Saturday 13 August 2011

భాష - పెసరట్టు


"మిత్రమా! కాఫీ, అర్జంట్." అంటూ కూర్చీలో కూలబడ్డాడు సుబ్బు. 

టీవీలో తెలుగు భాష కమ్మదనంపై యేదో ప్రోగ్రామ్ వస్తుంది.  
              
"సుబ్బూ! తెలుగు భాషకి అన్యాయం జరిగిపోతుంది, మనం తెలుగుని రక్షించాలి." అన్నాను.   
              
"తెలుగు భాషని ఉద్ధరించేంతగా మనం ఎదగలేదు నాయనా. అయినా తెలుగు భాష మనం రక్షించేంత దుస్థితిలో ఉందా?" ఆశ్చర్యపొయ్యాడు సుబ్బు.  
             
"ఉందనే భాషాభిమానులు అంటున్నారు." అన్నాను.     
             
"వాళ్లంతే అంటార్లే. యే భాషైనా సత్తా ఉంటే నిలబడుతుంది, లేకపోతే పడుకుంటుంది. ఎన్ని మీటింగులు పెట్టి ఎంత గొంతు చించుకున్నా చచ్చేదాన్ని బ్రతికించలేవు, బ్రతికేదాన్ని చంపలేవు. మనని ఉప్మాపెసరట్టు తినమని ఎవడన్నా శాసిస్తున్నాడా? అయినా తింటూనే వున్నాంగదా!" అన్నాడు సుబ్బు. 
              
"తెలుగు గొప్పభాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్." గర్వంగా అన్నాను.   
              
"నాకు ఇటలీ భాష తెలీదు. ప్రతిమనిషికి తనకంటూ ఒక భాష ఉంటుంది. దాన్నే మాతృభాషనో, పితృభాషనో అంటారు. ఫలానా భాష గొప్పదని మనమెలా నిర్ణయిస్తాం? సపోజ్ మనం ఒరిస్సాలో పుడితే అప్పుడు 'ప్రపంచంలో ఒరియా భాషే గొప్పభాష' అని చంకలు గుద్దుకునేవాళ్ళం కాదా?" అన్నాడు సుబ్బు.

"దేశభాషలందు తెలుగుభాష లెస్స అన్నారు రాయలవారు, నేను కాదు." నవ్వుతూ అన్నాను. 

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ -

"రాయలవారు భాషల్ని యే ప్రాతిపదికన గ్రేడింగ్ చేశాడో నాకు తెలీదు. 'ఫలానా మా భాష మీ తెలుగుభాష కన్నా లెస్సు' అన్నవాడు నాకెప్పుడూ కనపళ్ళేదు. నాకు మాత్రం ఉప్మాపెసరట్టు కడుపులో పడితే కాకి అరుపు కూడా కోయిల పాటలా మధురంగా వినిపిస్తుంది." అన్నాడు సుబ్బు.   
              
"సుబ్బు! తమిళుల భాషాభిమానం చూసి సిగ్గు పడదాం." అన్నాను. 
              
"అరవ తంబిలది భాషా దురభిమానం, భాషా తాలిబానిజం. వాళ్ళే మన తెలుగువారిని చూసి పరభాషా సహనం అలవరుచుకోవాలి." 
              
"తెలుగు భాష తేనె కన్నా తియ్యనైనదని అంటున్నారు భాషాప్రేమికులు." అన్నాను.
              
"నిజమా! అలాగైతే షుగర్ రోగుల్ని తెలుగు భాషకి దూరంగా వుండమను!" నవ్వాడు సుబ్బు. 

"సుబ్బు! తెలుగు భాషోద్దారకులు నిస్వార్ధజీవులు." 

"అవునేమో! కాదన్డానికి మనమెవరం? కాకపోతే మన బాచిగాడి బాబాయ్ లాంటి భాషోద్దారకుల్ని చూస్తుంటే అలా అనిపించదు. ఆయన తెలుగుభాషని 'రక్షించటం' కోసం వ్యాసాలు రాస్తాడు, ఉపన్యాసాలు చెపుతాడు. తన పిల్లలకి మాత్రం శ్రద్ధగా ఇంగ్లీషు చదువులు చెప్పించి అమెరికాలో స్థిరపడేట్లుగా గట్టి కృషి చేశాడు!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.
              
