Tuesday, 5 January 2016

తీస్తా సెటిల్వాడ్


ముప్పయ్యేళ్ళ క్రితం ఢిల్లీలో గుర్తు తెలీని మూకలు సిక్కుల్ని వెతికి వెతికి వేటాడి చంపాయి. చాల్రోజుల్దాకా నేర విచారణాధికారులకి ఆ నేరం వెనుక ఎవరున్నారో తెలీలేదు. తెలీనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి మిన్నకున్నారు. కానీ చచ్చినవాళ్ళ తరఫున బంధువులు గోల చేసినప్పుడు.. గతిలేని పరిస్థిలో కొందరు కాగ్రెస్ నేతలపై నేరారోపణ చేశారు. సహజంగానే ఆ కేసులు చివరిదాకా నిలబళ్ళేదు.

పదమూడేళ్ళ క్రితం గుజరాత్‌లో గుర్తు తెలీని మూకలు ముస్లింలని వెతికి వెతికి వేటాడి చంపాయి. షరా మామూలే - చాల్రోజుల్దాకా నేర విచారణాధికారులకి ఆ నేరం వెనుక ఎవరున్నారో తెలీలేదు. తెలీనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి మిన్నకున్నారు. కానీ చచ్చినవాళ్ళ తరఫున బంధువులు గోల చేసినప్పుడు.. గతిలేని పరిస్థిలో కొందరు బీజేపీ నేతలపై నేరారోపణ చేశారు. ఆ కేసులు పండుటాకులు రాలిపోతున్నట్లుగా ఒకటొకటిగా వీగిపోతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతుందంటారు. అంటే ఇదే కాబోలు! 

మన్దేశంలో అధర్మం, అన్యాయం - గర్వంగా, పొగరుగా, నిర్లక్ష్యంగా రొమ్ము విరుచుకుని నాలుగు పాదాల మీదా నడుస్తున్నాయని దిగులు చెందాను. మన్దేశంలో న్యాయం, ధర్మం - అవమానంతో, సిగ్గుతో కుంటినడక నడుస్తున్నాయని దుఃఖించాను. మన్దేశంలో నేరపరిశోధన, నేరవిచారణ అనే పదాలకి అర్ధం లేకుండా పోయిందని ఆందోళన చెందాను. ఇప్పుడు మన్దేశంలో వ్యవస్థల ఫ్యాక్షనిస్టు మైండ్ సెట్ పట్ల భీతి చెందుతున్నాను.

శ్రీమతి తీస్తా సెటిల్వాడ్ అనే మహిళ సామాజిక కార్యకర్త. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తుంది. గుజరాత్ అల్లర్లలో చనిపోయినవారి తరఫున అనేక కేసులు వేసింది. ఆ కేసుల్లో విచారణ ఇంకా కొనసాగుతుంది.

తీస్తా సెటిల్వాడ్, ఆమె భర్త జావెద్ ఆనంద్‌లకి ఒక NGO వుంది. సంస్థ తరఫున విరాళాలు సేకరించారు. ఆ డబ్బుల్లో కొంత ఖరీదైన సారాయి బుడ్లు, సెంటు బుడ్ల కోసం సొంతంగా వాడుకున్నారట. ఇలా చెయ్యడం తప్పకుండా నేరమే. అందుకు సంబంధిన ప్రతి లొసుగునీ బయటకి లాగాల్సిందే. నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లభిస్తే కేసు బుక్ చెయ్యాల్సిందే, న్యాయస్థానాల్లో నిరూపించాల్సిందే. అప్పుడు నేరస్తురాలైన తీస్తాని ఎవరూ సమర్ధించరు కూడా. కానీ జరుగుతున్నదేమిటి?

తీస్తా సెటిల్వాడ్, ఆమె భర్తనీ CBI అనేకసార్లు ప్రశ్నించింది. వాళ్ళ ఆఫీసులో సోదాలు చేసింది, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఒకటి నుండి రెండు కోట్ల దాకా నిధులు దుర్వినియోగం అయ్యాయని తేల్చింది. మరింక తీస్తాని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సింది ఏముంది? CBI ఎందుకంతలా ఉవ్విళ్ళూరుతుంది? 

