Wednesday 13 January 2016

రిజర్వేషన్ - ప్రతిభ


సాయంత్రం ఆరుగంటలు. కాఫీ చప్పరిస్తూ టీవీ వార్తలు చూస్తుండగా -

"నాన్నా! మన కంట్రీ వెనకబడి ఎందుకుందో తెలుసా? రిజర్వేషన్స్ వల్ల! మనకి నైంటీ పర్సెంట్ వచ్చినా సీటు రాదు. ఆ బీసీ, యస్సీలకి తక్కువ మార్కుల్తో సీటొచ్చేస్తుంది!" - నా కూతురి స్టేట్మెంట్!

నాకు నా కూతుర్లో ఒకప్పటి నా అజ్ఞానం కనపడింది.

"తప్పమ్మా, అలా అనకు. ఇక్కడ 'వాళ్లు, మనం' అంటూ యెవరూ లేరు. అంతా 'మనమే'." అన్నాను.

"ఛాన్సులన్నీ వాళ్లే కొట్టేస్తున్నారు." మా అమ్మాయికి నా మాట నచ్చలేదు.

"ముందసలు రిజర్వేషన్లు ఎలా వచ్చాయో తెలుసుకో. యెన్నో యేళ్లుగా కులం పేరుతో కొన్నివర్గాల్ని తొక్కేశారు. వారిని అభివృద్ధిలో భాగం చెయ్యాలన్నా.. సమాన అవకాశాల్ని కల్పించాలన్నా.. " అంటూ చెప్పబోతుండగా -

మొహం చిట్లించుకుంటూ నా కూతురు తన బెడ్రూములోకి వెళ్ళిపోయింది!

మెడిసిన్ సీటొచ్చేదాకా రిజర్వేషన్ల గూర్చి నాకు తెలీదు. అక్కడే మొదటిసారిగా బీసీ, ఎస్సీ అనే పదాలు విన్నాను. రిజర్వేషన్ల వల్ల ప్రతిభకి నష్టం జరుగుతుందని మా (ఓపెన్ కేటగిరీ) సీనియర్లు చెబుతుండేవాళ్ళు. వారి మాటలు నాకు బాగా నచ్చాయి. కొన్నాళ్ళకి - రిజర్వేషన్ల వల్ల ఓపెన్ కేటగిరీ పేదవిద్యార్ధులకి తీవ్రమైన అన్యాయం జరిగిపోతుందని నమ్మడం మొదలెట్టాను. ఆ తరవాతగానీ అసలు విషయం అర్ధం కాలేదు.

ఇదంతా ఒక పరిణామ క్రమం. యే విషయాన్నైనా అవగాహన చేసుకోడంలో ఒక్కొక్కళ్లు ఒక్కోదశలో స్థిరపడిపోతారు. రిజర్వేషన్ల గూర్చి ఒకప్పటి నా అవగాహన ఆనాడు నాకున్న పరిమితుల్ని సూచిస్తుంది. నాకు రిజర్వేషన్ లేకపోవడం, రిజర్వేషన్ వల్ల సీటొచ్చిన విద్యార్థుల్తో పెద్దగా స్నేహం లేకపోవడం నాకున్న పరిమితులు.

"రిజర్వేషన్ ప్రతిభని గండి కొడుతుంది."

ఈ వాదన సరికాదు. ఉదాహరణకి - మెడిసిన్ సీటుకి కావలసిన కనీస అర్హత ఇంటర్మీడియేట్ బయాలజీ సబ్జక్టుల్తో పాసవ్వడం. కానీ మనకి మెడిసిన్ సీట్లు తక్కువ, అర్హులైన విద్యార్ధుల సంఖ్య యెక్కువవడం మూలాన మళ్లీ వడపోత కోసం ప్రవేశ పరీక్ష పెట్టారు. ఇందుకోసం విద్యార్ధులు ఇంటర్ సబ్జక్టుల్నే తీవ్రంగా చదువుతారు, ఈ జ్ఞానం మెడిసిన్ సీటు వొచ్చేవరకే. ఆ తరవాత పాము కుబుసం విడిచినట్లు ఆ సబ్జక్టుల్ని వదిలేస్తారు.

మెడికల్ ఎడ్యుకేషన్ కోర్సులో మొదటి సంవత్సరం కొత్త సబ్జక్టులు మొదలవుతాయి. ఎంబీబీఎస్ కోర్సులో సబ్జక్టులు పాసవడానికి రిజర్వేషన్ వర్తించదు. అందరికీ ఒకే పరీక్ష, ఒకే కొలబద్ద. కాబట్టి - సామాజికంగా వెనకబడిన విద్యార్ధులకి మెడికల్ కాలేజిలోకి ప్రవేశానికి మాత్రమే రిజర్వేషన్ ఉంటుందని, ఆ తరవాత ఇంకే విధమైన రాయితీలు వుండవని మనం గుర్తుంచుకోవాలి.

అదేవిధంగా - పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ. పీజీ సీట్లు తక్కువ కాబట్టి మళ్లీ ప్రవేశ పరీక్ష. ఒక్కసారి పీజీ కోర్సులో చేరాక పాసవ్వడానికి రిజర్వేషన్ వర్తించదు. అంటే ఆపరేషన్ చెయ్యడానికి ఎమ్మెస్ పాసైన డాక్టర్లందరిదీ సమాన ప్రతిభ అవుతుంది. కావున రిజర్వేషన్ డాక్టర్, ఓపెన్ కేటగిరీ డాక్టర్ అంటూ వేర్వేరు ప్రతిభలుండే అవకాశం లేదు.

మన దేశ ఆరోగ్య వ్యవస్థలో ప్రధానమైన పాత్ర ప్రభుత్వాలది. గ్రామీణ పేదల అవసరాలు ఇవ్వాళ్టికీ ప్రభుత్వాసుపత్రులే తీరుస్తున్నాయి. ఈరోజుకీ టైఫాయిడ్, కలరా, మలేరియా, డయేరియాలే మన ప్రధాన శత్రువులు. ఈ రోగాలకి వైద్యం అందేది ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనే. ఇక్కడ పన్జేసే వైద్యుల్లో ఎక్కువమంది రిజర్వేషన్ వల్ల డాక్టర్లైనవాళ్లే!

మంచి డాక్టర్ కావాలంటే గొప్ప తెలివితేటలు కావాలనుకుంటారు, అస్సలు అవసరం లేదు. మంచి డాక్టర్ కావాలంటే కావలసింది కమిట్మెంట్. నాలుగ్గోడల మధ్యా, లైబ్రరీల్లో కూచుని మెడిసిన్ సబ్జక్టుల్ని మధించడం సరైన వైద్యవిద్య కాదు. వార్డుల్లో పేషంట్లని అధ్యయనం చేస్తూ రోగాల్ని అర్ధం చేసుకోవడం వైద్యవిద్యకి సరైన పునాది.

కాబట్టి -

"రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుంది." అన్నది పసలేని వాదన అని నా అభిప్రాయం.

(fb post on 13 jan 2018)