Sunday, 3 January 2016

తెలుగు వార్తలకి జర్నలిస్టులెందుకు!?


మనిషి స్వేచ్ఛాజీవి. ఇష్టం లేని పన్లు మానెయ్యొచ్చు. అలాగని అన్నిపన్లూ మానెయ్యలేం. ఉదాహరణకి - నాకు గెడ్డం చేసుకోడం ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ - దురద వల్ల చచ్చినట్లు చేసుకుంటాను. కొన్నిపన్లు మాత్రం మానేశాను - ఎంతోకాలంగా తెలుగు న్యూస్‌పేపర్లు చదవడం మానేశాను, తెలుగు న్యూస్ చానెళ్ళని చూడ్డం మానేశాను. ఉదయాన్నే టీ చప్పరిస్తూ రెండుమూడు ఇంగ్లీషు పేపర్లు తిరగేస్తాను. 

నేను తెలుగు భాషకి వ్యతిరేకిని కాను. అయితే - ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ, ఎదుటి పార్టీ నాయకుణ్ణి దుమ్మెత్తి పోసే 'వార్తల' కరపత్రాల్ని డబ్బిచ్చి కొనడం దండగ అని నా అభిప్రాయం. అలాగే ప్రతి న్యూస్ చానెల్‌కీ ఒక ఎజెండా వుంది. ఏ చానెల్లోనూ ఏ వొక్క వార్తా వొకే విధంగా రాదని అర్ధమయ్యాక న్యూస్ చానెళ్ళని చూడ్డం మానేశాను. 

మరప్పుడు తెలుగు జర్నలిస్టులు ఎవరు? రాజకీయ బ్రోకర్లైన యాజమాన్యాల అభిరుచికి తగ్గట్టుగా వార్తలు వండి వార్చే కార్మికులే జర్నలిస్టులు! వీళ్ళని జర్నలిస్టులని అనాలంటే మనసొప్పదు గానీ, ఇంకో పదం దొరకట్లేదు. టౌన్ స్థాయి జర్నలిస్టులైతే ఒక ముఠాగా ఏర్పడి, వృత్తిరీత్యా ఏర్పడ్డ పరిచయాల్తో పైరవీలు చేసుకుంటూ సంపాదిస్తారు. ఈ సో కాల్డ్ జర్నలిస్టులు ప్రయాణాల్లో రాయితీ పొందుతారు, ప్రభుత్వంతో లాలూచీ పడి చౌకగా ఇళ్ళ స్థలాలు కొట్టేస్తారు. ఇంక వీళ్ళేం 'వార్తలు' రాస్తారో అర్ధం కాదు! 

సరే! ఈ దేశంలో నడిచే అనేక అక్రమ వ్యాపారాల్లాగానే ఈ న్యూస్‌పేపర్ వ్యాపారం కూడా వొకటి. వీటిని ఎవాయిడ్ చెయ్యడం మినహా మనం చెయ్యగలిందేంలేదు. కొన్ని పత్రికలు ఎడిట్ పేజిలో కొంత స్పేస్ వ్యాసాల కోసం వదిలేస్తాయి. ఈ స్పేస్‌లో మన తెలుగు మేధావులు వ్యాసాలు రాసి తరిస్తుంటారు! ఒక అనైతికమైన వ్యాపార పత్రికలో తమ వ్యాసాల్ని అచ్చేయించుకునే ఈ మేధావుల డొల్లతనం ఆశ్చర్యం కలిగిస్తుంది! 

తెలుగు న్యూస్‌పేపర్లకి ఎడిటర్లు వుంటారు గానీ - వాళ్ళది సెక్షన్ ఆఫీసర్ స్థాయి. జీతం కోసం తల వొంచుకుని పన్జేయ్యడం వీరి స్పెషాలిటీ మరియూ అర్హత. మరి వీళ్ళకి 'ఎడిటర్' అని ట్యాగ్ ఎందుకబ్బా! విలువలు లేని ఈ పత్రికల వార్తలు కొందరికి నచ్చొచ్చేమో గానీ - నాకు మాత్రం రోత. అందువల్ల ఈ 'గొప్ప' పేపర్లని చదవడం మానేశాను. 

కొంతసేపటి క్రితం - కొన్ని టీవీ చానెల్స్ సరీగ్గా రావడం లేదని నా కూతురు చెప్పింది. టెస్ట్ చేస్తూ చానెల్స్ మారుస్తుండగా.. యాక్సిడెంటల్‌గా ఒక తెలుగు రిపోర్ట్ కంటబడింది (నా ఖర్మ). ఆ మధ్య ఓటుకి నోటు కేసు నిమిత్తం కొన్నాళ్ళు జైల్లో గడిపిన ఒక యువనాయకుడు దేవుడి దర్శనానికి తిరుమల వెళ్ళాట్ట - గొప్పగా హైలైట్ చేసి ఆయన సౌండ్ బైట్స్ తీసుకుంటున్నారు. ఇదీ మన తెలుగు జర్నలిస్టుల పనితీరు! 

హమ్మయ్యా! నా నిర్ణయం కరెక్టే - తెలుగు వార్తల రిపోర్టింగ్ అత్యంత హీనం, హేయం. అవి చూడ్డం కన్నా, మురిక్కాలవలో పందుల సౌందర్యాన్ని వీక్షించడం ఎంతో ఉత్తమం.  

(picture courtesy : Google)