Saturday, 6 August 2011

దీపం పురుగుల అజ్ఞానం!


"డాక్టరుగారు! నా భార్య నోరు మంచిది కాదు, రోజూ ఏదో ఒక విషయంలో తగాదా. ఆమె తిట్టే తిట్లకి చచ్చిపోవాలనిపిస్తుంది." ఓ భార్యాబాధితుని ఆక్రందన. అతన్ని జాలిగా చూశాను. ఇవ్వాళ నాకిది మూడో ఆక్రందన. 

సైకియాట్రీ ప్రాక్టీసులో భార్యాబాధితుల కేసులు ఎక్కువే. సైకియాట్రిస్టుల స్థిరమైన సంపాదనకి కారణమైన భార్యల పట్ల మాకు ప్రత్యేకమైన అభిమానం వుంది. అంచేత - సైకియాట్రిస్టులంతా కలిసి 'భార్య'కి అంతర్జాతీయ స్థాయిలో సన్మానం చేయాలని కోరుకుంటున్నాను!
                
వర్షాకాలంలో తెగ హడావుడి చేసే దీపం పురుగులు గుర్తున్నాయా? ఈ దీపం పురుగులు దీపం చుట్టూ తిరిగితిరిగి, సీతమ్మవారు అగ్నిప్రవేశం చేసినట్లుగా ఒకటొకటిగా దీపం (మంట) లోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాయి. తనకన్నా ముందు తోటిపురుగొకటి మంటల్లో మలమల మాడి చావడం చూస్తూకూడా క్రమశిక్షణగా, ఓ కర్తవ్యనిర్వహణగా, బుధ్ధిగా అగ్నికి ఆహుతి అవుతుంటాయి. బుర్రలేని దీపప్పురుగుల కథకి నవ్వొస్తుంది కదూ. ఒక్కక్షణం ఆగండి. ఈ suicide squad పురుగులన్నీ మగజాతివని నా నమ్మకం.
                 
కాలేజీరోజుల్లో ఇంటెదురు మేడమీద అవధాని అనే ఒక బహుకుటుంబీకుడు అద్దెకుండేవాడు. ఆయన అత్యంత పీలగా అస్థిపంజరానికి తోలు కప్పినట్లుండేవాడు. నిరాశగా, నిర్లిప్తంగా, గాజుకళ్ళ శూన్యదృక్కులతో ప్రాణమున్న శవంలా వుండేవాడు.  

అవధాని భార్యామణి లావుగా, పొట్టిగా ఉంటుంది. ఆవిడ గొంతు మైక్ కనిపెట్టక ముందటి రోజుల్లోదని నా నమ్మకం. ఆవిడ స్టోన్ చౌకబారు రికార్డింగ్ డ్యాన్సు మైకుకన్నా బిగ్గరగా, బండగా, కఠినంగా వుంటుంది. ఆవిడకి వంటపని, ఇంటిపనితో పాటు మొగుణ్ణి తిట్టే పని కూడా చాలా ఎక్కువగా వుండేది. ఆవిడ చిన్నప్పుడే ప్రపంచంలో వున్న తిట్లన్నీ పచ్చడిగా రుబ్బేసి గారెల్లో  నంజుకుని తినేసిందేమోనని నా అనుమానం.  

మొదట్లో అవధాని చెవిటోడేమోననుకున్నా, కానీ కాదు! భార్య ఎంత తిట్టినా దించిన తల ఎత్తడు. చిన్నప్పుడే ఏదైనా యాక్సిడెంటయ్యి అవధాని చీమూ, నెత్తురూ కోల్పోయాడేమో! మగజాతికి తలవంపులు తెస్తున్న దిష్టిబొమ్మలాంటి అవధానిని అసహ్యించుకునేవాడిని. అవధాని భార్యని హత్య చేసి జైలుకెళదామని ఎన్నొసార్లు అనుకున్నాను, ధైర్యం లేక మానుకున్నాను. 
               
కాలం ఎంత తొందరగా కరిగిపోయింది! ఇప్పుడు నేను అవధాని వయసు వాడనయినాను. చిత్రం! నాకిప్పుడు అవధానిలో జీవితాన్ని కాచి వడబోసిన ఒక తత్వవేత్త కనిపిస్తున్నాడు. హిట్లర్ తెలివైనవాడు కాబట్టే పెళ్ళి చేసుకున్న మరుక్షణం ఆత్మహత్య చేసుకున్నాడు. అబ్దుల్ కలాం పెళ్ళి చేసుకున్నట్లయితే కలలు కనడం మాని.. వంటపని, ఇంటిపని చూసుకునేవాడని అనుకుంటుంటాను. 
               
ఆ మధ్య ఓ నిరాశావాది - భార్యతో సంతోషాన్ని పంచుకుందామనుకునేవాడిని ఎడారిలో ఎండమావుల కోసం వెదుక్కునే కలల బేహారితో పోల్చాడు. భార్యాపీడితుడై, ఆపై నిర్వికార జీవితాన్ని వెళ్ళబోస్తున్న ఓ జ్ఞాని ఈమధ్య ఇలా శెలవిచ్చాడు. "కుక్క 'భౌ.. భౌ' మనును.  పిల్లి 'మ్యావ్.. మ్యావ్' మనును. భార్య చీపురుకట్ట తిరగేయును. ఇది ప్రకృతి ధర్మం నాయనా!" ఇతగాడి జీవితం మరీ కుక్కలు చింపిన విస్తరి బాపతులా ఉంది!
              
మరి ఇంతమంది ఇన్నిరకాలుగా బాధలు పడుతూ కూడా పెళ్ళెందుకు చేసుకోవటం? ఎందుకంటే దీపం పురుగుల్లాగానే మగాళ్ళు కూడా అజ్ఞానులు కనుక! ఇప్పుడు నవ్వుకోండి.. దీపం పురుగుల అజ్ఞానానికి!

(picture courtesy : Google)