Thursday, 12 March 2015

మిస్టర్ అర్నబ్ గోస్వామి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!


మనిషి పుట్టుకతో జంతువు. అయితే ఈ జంతువుకి ఆలోచన ఎక్కువ. ఆలోచనల ద్వారా - అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు పయనించడం అనేది మనిషి చచ్చేదాకా కొనసాగే ప్రక్రియ. ఈ జ్ఞానాజ్ఞాములు సమతూకంలో వుంటేనే మనిషి ప్రశాంతంగా జీవించగలడని నా అభిప్రాయం. అజ్ఞానం ఎక్కువైతే సమాజానికి నష్టం, విజ్ఞానం ఎక్కువైతే మనిషికి నష్టం!

కొన్నిసార్లు జ్ఞానం ఆనందాన్నిస్తుంది, ఇంకొన్నిసార్లు అజ్ఞానమే సుఖాన్నిస్తుంది. అంచేత - ఈ జ్ఞానాజ్ఞానాల్లో ఎవరికేది కావాలో వారే నిర్ణయించుకోవాలి! నాకింత గొప్ప అవగాహన వుండడం వల్ల సుఖమయ జీవనం కోసం కొన్ని పన్లు మానేశాను. ఉదాహరణకు - నేను తెలుగు పత్రికలు చదవను, తెలుగు న్యూస్ చానెల్స్ చూడను. ఈ 'మానెయ్యడం' వెనక -  గొప్ప థియరీ అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు ఈ పన్లు చేస్తుంటే చిరాగ్గా వుండేది, మానేశాక ప్రశాంతంగా వుంది - అంతే! తద్వారా నచ్చని పని చెయ్యకపోవడంలో ఎంతో ఆనందం వుందని గ్రహించాను!

అలాగే - 'టైమ్స్ నౌ' అనే ఇంగ్లీషు న్యూస్ చానెల్ చూడ్డం మానేశాను. ఆ చానెల్‌కి ఎడిటర్ అర్నబ్ గోస్వామి అనే ప్రబుద్ధుడు. అతగాడు రాత్రిళ్ళు 'న్యూస్ అవర్' అంటూ ఒక చర్చల దుకాణం నడుపుతాడు. అయితే - అక్కడ చర్చలేమీ జరగవు. అక్కడంతా ఆ యాంకరాధముడి అరుపుల ప్రహసనం. ఆ అరుపుల్నే ప్రశ్నలు అనుకోమంటాడు! ఎవరికీ కూడా తన భీభత్స ప్రశ్నలకి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వడు!

అన్నట్లు - అర్నబ్ గోస్వామిగారు గొప్ప దేశభక్తుడు కూడా! అతని దేశభక్తి వర్షాకాలం మురుక్కాలవ వలే పొంగి పొర్లిపోతుంటుంది. ఒక్కోసారి పూనకం స్థాయికి చేరుకొని - వేపమండల్తో కొడితే గానీ దిగదేమోనన్నంత ఉధృత స్థాయికి చేరుకుంటుంది. అప్పుడతను - తనకి నచ్చని అభిప్రాయాలు చెప్పే గెస్టుల్ని తిడతాడు, వాళ్ళు దేశద్రోహులంటూ మండిపడతాడు (గిచ్చడం, కొరకడం లాంటివేమన్నా చేశాడేమో నాకు తెలీదు)!

చాలారోజుల తరవాత (నా ఖర్మ కాలి) - అర్నబ్ గోస్వామి విన్యాసాలు వీక్షించే మహద్భాగ్యం మరొకసారి లభించింది. ఆరోజు - అతగాడు ఢిల్లీ రేప్ సంఘటన మీద ఒక బ్రిటీష్ యువతి తీసిన డాక్యుమెంటరీపై తీవ్రమైన కోపంతో ఊగిపోతున్నాడు. ఆ విదేశీయురాలు భారద్దేశం రూల్సుని పాటించలేదని చిందులేస్తున్నాడు. ఆవేశంలో నరాలు చిట్లి చస్తాడేమోనని భయపడ్డాను.. ఆ తరవాత కొద్దిసేపటికి ఆశ్చర్యపొయ్యాను.

