Wednesday 16 August 2017

రోజులు మారాయి


సినిమాలు అనేక రకాలు. ఒక్కొక్కళ్లకి ఒక్కోసినిమా ఒకందుకు నచ్చుతుంది/నచ్చదు. చిన్నప్పుడు హాల్లో ఎక్కువగా ఫైటింగ్ సినిమాలు చూశాను, ఆ సినిమాలన్నీ తరవాత చూస్తే విసుగ్గా అనిపిస్తుంటాయి. ఇదొక పరిణామ క్రమం.

తెలుగులో నచ్చిన సినిమాల గూర్చి రాద్దామంటే నాకిప్పుడో భయం పట్టుకుంది. కారణం - వాటి ఇంగ్లీష్ మూలం చెప్పేస్తున్నారు. కాపీ ఐడియాతో సినిమా యెంత గొప్పగా తీసినా, అది మంచి సినిమా అవ్వొచ్చేమోగానీ.. గొప్ప సినిమా మాత్రం అవ్వదని నా అభిప్రాయం.

'తెలుగు సినిమాల్లో నీకు బాగా నచ్చిన సినిమా యేది?' అని అడగంగాన్లే గత కొన్నేళ్లుగా ఠక్కున 'రోజులు మారాయి' అని చెబుతున్నాను. ఈ సినిమా గూర్చి వివరంగా రాద్దామనే కోరిక తీరలేదు, ఇక తీరే అవకాశమూ లేదని అర్ధమైంది.

'రోజులు మారాయి' పూర్తిగా గ్రామీణ జీవితం. సినిమాలో రైతు జీవితం వుంటుంది, ఇంకేదీ వుండదు. రైతుల భూమిసమస్య, భుక్తి సమస్య, బ్రతుకు సమస్య.. వారి దృష్టికోణంలో చూపిస్తుంది. కులాల కట్టుబాట్లు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న తీరు సూటిగా చెబుతుంది. సన్నివేశాల చిత్రీకరణ, కథ మనమధ్యే జరుగుతున్నంత సహజంగా వుంటుంది.

మీరు చూడకపోయినట్లైతే, ఒకసారి చూడదగ్గ సినిమా 'రోజులు మారాయి'. మీకీ సినిమా నాకు నచ్చినంత గొప్పగా నచ్చకపోయినా.. ఎంతోకొంత నచ్చుతుందని నమ్ముతున్నాను.

'రోజులు మారాయి'లోంచి ఒక ముఖ్యమైన సీన్ ఇక్కడ ఇస్తున్నాను (ఆ రోజుల్లో కలెక్టర్లు నిజాయితీ, నిబద్దత కలిగిన మంచి ఆఫీసర్లు - ఈ రోజుల్లోలా కాదు). 

(fb post)