ఎందుకంటే - తమకి నచ్చని వారి పట్లా, తమని ఇబ్బంది పెట్టే వారి పట్లా రాజ్యం కక్షపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఇది ప్రపంచ చరిత్ర చెబుతున్న సత్యం. కక్ష తీర్చుకోవడానికి ఫాసిస్టులకి ఎటువంటి మొహమాటాలు వుండవు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇదే ప్రక్రియ త్రాచుపాము జరజరా పాకుతున్నంత మెత్తగా, మెథాడికల్‌గా సాగుతుంది. మొడస్ ఒపరాండై ఏదైనా ఫలితం మాత్రం ఒకటే!

ఏ విషయాన్నైనా ఒక హోప్‌తో, ఒక పాజిటివ్ నోట్‌తో ముగించాలని అంటారు. కాబట్టి - 

నేర పరిశోధనా సంస్థల వారు తీస్తా కేసుపై చూపిస్తున్న ఆత్రుత, ఉత్సాహం అన్ని కేసుల పైనా చూపించాలని ఆశిస్తున్నాను (ఇలా ఆశించడం ఎంత హాస్యాస్పదం అయినా ఆశించడం మినహా చెయ్యగలిగిందేమీ లేదు కాబట్టి)

(picture courtesy : Google)

Sunday, 3 January 2016

'కూడలి' మూసివేత - ఒక మంచినిర్ణయం


తెలుగులో కొందరు బ్లాగులు రాస్తుంటారు, ఇంకొందరు చదువుతుంటారు. ఈ రాసేవాళ్ళకీ, చదివేవాళ్ళకీ 'కూడలి' అంటే అభిమానం. బ్లాగుల్ని ఒక పట్టీలా తయారుచేసి, ఎప్పటికప్పుడు అందించే సైట్‌ని ఎగ్రిగేటర్ అంటారు. ఈ ఎగ్రిగేటర్లలో కూడలి చాలా ప్రముఖమైనది. ఈమధ్య కూడలిని మూసేశారు. ఇది లేటుగా తీసుకున్న మంచి నిర్ణయం అని నా అభిప్రాయం. 

మీరీ ఎగ్రిగేటర్లని ఒక్కరోజు గమనించినా నానారకాల చెత్తకి కేరాఫ్ ఎడ్రెస్ తెలుగు బ్లాగులు అని అర్ధమైపోతుంది. వ్యక్తిగత వివాదాలు, దాడులు, ప్రతి దాడులు, తిట్లు (అప్పుడప్పుడు బండబూతులు) తెలుగు బ్లాగుల ప్రత్యేకత! మరప్పుడు ఈ చెత్తని సపోర్ట్ చెయ్యడానికి ఎగ్రిగేటర్లు ఎందుకు!?

ఇప్పుడు 'మాలిక' అని ఒక ఎగ్రిగేటర్ వుంది. ఈ సైట్ నిర్వాహకులు హిందుత్వవాదులు, వామపక్ష రాజకీయాల పట్ల తీవ్రమైన ఏవగింపు కలవారు. తమకి నచ్చని అభిప్రాయాలున్న సహబ్లాగర్లని తిట్టడానికే బ్లాగులు నడిపిన, నడిపిస్తున్న ఘనులు! ఇలా తిట్లూ, బూతులూ రాసినంత కాలం మాలిక తెగ ఎంజాయ్ చేస్తూ తనవంతు 'ప్రోత్సాహం' ఇస్తూనే వుంటుంది. బెస్టాఫ్ లక్ టు మాలిక!

(picture courtesy : కూడలి)

తెలుగు వార్తలకి జర్నలిస్టులెందుకు!?


మనిషి స్వేచ్ఛాజీవి. ఇష్టం లేని పన్లు మానెయ్యొచ్చు. అలాగని అన్నిపన్లూ మానెయ్యలేం. ఉదాహరణకి - నాకు గెడ్డం చేసుకోడం ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ - దురద వల్ల చచ్చినట్లు చేసుకుంటాను. కొన్నిపన్లు మాత్రం మానేశాను - ఎంతోకాలంగా తెలుగు న్యూస్‌పేపర్లు చదవడం మానేశాను, తెలుగు న్యూస్ చానెళ్ళని చూడ్డం మానేశాను. ఉదయాన్నే టీ చప్పరిస్తూ రెండుమూడు ఇంగ్లీషు పేపర్లు తిరగేస్తాను. 

