Thursday 31 August 2017

బానిసలు మళ్లీ పుట్టారు

అది అబ్రహం లింకన్ కాలం -

బానిసత్వంపై అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది. బానిసలు స్వతంత్రులవుతున్నారు. అయితే - అన్ని రంగాల్లో dissent వున్నట్లే, బానిసల్లో కూడా కొందరికి బానిసత్వ విముక్తి నచ్చలేదు.

వారిలో - "మనకి బానిసత్వం బాగానే వుంది కదా! ఇప్పుడు దీన్ని వదులుకోడం దేనికి?" అనే వాదన మొదలైంది.

ఈ వాదనకారుల్లో ఒకడు యాభై సంవత్సరాలు బానిసత్వంలో పండిపోయినవాడు. అతను ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా చెప్పాడు.

"ఉరే బానిసబ్బాయిలూ! అమెరికా రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి, బానిసత్వం అంతరించిపోయే ప్రమాదం కనుచూపు మేరలోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం 'మేం బానిసలుగానే మిగిలిపోతాం' అంటే మన తోటి బానిసలే మన్ని బ్రతకనివ్వరు." అంటూ నిట్టూర్చాడు.

"అంతేనా, మనం మన అమూల్యమైన బానిసత్వాన్ని వదులుకోవాల్సిందేనా? అయ్యో!" అంటూ బానిసలు సామూహికంగా పెడబొబ్బలు పెడుతూ రోదించసాగారు.

'ఇంక చాలు, ఆపండి' అన్నట్లు కుడిచెయ్యి పైకెత్తి వారిని వారించాడు సీనియర్ బానిస.

"మనం ఇంతలా రోదించనవసరం లేదు. నిన్నరాత్రి అంజనం వేసి చూశాను. అక్కడెక్కడో 'భారద్దేశం' అనే దేశం వుందిట, అందులో 'తెలుగు' అనే భాష మాట్లాడే జనులున్నారట! వాళ్లదీ అచ్చు మనలాంటి బానిసబుద్ధేట! మనం పునర్జన్మలో మళ్లీ అక్కడ పుడతాం. తెలుగు సినిమాలకి అభిమానులుగా వుంటాం. హీరోలకీ, వారి కుటుంబాలకీ, వంశాలకీ సేవ చేసుకుంటూ.. ఇంచక్కా బానిసల్లా బ్రతికేస్తాం." అంటూ కఫం అడ్డొచ్చి దగ్గాడు.

బానిసలకి వొళ్ళు పులకరించింది, ఆనందంతో గెంతులు వేసుకుంటూ - "బానిసత్వం వర్ధిల్లాలి, బానిసలూ జిందాబాద్!" అంటూ నినాదాలు చేశారు.

(రావిశాస్త్రి 'వేతనశర్మ' సౌజన్యంతో)

(fb post)