ఇవ్వాళ ఎవరూ కూడా గోవిందాచార్య లాగా తెరమరుగయ్యే ప్రమాదం లేదు. ఎందుకంటే - మోడీ మూలాలు ఆరెస్సెస్‌లోనే వున్నాయి కాబట్టి. ప్రవీణ్ తొగాడియా, అశోక్ సింఘాల్, ఆదిత్యనాథ్, సాక్షి మహరాజ్, సాధ్వి నిరంజన్ జ్యోతి వంటివారిపై చర్య తీసుకునే ఉద్దేశం మోడీకి వుండదు - ఏదో 'షో కాజ్' నోటీసులంటూ షో చేయ్యడం తప్ప. ఎందుకంటే - తామంతా ఒక తానులో ముక్కలే కాబట్టి.

నేడు ప్రజల్ని మోసం చెయ్యడంలో రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపధ్యంలో - మనం సంఘపరివార్ శక్తుల నిజాయితీని అభినందించాలి. వారు మనసులో మాట దాచుకోకుండా - తమ అసలు లక్ష్యం ఏమిటో నిర్మొహమాటంగా చెబుతున్నారు. వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు కావున వినేవారిక్కూడా ఎటువంటి కన్‌ఫ్యూజన్ వుండదు. ఆ మాత్రం స్పష్టత వుంటేనే - తమకేం కావాలో, ఎవరు కావాలో ఈ దేశప్రజలు నిర్ణయించుకోగలుగుతారు.