Thursday 9 July 2015

చిత్తప్రసాద్

కళాకారులు - రాసేవాళ్ళు, గీసేవాళ్ళు, పాడేవాళ్ళు అంటూ అనేక రకాలుగా వుంటారు. అందులో మళ్ళీ పాలక పక్షం, మధ్యతరగతి పక్షం, ప్రజల పక్షం అంటూ అనేక తరగతులుగా విడిపోయ్యుంటారు. కొందరి ప్రస్తానం ప్రజాకళాకారులుగా మొదలై కాసులకి, కీర్తికి లొంగిపొయ్యి పాలక పక్షంలోకి మారిపోతారు. వీరిని 'ఉభయచర జీవులు' అంటారని ఓ సందర్భంలో రంగనాయకమ్మ వెక్కిరించగా చదివాను, మిక్కిలి సంతసించాను. 

పాలకుల ప్రాపకం (ఒకప్పుడు రాజులు, ఇప్పుడు ప్రభుత్వాలు) సంపాదించి తమ విద్యని వారికి దాసోహం చేసి, వారిని వేనోళ్ళ కీర్తిస్తూ బాగుపడే కళాకారులని 'పాలక వర్గ కళాకారులు' అంటారు. కోడికి ఈకల్లాగా, పందికి బురదలాగా వారికి ప్రభుత్వంవారి అవార్డులు, రివార్డులు మిక్కిలి శోభనిస్తాయి! వీరిని 'బ్రతకనేర్చిన కళాకారులు' అనికూడా అనవచ్చును. 

మధ్యతరగతి ఆలోచనలకి అందంగా,  ఆహ్లాదంగా, చతురంగా ప్రెజెంట్ చేసేవారిని 'మధ్యతరగతి కళాకారులు' అంటారు. వీరినే 'ఉబుసుపోని కళాకారులు' అని కూడా అనవచ్చు. ఈ జాతివారు స్త్రీలని చారడేసి కళ్ళతో ఆరడుగుల చీరకట్టుతో అందంగా, వయ్యారంగా చూపిస్తారు. పెద్ద వాక్యాన్ని ముక్కలుగా నరికేస్తూ తల్లి మీదా, పిల్లి మీదా 'హృదయం పిండేలా' పాడతారు. ప్రవాస భారతీయుల సాంస్కృతిక సంస్థల్లో లాబీయింగ్ చేయగలగడం వీరికి గల అదనపు అర్హత (ఎచట డబ్బులుండునో అచటనే కళలూ రాణించును). 

ఇక చివరిగా - ప్రజల పక్షం నిలబడిన కళాకారులు. వీరిని 'ప్రజా కళాకారులు' అనవచ్చు. అభివృద్ధికి దూరంగా సమాజపు అడుగున వున్నవారి సమస్యల్ని, కష్టాల్ని ప్రపంచ దృష్టికి వచ్చేలా ఎంతగానో కృషి చేస్తారు. వీరు కళ కళ కోసం కాదు, ప్రజల కోసం మాత్రమేనని ఘాట్టిగా నమ్మినవారు. అయితే - వీరు నమ్ముకున్న ప్రజలు గోచీ పాతర రాయుళ్లైనందున వీరూ దరిద్రులుగానే మిగిలిపోతుంటారు.  

ఇదంతా ఎందుకు రాశానంటే -

ప్రజాకళాకారులకి అసలు సిసలు ప్రతినిథి చిత్రకారుడు చిత్తప్రసాద్. ఆయన చిత్రాలకి ముడిసరుకు అట్టడుగు వర్గాల ప్రజల జీవనమే. చిత్తప్రసాద్ గీసిన ఏ బొమ్మైనా మనకిదే చెబుతుంది. ఆ చిత్రాల్లో ఆయా వర్గాల వేదనా, కసి స్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది. 

నాకు చిత్రలేఖనంలో సాంకేతిక అంశాలు తెలీదు. కానీ - ఒక బొమ్మ ఎవరికోసం గీయబడిందో, ఎందుకు గీయబడిందో స్పష్టంగా గుర్తు పట్టగలను. నాకు చిత్తప్రసాద్ బొమ్మల్లో జీవితం కనిపిస్తుంది, మండే గుండెని చీల్చేసే చురకత్తుల వాడితనం కనిపిస్తుంది. అందుకే చాలాసార్లు ఆ బొమ్మల వైపు అలానే చూస్తుండిపోతాను. 

సరే! చిత్తప్రసాద్ దరిద్రంలో దరిద్రంగా బ్రతికాడు. ఎందఱో ప్రజా కళాకారులకి మల్లె చిత్తప్రసాద్ కూడా అనామకంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపొయ్యాడు. ఈ సంగతి నేను ప్రత్యేకంగా రాయనవసరం లేదు. ఎందుకంటే చాలాసార్లు ప్రజల మనుషుల జీవితాలు దుర్భరంగానే ముగుస్తాయి. 

చిత్తప్రసాద్! మీ పట్టుదలకీ, ప్రతిభకీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. హేట్సాఫ్ టు యు! 


(pictures courtesy : Google)

No comments:

Post a Comment