Saturday 11 July 2015

ఒమర్ షరీఫ్


ఒమర్ షరీఫ్ చనిపొయ్యాడు. ఆయన కొన్నాళ్ళుగా ఆల్జైమర్స్ డిసీజ్‌తో ఇబ్బంది పడుతున్నాట్ట. కాబట్టి ఆయనకి తను చనిపోతున్నానని తెలిసుండకపోవచ్చు. చనిపోవడం కన్నా చనిపోతున్నామన్న ఆలోచనే భయం కలిగిస్తుంది. ఈ భయమేమి లేకుండా హాయిగా చనిపోయిన ఒమర్ షరీఫ్ అదృష్టాన్ని అభినందిస్తున్నాను.  

ఒమర్ షరీఫ్ నాకు చిన్నప్పుడే తెలుసునని చెప్పడానికి మిక్కిలి గర్విస్తున్నాను. అవి బెజవాడలో ఊర్వశి సినిమా హాల్ కొత్తగా కట్టించిన రోజులు. నాన్న, మావయ్య, అన్న సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు. సినిమా ప్రోగ్రాంలని పసిగట్టడంలో నేను కుక్కలాంటివాణ్ని. వాళ్ళు బయల్దేరే సమయానికి ప్రోగ్రాంలోకి నేనూ దూరిపోయ్యాను, బెజవాడ బండెక్కాను. సినిమా పేరు 'మెకన్నాస్ గోల్డ్'. 

నాకప్పటికి 70 mm సినిమా తెలీదు. ఆ పెద్ద తెర చూసి నోరెళ్ళబెట్టాను. సినిమా మొదట్లో వచ్చే గ్రెగరీ పెక్ షూటింగ్ సీన్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్.. వేరే లోకంలో ఉన్నట్లుగా అనిపించింది. విలన్ ఒమర్ షరీఫ్ మన తెలుగు హీరోల కన్నా బాగున్నాడు. ఇంటర్మిషన్‌లో కొనుక్కున్న సమోసా సినిమా కన్నా బాగుంది. ఆ రోజుల్లో మా గుంటూరుకి బెజవాడ అమెరికా కన్నా దూరం! స్నేహితులకి మెకన్నాస్ గోల్డ్ సినిమా కథని స్పెషల్ ఎఫెక్ట్స్‌తో సహా చెప్పేవాణ్ని, వాళ్ళు నోరు తెరుచుకుని వినేవాళ్ళు. 

ఒమర్ షరీఫ్ ఈజిప్ట్ దేశం వాడనీ, గొప్ప నటుడనీ, బ్రిడ్జ్ చక్కగా ఆడతాడనీ.. ఇలాంటి విశేషాలు ఆ తరవాత తెలిశాయి. ఆంగ్ల సినిమాల గూర్చి అపారమైన జ్ఞానం కలిగున్న నా మిత్రుడొకడు పీటర్ ఒటూల్ అభిమాని. అతగాడు 'లారన్స్ ఆఫ్ అరేబియా' గూర్చి అనేకమార్లు చెప్పినందున ఆ సినిమా చూశాను. నాకు 'లారన్స్ ఆఫ్ అరేబియా' ఒమర్ షరీఫ్ కన్నా 'మెకన్నాస్ గోల్డ్' ఒమర్ షరీఫే నచ్చాడు - నాది చౌకబారు టేస్ట్ అయ్యుండటం ఒక కారణం కావచ్చు! 

ఆ తరవాత బెజవాడ 'మేనక'లో చెంగిజ్ ఖాన్ చూశాను. పోస్టర్లో సినిమా పేరు జెంగిస్ ఖాన్! ఈ పేరులో వున్న తికమకే సినిమాలోనూ వుంది. ఒమర్ షరీఫ్ ఎంత గొప్ప నటుడో 'డాక్టర్ జివాగో' చూస్తే తెలుస్తుంది అంటారు. నేను చూళ్ళేదు కాబట్టి తెలీదు. కానీ 'మెకన్నాస్ గోల్డ్' ఒమర్ షరీఫ్ మాత్రం నా బుర్రలో తిష్ట వేసుకుపొయ్యాడు. ఆ చురుకైన కళ్ళు, సూటి ముక్కు.. ఒమర్ షరీఫ్ ముఖం నటనకి అనుకూలంగా వుంటుంది. అందుకే అతగాడు క్షణకాలంలో హావభావాలు మార్చెయ్యగలడు. 

మనుషులు శాశ్వతం కాదు. పుట్టిన వాడు గిట్టక మానడని భగద్గీతలో శ్రీకృష్ణులవారు సెలవిచ్చారు. తదనుగుణంగా ఒమర్ షరీఫ్ కూడా చనిపొయ్యాడు. ఆ సందర్భాన ఇలా ఓ నాలుగు ముక్కలు రాశాను. ఒమర్ షరీఫ్! ఎక్కడో ఈజిప్టులో పుట్టి అమెరికాలో నటించి బెజవాడలో కనిపించిన నీకు గుంటూరు నుండి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను, గైకొనుము!  

(picture courtesy : Google)

No comments:

Post a Comment