Friday 2 January 2015

ప్రజలకి తిక్క కుదరాల్సిందే!


"నాకు రాజకీయాలంటే మంట!"

"ఎందుకు!?"

"ఎందుకా? బాబుని చూడండి! ఎన్నికల ముందు ఋణమాఫీ అన్నాడు, ఇప్పుడేమో అర్ధం కాని ఆల్జీబ్రా లెక్కలేవో చెబుతున్నాడు. ఎంతన్యాయం! ఈ లెక్కలు ఎన్నికలప్పుడు చెప్పొచ్చుగా?"

"ఈ లెక్కలు ముందే చెబితే జనాలు ఓట్లెందుకేస్తారు?"

"అది మాట తప్పడం కాదా? అందుకే నాకు రాజకీయాలంటే మంట!"

"దాన్దేవుఁంది! ఎన్నికలన్నాక లక్ష చెబ్తారు. అవన్నీ నమ్మాలని వుందా యేవిఁటి? అయినా - ఈ రోజుల్లో ఎన్నికల వాగ్దానాల్ని పట్టించుకునేదెవరు?"

"మీరు చాలా సినికల్‌గా మాట్లాడుతున్నారు. కేంద్రంలో మోడీని చూడండి! ఎన్నికల ముందు దేశాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. ఇప్పుడేమో చేతికి చీపుళ్ళిచ్చి రోడ్లూడిపిస్తున్నాడు. టీవీల్లో రోజుకో సన్యాసి హిందూ మతానికి అన్యాయం జరుగిపోతుందని గుండెలు బాదుకోడం తప్ప అభివృద్ధి కనుచూపు మేర కనిపట్టం లేదు. 'అచ్చే దిన్' అంటే ఇవేనా?"

"వాళ్ళ దృష్టిలో ఇవే అచ్చే దిన్! ఈ సంగతి ముందే చెబితే జనాలు ఓట్లెందుకేస్తారు?"

"అది మాట తప్పడం కాదా? అందుకే నాకు రాజకీయాలంటే మంట!"

"దాన్దేవుఁంది! ఎన్నికలన్నాక లక్ష చెబ్తారు. అవన్నీ నమ్మాలని వుందా యేవిఁటి? అయినా - ఈ రోజుల్లో ఎన్నికల వాగ్దానాల్ని పట్టించుకునేదెవరు?"

"అయ్యా! ఇంతకీ తమరెవరు?"

"అయ్యో నా మతి మండా! మాటల్లో పడి మర్చేపొయ్యాను సుమండీ! నాపేరు పేరయ్య. పెళ్ళిళ్ళు కుదురుస్తుంటాను. నన్నందరూ పెళ్ళిళ్ళ పేరయ్య అంటారు."

"పేరయ్య గారూ! నమస్కారం! గత కొంతకాలంగా మా అబ్బాయి పెళ్ళి చెయ్యడానికి నానా తిప్పలు పడుతున్నాను. ముల్లోకాలు వెదికినా మావాడికి పిల్లనిచ్చే దౌర్భాగ్యుడు ఒక్కడూ దొరకట్లేదు! కొడుక్కి పెళ్ళి చెయ్యలేని వాజమ్మనని నా భార్య రోజూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అయ్యా! ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి. మావాడి పెళ్ళి మీరే చెయ్యాలి! చచ్చి మీ కడుపున పుడ్తాను!"

"ఇంక మీరు నిశ్చింతగా వుండండి, మీవాడికి బ్రహ్మాండమైన సంబంధం కుదిర్చే పూచీ నాది - సరేనా? ఇంతకీ కుర్రాడేం చేస్తుంటాడో?"

"పది పదిసార్లు తప్పాడండీ! కష్టపడి టీసీఎస్‌లో ఆఫీస్ బాయ్ వుద్యోగం వేయించాను."

"దానికేం! సలక్షణమైన ఉద్యోగం. కాకపోతే కొంత మార్చి చెబ్దాం. మీవాడు ఏమ్సీయే చేశాడనీ, టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా చేస్తున్నాడనీ చెప్పండి. ఆస్తిపాస్తులేమాత్రం వున్నాయేమిటి?"

"సెంటు భూమి కూడా లేదండీ!"

"శుభం! తుళ్ళూరులో పదెకరాలు కొని పడేశానని చెప్పండి."

"కానీ - అవతలివాళ్ళు నమ్మాలి కదండీ?"

"ఎందుకు నమ్మరు! రాజకీయ నాయకుల్ని జనాలు నమ్మట్లేదా?"

"అయ్యా! ఇట్లా అడ్డగోలుగా అబద్దాలు చెబితే రేపు పెళ్ళయ్యాక ప్రాబ్లం కదండి!"

"వెయ్యబద్దాలాడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు. ఒక్కసారి ఆ మూడుముళ్ళు పడ్డాక ఎవడైనా చేసి చచ్చేదేవుఁంది గనక! ఇందాక తమరు రాజకీయ నాయకుల గూర్చి గుండెలు బాదుకుంటున్నారు కదా! రేపు పెళ్ళికూతురు తండ్రీ అంతే!"

"అంతేనంటారా?"

"అంతేనండీ బాబూ! అంతే! ఈ రోజుల్లో నిజాయితీ గా వుంటే నీళ్ళు కూడా పుట్టవు సుమండీ! మరి నే వస్తాను, నా కమిషన్ సంగతి మాత్రం మర్చిపోకండేం!"

"అయ్యో! ఎంత మాట? మిమ్మల్ని సంతోషపెట్టడం నా విధి!"

"ఇంకోమాట - నాకు రాజకీయాలు ఆట్టే తెలీదు. ఇందాక నేనన్న మాటలు పట్టించుకోకండి."

"నాకూ రాజకీయాలు ఆట్టే తెలీదు లేండి - ఏదో న్యూస్ పేపరుగాణ్ని, నోరూరుకోక వాగుతుంటాను! రాజకీయ నాయకులన్నాక ఎన్నికల్లో లక్ష వాగ్దానాలు చేస్తారు, అవి తీర్చేవా చచ్చేవా? నన్నడిగితే అసలు జనాలే దొంగముండా కొడుకులంటాను. వేసేది లింగులిటుకు మంటూ ఒక్క ఓటు, అందుకు సవాలక్ష డిమాండ్లు! వాళ్ళకా మాత్రం తిక్క కుదరాల్సిందే!"

"అంతేకదు మరి! వుంటాను."