నేను తెలుగు భాషకి వ్యతిరేకిని కాను. అయితే - ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ, ఎదుటి పార్టీ నాయకుణ్ణి దుమ్మెత్తి పోసే 'వార్తల' కరపత్రాల్ని డబ్బిచ్చి కొనడం దండగ అని నా అభిప్రాయం. అలాగే ప్రతి న్యూస్ చానెల్‌కీ ఒక ఎజెండా వుంది. ఏ చానెల్లోనూ ఏ వొక్క వార్తా వొకే విధంగా రాదని అర్ధమయ్యాక న్యూస్ చానెళ్ళని చూడ్డం మానేశాను. 

మరప్పుడు తెలుగు జర్నలిస్టులు ఎవరు? రాజకీయ బ్రోకర్లైన యాజమాన్యాల అభిరుచికి తగ్గట్టుగా వార్తలు వండి వార్చే కార్మికులే జర్నలిస్టులు! వీళ్ళని జర్నలిస్టులని అనాలంటే మనసొప్పదు గానీ, ఇంకో పదం దొరకట్లేదు. టౌన్ స్థాయి జర్నలిస్టులైతే ఒక ముఠాగా ఏర్పడి, వృత్తిరీత్యా ఏర్పడ్డ పరిచయాల్తో పైరవీలు చేసుకుంటూ సంపాదిస్తారు. ఈ సో కాల్డ్ జర్నలిస్టులు ప్రయాణాల్లో రాయితీ పొందుతారు, ప్రభుత్వంతో లాలూచీ పడి చౌకగా ఇళ్ళ స్థలాలు కొట్టేస్తారు. ఇంక వీళ్ళేం 'వార్తలు' రాస్తారో అర్ధం కాదు! 

సరే! ఈ దేశంలో నడిచే అనేక అక్రమ వ్యాపారాల్లాగానే ఈ న్యూస్‌పేపర్ వ్యాపారం కూడా వొకటి. వీటిని ఎవాయిడ్ చెయ్యడం మినహా మనం చెయ్యగలిందేంలేదు. కొన్ని పత్రికలు ఎడిట్ పేజిలో కొంత స్పేస్ వ్యాసాల కోసం వదిలేస్తాయి. ఈ స్పేస్‌లో మన తెలుగు మేధావులు వ్యాసాలు రాసి తరిస్తుంటారు! ఒక అనైతికమైన వ్యాపార పత్రికలో తమ వ్యాసాల్ని అచ్చేయించుకునే ఈ మేధావుల డొల్లతనం ఆశ్చర్యం కలిగిస్తుంది! 

తెలుగు న్యూస్‌పేపర్లకి ఎడిటర్లు వుంటారు గానీ - వాళ్ళది సెక్షన్ ఆఫీసర్ స్థాయి. జీతం కోసం తల వొంచుకుని పన్జేయ్యడం వీరి స్పెషాలిటీ మరియూ అర్హత. మరి వీళ్ళకి 'ఎడిటర్' అని ట్యాగ్ ఎందుకబ్బా! విలువలు లేని ఈ పత్రికల వార్తలు కొందరికి నచ్చొచ్చేమో గానీ - నాకు మాత్రం రోత. అందువల్ల ఈ 'గొప్ప' పేపర్లని చదవడం మానేశాను. 

కొంతసేపటి క్రితం - కొన్ని టీవీ చానెల్స్ సరీగ్గా రావడం లేదని నా కూతురు చెప్పింది. టెస్ట్ చేస్తూ చానెల్స్ మారుస్తుండగా.. యాక్సిడెంటల్‌గా ఒక తెలుగు రిపోర్ట్ కంటబడింది (నా ఖర్మ). ఆ మధ్య ఓటుకి నోటు కేసు నిమిత్తం కొన్నాళ్ళు జైల్లో గడిపిన ఒక యువనాయకుడు దేవుడి దర్శనానికి తిరుమల వెళ్ళాట్ట - గొప్పగా హైలైట్ చేసి ఆయన సౌండ్ బైట్స్ తీసుకుంటున్నారు. ఇదీ మన తెలుగు జర్నలిస్టుల పనితీరు! 

హమ్మయ్యా! నా నిర్ణయం కరెక్టే - తెలుగు వార్తల రిపోర్టింగ్ అత్యంత హీనం, హేయం. అవి చూడ్డం కన్నా, మురిక్కాలవలో పందుల సౌందర్యాన్ని వీక్షించడం ఎంతో ఉత్తమం.  

(picture courtesy : Google)