Saturday, 28 March 2015

నేడు శ్రీరామనవమి - 'థాంక్స్ టు ఎన్టీఆర్'


చదువు వల్ల జ్ఞానం వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. కానీ సుఖమయ జీవనం మాత్రం వస్తుంది. యెప్పుడైతే చదువుకోవడం అవసరమైపోతుందో అందుక్కావలసిన సరంజామా సమకూర్చుకోక తప్పదు, యిందులో ముఖ్యమైనది దేవుడి దయ. యీ అవసరార్ధం నాకు చిన్నప్పుడు దేవుళ్లకి మొక్కడం బాగా అలవాటు.

నేను తొమ్మిదో క్లాసులో వుండగా ఆ దేవుడికే పరీక్షాసమయం వచ్చింది. వున్నట్లుండి చదువులో నాకో గట్టి పోటీదారుడు తగిలాడు. అతగాడు నాకన్నా నాలుగైదు మార్కులు యెక్కువ తెచ్చుకుంటూ నన్ను రెండో స్థానానికి నెట్టెయ్యసాగాడు. వెంటనే - మిలిట్రీవాడు ఫిరంగుల్ని దించినట్లు మరింతమంది దేవుళ్లని రంగంలోకి దించాను.

ఒక్కోవారం ఒక్కో దేవుడు. కుంకుడు రసంతో శుచిగా తలంటుకుని అనేక గుళ్లకెళ్లి కొబ్బరికాయలు కొట్టాను. యెగిరెగిరి (అప్పుడు నాకు గుడిగంటలు సరీగ్గా అందేవికావు) గంటలు మోగించాను. ధ్వజస్తంభాల ముందు మోకరిల్లాను. రోజూ స్వచ్చమైన, నిర్మలమైన, పవిత్రమైన మనసుతో పదేపదే 'స్వామీ! నాకే ఎక్కువ మార్కులొచ్చేట్లు చూడు!' అనే మంత్రాన్ని ఉచ్చరించాను. అప్పుడప్పుడు - 'దేవుళ్లూ! మీరు నా కోరిక తీర్చకపోతే నాకు మీ ఉనికి మీద నమ్మకం పోతుంది, మీ భక్తుణ్ని సంరక్షించుకోండి!' అనే హెచ్చరికలూ జారీ చేశాను!

ఈ విధంగా మనసంతా దేవుళ్లనే నింపుకుని మిక్కిలి పరిశుద్ధాత్మతో, పరిపూర్ణ శ్రద్ధాశక్తులతో పరీక్షలు వ్రాసితిని. యింత ఘోరమైన, కఠోరమైన నిష్టతో పరీక్షలెన్ని రాసినా మార్కులు మాత్రం పెరగట్లేదు. క్లాసులో నా రెండోస్థానం గోడక్కొట్టిన పిడకలా అలా స్థిరపడిపోయింది.

కొన్నాళ్లపాటు తీవ్రంగా ఆలోచించిన మీదట నాకో సత్యం బోధపడింది.

'దేవుడు వున్నాడో లేదో నాకు తెలీదు. ఒకవేళ వున్నా - ఆ దేవుడికి నాకు సహాయం చేసే ఉద్దేశం లేదు! నాకు సహాయం చెయ్యని ఆ దేవుడు ఎంత గొప్పవాడైతే మాత్రం నాకెందుకు?' 

ఈ జ్ఞానోదయం అయ్యాక, ఆనాటి నుండి దేవుణ్ని పట్టించుకోవటం మానేశాను!

ఇవ్వాళ శ్రీరామనవమి. జీవితమంతా పరీక్షల్లో మార్కుల కోసమే చదివిన నాకు చాలా విషయాలు తెలీదు. ఇలా తెలీని వాటిల్లో రామయణం వొకటి. రాముడి భార్య సీత. భార్యని అనుమానించిన రాముడు తమ్ముడు లక్ష్మణుణ్ని పిలిచి రథంలో సీతని అడవిలో దింపిరమ్మన్నాడు. ఆ తరవాత ఆమెకి ఇద్దరు మగపిల్లలు! యిది 'లవకుశ' సినిమా కథ. నేను లవకుశ చూడ్డానికి ప్రధాన కారణం నా అభిమాన నటుడు ఎన్టీఆర్. ఈ సినిమా చూడకపోయినట్లైతే నాకు రామాయణం తెలిసేది కాదు, అప్పుడు నేనూ మా పిల్లల్లాగా రాముడి తండ్రి భీష్ముడని 'గెస్' చేస్తుండేవాణ్ని! 

అందువల్ల -

'థాంక్స్ టు ఎన్టీఆర్' 

(updated/re-written on 25/3/18)