"ఆయన తన పిల్లలకి వారికిష్టమైన చదువు చెప్పించాడనుకోవచ్చుగదా!" అన్నాను.  
              
"అవునా! తన పిల్లలనే ప్రభావితం చెయ్యలేనివాడు సమాజాన్ని ఎలా ఉద్దరిస్తాడు? అసలు విషయమేమంటే.. తెలుగుభాషని నెత్తికెత్తుకోవడం ఆయనకి బాగా గిట్టుబాటయ్యింది." అన్నాడు సుబ్బు. 

"సుబ్బు! ఒక సమాజాభివృద్ధికి భాష ఎంతగా ఉపయోగపడుతుందో నీకు తెలీదు. నీదంతా వితండవాదం." చిరాగ్గా అన్నాను. 

"అయామ్ నాటే లింగ్విస్ట్, ఒప్పుకుంటున్నాను. కానీ సందులు, సమాసాల పండిత తెలుగు భాష సమాజంలో నిచ్చెన మెట్ల వ్యవస్థని కాపాడ్డానికి భలే బాగా ఉపయోగపడింది. అందుకే ఇవ్వాళ కొన్నివర్గాలు భాషగూర్చి అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక 'భాషంటే తల్లితో సమానం' అంటూ నీళ్లు నములుతున్నారు." అన్నాడు సుబ్బు.
              
"తెలుగుభాష గూర్చి ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను చంపేస్తాను." విసుక్కున్నాను.
              
"ఏమిటోయ్ - ఇందాకట్నించీ భాషా, గీషా అంటూ తెగ నీతులు చెపుతున్నావ్. అదేమన్నా చెరువా ఎండిపోవటానికి? ఏ భాషైనా దమ్ముంటేనే నిలబడుతుంది. తన భాషని ఉద్దరించమని బ్రిటీషోడు నిన్ను దేబిరించాడా? నీ పొట్టకూటికి ఆ భాష అవసరం కాబట్టి నేర్చుకున్నావ్. కేవలం భాష మీద ప్రేముంటే సరిపోతుందా? నీ పిల్లలిద్దరితో తెలుగు ఎమ్మే చేయించు, ఆకలిచావు చస్తారు." అంటూ కాఫీ తాగటం ముగించాడు సుబ్బు. 
              
"ఎనఫ్ సుబ్బు! డోంటాక్ రబ్బిష్!" అన్నాను.
              
"చివరగా ఒకమాట చెబుతా విను! వ్యవహారిక భాష అనేది సామాన్యుల నోళ్ళలో అద్భుతంగా గుబాళిస్తూనే ఉంటుంది. ఇప్పుడు పండిత భాషకే పొయ్యేకాలం వచ్చింది. పోతేపోనీ, దానివల్ల ఎవరికి నష్టం? ఒకవేళ నిజంగానే తెలుగుభాష అంతరించిపోయిందనే అనుకుందాం. అప్పుడు తెలుగుకి బదులుగా వేరొక కొత్తభాష వాడుకలోకి వస్తుంది గదా! మనకేంటి నష్టం? ఆ కొత్తభాషలోనే మనం మన ఉప్మాపెసరట్టుని పిలుచుకుందాం. భాష మారినా పదార్ధం మారదు గదా." అంటూ నిష్క్రమించాడు మా సుబ్బు.     
              
గాలివాన వెలసినట్లయింది. భాషని పెసరట్టు స్థాయికి దించేసిన సుబ్బు ధోరణికి బుర్ర తిరిగిపోయింది. తెలుగుభాష తననితాను సుబ్బువంటి అరాచక శక్తుల్నుండి రక్షించుకుంటుందని ఆశిస్తున్నాను!  

(fb post on 15 Dec 2017)