Thursday, 19 March 2015

మా గోఖలే


సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్.. ఇవన్నీ పండగలు. ఈ రోజులు ఆయా మతాలవారికి మాత్రమే పర్వదినాలు. నిన్న మా గుంటూర్లో అన్ని మతాలవారికి పండగ దినం. కారణం - గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటిసారిగా ఓపెన్ హార్ట్ సర్జరీ  జరిగింది!

హిమాలయ పర్వతం ఎక్కడం, సముద్రాల్ని ఈదడం లాంటివాటిని సాహస కార్యాలంటారు. వీటిల్లో రికార్డులు కూడా వుంటాయిట! అయితే ఆయా రికార్డుల్తో పేదప్రజలకి వొనగూరే ప్రయోజనమేంటో నాకు తెలీదు. కానీ - గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించడం మాత్రం ఖచ్చితంగా సాహసకార్యం, భవిష్యత్తులో పేదప్రజలకి ఎంతగానో ఉపయోగపడే కార్యం. ఈ సాహసానికి టీమ్ లీడర్ మిత్రుడు డాక్టర్ గోఖలే. ఈ లక్ష్యంలో గోఖలేకి సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా అభినందిస్తున్నాను.

'గుంటూరు మెడికల్ కాలేజి'. ఈ పేరు వినంగాన్లే నాతోసహా చాలామంది నా మిత్రులకి ఎంతో కృతజ్ఞతా భావం. మా కాలేజి నాలాంటి అనేకమంది పేదవార్ని వైద్యులుగా తయారుచేసింది. మా ట్యూషన్ ఫీజు సంవత్సరానికి అక్షరాలా నలభై రూపాయిలు! పొరబాటున - ఒక నాలుగు వేలు ఎడ్మిషన్ ఫీజుగా కట్టమన్నట్లైతే నేను డాక్టర్నైయ్యేవాణ్ని కాదు!

ఈ.ఎన్.బి.శర్మగారు, సి.మల్లిఖార్జునరావుగారు, సి.సావిత్రిగారు, వెంగళరావుగారు మొదలైన ప్రొఫెసర్లు మాకు విద్యాదానం చేసిన దాతలు. వారు గుర్తొచ్చినప్పుడు మా మనసు కృతజ్ఞతా భారంతో బరువైపోతుంది. వాళ్ళు ప్రభుత్వం నుండి తీసుకున్న జీతం అణువంతైతే, మాకు ఇచ్చిన శిక్షణ కొండంత. వారి నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం నన్ను ఆశ్చర్యపరుస్తుంది (నాకు మా టీచర్ల గొప్పతనం చదువుకునేప్పుడు తెలీదు). 

సరీగ్గా ఇదే భావన - మా గుంటూరు మెడికల్ కాలేజి అనేకమంది పూర్వ విద్యార్ధులక్కూడా వున్నట్లుంది. అందుకే వాళ్ళు (ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డవారు) మా కాలేజికి ఏదో రకంగా సేవ చేద్దామని తపన పడుతుంటారు. ఆ తపనలోంచి పుట్టిందే పొదిల ప్రసాద్ మిలినీయం బ్లాక్. ఈ బ్లాక్ తల్లికి పిల్లలు ఇచ్చిన బహుమతి వంటిది. 

ఇవ్వాళ గోఖలే టీమ్ ప్రభుత్వరంగంలో మొదటిసారిగా ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించడానికి ఎంతోమంది అనేక రకాలుగా కృషి చేశారు. ఈ కృషి ఏ ఒక్కరిదో, ఏ ఒక్కనాటిదో కాదు. ఎంతోమంది ఎన్నాళ్ళుగానో పడిన శ్రమ పురుడు పోసుకుని 'ఓపెన్ హార్ట్ సర్జరీ' అనే బిడ్డని కన్నాయని నా నమ్మకం.

ప్రజలకి సేవ చెయ్యాలంటే రాజకీయ రంగాన్ని మించింది మరేదీ లేదు. రాజకీయ నాయకులు నిజాయితీగా వుంటే దేశం బాగుపడుతుంది. అలాగే - ఏ రంగంలోనైనా కావల్సింది నిజాయితీ, పట్టుదల, కృషి. ఇవన్నీ కలిగిన వారు మాత్రమే మొక్కవోని దీక్షతో ముందుకెళ్తుంటారు. స్పీడ్ బ్రేకర్లని ఎదుర్కోడం, దాన్నించి పాఠం నేర్చుకోవడం.. ఇవన్నీ వారికో చాలెంజ్. ఈ లక్షణాలు నా మిత్రుడు గోఖలేలో పుష్కలంగా వున్నాయి. 

ఈ ప్రయాణంలో మా గోఖలేకి అతని భార్య డాక్టర్ లక్ష్మి సహకారం ఎంతో వుందని నాకు తెలుసు. ఆవిడకి అప్పుడే పుట్టిన పిల్లలకి వైద్యం చెయ్యడంలో నైపుణ్యం వుంది. అంతేకాదు - ఎప్పుడో పుట్టిన గోఖలే మనసుని ఆనందంగా, ప్రశాంతంగా వుంచడంలో కూడా నైపుణ్యం వుంది. డాక్టర్ లక్ష్మికి అభినందనలు!

చాలామందికి డబ్బు సంపాదించడంలో ఆనందం వుంటుంది. అతి కొందర్లో ప్రజలకి సేవ చెయ్యడంలో ఆనందం వుంటుంది. ఆ 'అతికొందర్లో' మా గోఖలే కూడా ఒకడు. గుండె ఆపరేషన్ల ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్ళని దాటేస్తున్న నా మిత్రుడు గోఖలే - ఇలాంటి అనేక ప్రజాహిత కార్యాలు తలపెట్టాలనీ, అందుగ్గానూ వాడికి తగినంత 'గుండె ధైర్యం' లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.