ఏ దేశంలోనైనా, ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కలవాడైనా, 'ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్' అంటూ తపన పడతాడు. అయితే ఈ మహాజ్ఞాని ఆ డాక్యుమెంటరీని కేంద్రప్రభుత్వం నిషేధించడాన్ని సమర్ధిస్తాడు! ఆ నిషేధాన్ని ప్రశ్నించేవారిని తీవ్రస్థాయిలో కేకలేస్తున్నాడు. అతని దేశభక్తి ఉన్మాద స్థాయికి చేరింది! అంటే - ఇన్నాళ్ళైనా మనవాడి రోగం నిదానించలేదన్న మాట!

ఈ అర్నబ్ గోస్వామి సర్కస్ షోని క్రమం తప్పకుండా చూసే వాళ్ళు కూడా వున్నారు! కారణమేమి? ఎవరి కారణాలు వారివి. కొందరికి ప్రశాంతమైన చర్చలు ఇష్టం వుండదు. వారికి - తగాదాలు, తిట్టుకోడాలు, గందరగోళాలంటే ఇష్టం. వీళ్ళు - రోడ్డు మీద చిన్నపాటి తగాదాల్ని గుంపులుగుంపులుగా చేరి ఆసక్తిగా చూసే బాపతు. ఇంకొందరు సర్కస్ ప్రియులు! మరికొందరికి కోతి చేష్టలంటే భలే ఇష్టం!

'న్యూస్ అవర్' ప్రోగ్రాం WWE పోటీల్ని మరిపిస్తుంది. అక్కడా ఇంతే - పోతుల్లంటి వస్తాదులు ఒకర్నొకరు తీవ్రంగా దూషించుకుంటారు, ద్వేషించుకుంటారు, చాలెంజిలు విసురుకుంటారు. ఆ టెంపోని ఒక స్థాయికి తీసుకెళ్ళాక కొట్టుకుంటారు (కొట్టుకున్నట్లు నటిస్తారు). ఈ తగాదాలు జనాకర్షకంగా వుండేట్లు రాయడానికి ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటర్లు వుంటారు. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ, ఫక్తు వ్యాపార సంస్థ. వాళ్ళ తన్నులాట ఎంత ఎక్కువమంది చూస్తే వారికంత గిట్టుబాటు.

అర్నబ్ గోస్వామి కూడా WWE సూత్రాన్నే నమ్ముకున్నట్లుగా వుంది. అతనికి తన ప్రోగ్రాంని ఇష్టపడేవారు, అసహ్యించుకునేవారూ.. ఎవరైనా పర్లేదు - వ్యూయర్‌షిప్ వుంటే చాలు! అందుకోసం వార్తల్ని వీధిపోరాట స్థాయికి దించేసి విజయం సాధించాడు. 'ద నేషన్ వాంట్స్ టు నో' అంటూ దబాయిస్తాడు - అదేదో దేశమంతా పన్లు మానుకుని అతని ప్రోగ్రామే చూస్తున్నట్లు! 'ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి' అంటూ ఏవో కాయితాలు చూపిస్తూ ఊపుతుంటాడు (ఎప్పుడు ఊపినా అవే కాయితాలని మా సుబ్బు అంటాడు)! 

'వార్తలు - వీధిపోరాట చర్చలు' అనే వినోద కార్యక్రమంతో గోస్వాములవారూ, తద్వారా టైమ్స్ నౌ చానెల్ వారూ దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. వారి వినోద వ్యాపారం రిలయన్స్ వారి వ్యాపారంలాగా విజయవంతంగా కొనసాగుతుంది. చర్చల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన సీరియస్ వార్తల్ని సైతం యాక్షన్ థ్రిల్లర్ స్థాయికి దించేసిన ఈ చౌకబారు కార్యక్రమం చూడకపోవడం నాకు హాయిగా వుంది!  మీక్కూడా ఆ హాయి కావాలా? అయితే - అది మీ చేతిలోనే వుంది!  

'మిస్టర్ అర్నబ్ గోస్వామి! ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!'