Tuesday 19 January 2016

దళిత ప్రజాప్రతినిథుల దివాళాకోరుతనం


అనగనగా ఒకానొకప్పుడు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్ధి సంఘాలు వుండేవి. SFI, AISF, RSU, ABVP, NSUI అంటూ హడావుడి రాజకీయ వాతావరణం వుండేది. ఇప్పట్లా కులసంఘాలు వుండేవి కావు. విద్యార్ధి సంఘాలు ప్రధాన రాజకీయ పార్టీలకి అనుబంధ సంస్థలు కావున, తరచూ వీటిమధ్య గొడవలు జరుగుతుండేవి. వాతావరణం అప్పుడప్పుడు ఉద్రిక్తంగానూ వుంటుండేది. 

కాలక్రమేణా ఎర్రజెండా ప్రాభవం కోల్పోయింది. ఎర్రజెండా స్థానంలో దళిత సంఘాలు క్రియాశీలకంగా ముందుకొచ్చాయి. వీరికి రాజకీయంగా సహజ శత్రువు బ్రాహ్మణీయ ABVP కాబట్టి అనేకచోట్ల ఘర్షణాత్మకమైన వాతావరణం నెలకొనుంది. ఇదిలా వుండగా - కేంద్రంలో బీజేపి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. మతవాద శక్తులకి అధికారం తోడైతే ఇంక ఎదురుండదు. కావున ఇవ్వాల్టి ABVP ఒకప్పటి ABVP కాదు, చాలా బలం సంతరించుకుంది. ఈ నేపధ్యంలో ఆలోచిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు.

సంఘపరివారానికి ABVP కార్యకర్తలు, VHP నేతలు, కేంద్రమంత్రులు.. అందరూ బిడ్డలే. ఎవరు ఎంత స్థాయిలో వున్నా అన్నదమ్ములు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కాబట్టి యూనివర్సిటీలో జరిగిన ఒక చిన్న ఘర్షణ ఆధిపత్య పోరుగా మారింది. ఈ పోరులో సంఘపరివారానికి చెందిన కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి చురుకైన పాత్ర వహించడం ఆశ్చర్యకరమైన పరిణామం కాదు. 

మతతత్వ విద్యార్ధి సంఘానికి కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పుడు - వివక్షతకి గురవుతూ, తీవ్రమైన కష్టాల్లో వున్న దళిత విద్యార్ధులకి దళిత ప్రజాప్రతినిథులు ఎందుకు అండగా నిలవలేదు!? ఎందుకంటే - మనది నిచ్చెన మెట్ల మనువాది వ్యవస్థ. ఇది ఖరీదైన ముసుగు కప్పుకుని అమాయకంగా కనిపిస్తుంది. అధికారం అందరి చేతిలో వున్నట్లుగానే కనబడుతుంది గానీ - కొందరి చేతిలోనే వుంటుంది.

కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబాన్ని కాదన్నవాడికి మంచినీళ్ళు పుట్టవు. బీజేపిలో RSS విధేయుడిగా లేనివారు వార్డు స్థాయి నాయకుడిగా కూడా ఎదగలేరు. కెరీర్ రాజకీయాల్లో పదవే పరమావిధి. అందుకు చట్ట సభల్లో ఎన్నిక కావడం కీలకం. అందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు అవసరం. అందుకు పార్టీకి విధేయుడిగా వుండటం అవసరం.

ఈ సీక్వెన్స్ అర్ధం అయితే, సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్ధులకి దళిత ప్రజాప్రతినిథులు అండగా ఎందుకు నిలబడలేదో అర్ధమవుతుంది. దళిత రిజర్వేషన్ వాడుకుని ప్రజాప్రతినిథులుగా ఎన్నికైనవారు 'పైనుండి' ఆదేశాలు రాకపోతే తమవారి వైపు కన్నెత్తి చూడరు (అలా చూస్తే ఏమవుతుందో తెలిసిన బ్రతకనేర్చిన నేతలు కనుక). అధికారం, పదవులు, డబ్బుకున్న పవర్ అట్లాంటిది!

మనువాది పార్టీలు దళితులకి ఎలాగూ శత్రువులే. కనబడే శత్రువు కన్నా కనబడని శత్రువు ప్రమాదకారి. తమ పక్షాన నిలబడని (నిలబడలేని) దళిత ప్రజా ప్రతినిథులకి బుద్ధి చెప్పగలిగి, వారిని శాసించే స్థాయికి దళిత సంఘాలు చేరుకున్న రోజున - అవి శత్రువుని మరింత సమర్ధతతో ఎదుర్కొనగలవు. ఆ విధంగా దళిత చైతన్యం పురోగమించగలిగితే, రోహిత్ వంటి యువకులు మరింత ఉత్సాహంగా పోరాడగలరు. ఆ రోజు సమీప భవిష్యత్తులో వస్తుందని ఆశాభావంతో వుందాం (అంతకుమించి చేసేదేమీ లేదు కనుక).