Friday, 17 July 2015

మనసు భారమైన సమయం..


కొన్ని సంఘటనలు మనసుని కలచివేస్తాయి. ఎంత సర్దిచెప్పుకుందామనుకున్నా మనసు మాట వినదు. రాజమండ్రి పుష్కరాల్లో చనిపోయినవారి వారి మృతదేహాలు చూసినప్పట్నుండి మనసు గ్లూమీగా అయిపోయింది. పాపం - పిల్లలు, వృద్ధులు, ఆడవారు.. వాళ్ళేం పాపం చేశారు? కుసింత పుణ్యం మూట కట్టుకుందామని పుష్కర స్నానం కోసం పడిగాపులు కాశారు. ఇదేనా వాళ్ళు చేసిన నేరం?

వారి నుదుటిన అలా రాసిపెట్టుంది అంటూ ప్రవచనకారులు తమదైన వేదాంత ధోరణిలో విశ్లేషించవచ్చు. రాజకీయ నాయకులు రెండు పక్షాలుగా విడిపొయ్యి తిట్టుకోవచ్చు. కరుణా హృదయులు 'అయ్యో' అని జాలి చెందవచ్చును. ఎవరేది చేసినా.. ఈ వార్త కొన్ని రోజుల పాటు మాత్రమే వార్త! అటు తరవాత ఇంకో సంఘటన జరుగుతుంది. మనం ఇదంతా మర్చిపోతాం. 

మర్చిపోలేనిదీ, జీవితమంతా ఏడుస్తూ తల్చుకునేదీ ఆయా కుటుంబ సభ్యులే. చనిపోయినవారికి సివిక్ సెన్స్ లేదనీ, ఆత్రంగా తోసేసుకున్నారనీ ఏవేవో కథనాలు! ఆ రోజు నిజంగా ఏం జరిగిందో చనిపోయినవారొచ్చి సాక్ష్యం చెప్పరు, అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు నిజం చెప్పరు. 

చనిపోయినవారికి దుస్తులు తొలగిపోయున్నాయి. చెరుగ్గడల్లా నలిగిపొయ్యి చాలా ఆక్వర్డ్ పొజిషన్లో పడున్నారు. ఆ దురదృష్టవంతుల ఫొటోలు అదేపనిగా అన్నిసార్లు చూపించడం ఏ రకమైన న్యూస్ రిపోర్టింగ్? బ్రతికున్నవాళ్ళకి గౌరవం ఎలాగూ ఇవ్వం, కనీసం విగత జీవుల పట్లనైనా మనకి గౌరవం వుండనక్కర్లేదా!

ఇసుకకి విలువుంది, కందిపప్పుకి విలువుంది.. ఏ విలువా లేనిది సామాన్యుల ప్రాణానికేనా! తిండి లేక చస్తాం, దోమ కుట్టి చస్తాం, ఎండలకి మాడి చస్తాం, వరదలకి కొట్టుకుపోతాం, రోడ్డు దాటుతూ చస్తాం, పంట పండక చస్తాం. ఇప్పుడు స్నానం చెయ్యడానికి వెళ్ళి చస్తున్నాం! మనం ఎక్కడున్నా, ఏం చేసినా.. అసలేం చెయ్యకపోయినా చావు మాత్రం వెతుక్కుంటూ వస్తూనే వుంటుంది.

దైన్యంగా బ్రతకడాన్ని కుక్క బ్రతుకు అంటారు, హీనంగా చావడాన్ని కుక్కచావు అంటారు. కుక్కలకి కడుపు నింపుకోవడం, బద్దకంగా పడుకోవడం తప్పించి పెద్దగా ఆశలున్నట్లు తోచదు. అంచేత - ఆశానిరాశల్లేని కుక్కలన్నీ మనని చూసి జాలిపడుతున్నాయని నా అనుమానం!  

ఓయీ అజ్ఞానాధమా! అధిక ప్రసంగం కట్టిపెట్టు. ఈ చావులన్నీ లలాట లిఖితము! ఎంతటివారైనా సరే - పూర్వజన్మలో చేసిన పాపపుణ్యముల ఫలితము అనుభవించక తప్పదు. తుచ్చమైన ప్రాణముల గూర్చి కలత చెందక దైవాన్ని మరింతగా ప్రార్ధింపుము, కనీసం వొచ్చే జన్మలోనైనా నువ్వు ఈర్ష్య చెందుతున్న ఆ కుక్కగా జన్మించగలవు!   

(picture courtesy : Google)

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.