Friday 2 June 2017

గొప్పసినిమాకి నా క్రైటీరియా

సినిమాలు అన్నీ అందరికీ నచ్చవు. నచ్చిన సినిమాలోనూ అందరికీ ఒకే విషయం నచ్చదు. మృదువైన సింగిల్ మాల్ట్, ఘనమైన ఉప్మాపెసరట్టులు కూడా కొందరికే నచ్చుతాయి. నాకు 'డాక్టర్ చక్రవర్తి'లో జగ్గయ్య అర్ధమయ్యాడు, నాగేశ్వరరావు చిర్రెత్తించాడు. 'ముత్యాలముగ్గు'లో సంగీత బోరు కొట్టించింది, హలం భలేగా నచ్చింది! 

ఇదంతా యెందుకు రాస్తున్నానంటే - మొన్నటిదాకా తెలుగు సినిమాలు భీభత్సంగా చూసేశానని అనుకున్నాను. కానీ - విశ్వనాథ్ ఫాల్కే ఎవార్డ్ సమయంలో, దాసరి మరణం సందర్బంగా నాకు అర్ధమైందేమనగా.. నేను గొప్ప సినిమాలు అతితక్కువ చూశానని!

సినిమా అనేది పూర్తిగా కాలక్షేపం వ్యవహారం - పన్లేనివారు అదేపనిగా చూస్తారు, లేకపోతే లేదు. కానీ - యెన్నో సినిమాలు చూసిన నేను గొప్ప సినిమాలకి కిలోమీటర్ల దూరంలో యెందుకుండిపొయ్యాను? నాకు వెంటనే తట్టిన సమాధానం.. 'నా సినిమా జానర్ వేరు' అని. 

గొప్పసినిమాకి నా క్రైటీరియా యేమనగా -

శ్రీదేవి సినిమాలన్నీ గొప్ప సినిమాలే! సినిమాలో జ్యోతిలక్ష్మి లేక జయమాలిని డ్యాన్స్ వుంటే అది మరింత గొప్ప సినిమా అవుతుంది. కథకి అవసరం కాబట్టి హీరో వుంటాడు గానీ నా దృష్టిలో హీరో విలువ పూచికపుల్ల కన్నా తక్కువ. అదీగాక - ఒక మగాడు ఒక మగ నటుణ్ని తీవ్రంగా అభిమానించి, ప్రేమించడం latent homosexuality అయ్యుండొచ్చనే అనుమానం నాకుంది.  

పచ్చని పారాణి, ఎర్రని కుంకుమ, ప్రాచీన సాంప్రదాయాలు, పవిత్ర కళలు నా వొంటికి సరిపడవు.. విశ్వనాథ్ ఔట్. పరిషత్తు నాటకాల్లా చాంతాడు డైలాగులంటే భయం.. దాసరి ఔట్! కుదిర్తే పౌరాణిక శ్రీరాముడు, కుదరకపోతే సాంఘిక శ్రీరాముడు - ఆసక్తి లేదు.. బాపు ఔట్!  

నేనిలా నాదైన exclusion criteria ఫాలో అయిపోవడం వల్ల ప్రజలు మెచ్చిన అనేక గొప్ప చిత్రరాజముల్ని మిస్సైతిని. ఇందుకు నేనేమీ చింతించడం లేదు, కారణం - నాక్కావాల్సిన సినిమాలు నే చూసుకున్నాను, అందుగ్గానూ మిక్కిలి సంతోషిస్తున్నాను!

(fb post .. )