Tuesday 9 August 2011

ఒక దోమ కధ


శనివారం రాత్రి. సమయం పది గంటలు. పేషంట్లతో విసుగ్గా వుంది. తల దిమ్ముగా, ఆకలిగా, నీరసంగా ఉంది. ఇంతలో 'గూయ్'మంటూ ఎక్కణ్ణించో ఎగురుకుంటూ వచ్చిందొక దోమ. చూస్తుండగానే ఎడమచేతి మీద వాలి కసుక్కున కుట్టింది. చురుక్కున మండగా 'అబ్బ' అంటూ కుడిచేత్తో 'ఫట్' మని దోమని కొట్టాను.

నా హత్యాయత్నం నుండి బయటపడ్డ ఆ దోమ రూమంతా చక్కర్లు కొట్టి నా మొహం ముందుకొచ్చి, నిలబడినట్లు పోజ్ పెట్టి 'గూయ్'మంటూ చాలెంజ్ చేస్తున్నట్లుగా నా కళ్ళల్లోకి గుచ్చిగుచ్చి చూడసాగింది.

ఆఫ్టరాల్ ఒక దోమ నన్ను చాలెంజ్ చేస్తుందా! నాకు కోపం వచ్చింది. టేబుల్ మీదున్న మెడికల్ జర్నల్ తీసుకుని దాన్ని కొడదామని అనుకుంటుండగా.. ఆ దోమ నన్ను కోపంగా చూస్తూ "ఆగు. ఇప్పుడెందుకు నన్ను చంపాలనుకుంటున్నావ్?" అని ప్రశ్నించింది.

ఆశ్చర్యం - దోమ మాట్లాడుతుంది! 

"ఇందాక నిన్ను కుట్టాను. అప్పుడు నన్ను చంపాలనుకోటం నీ హక్కు. ఇప్పుడు నేను నిన్ను కుట్టలేదు. కుట్టకపోయినా నువ్వు నన్ను ఎందుకు హత్య చెయ్యాలనుకుంటున్నావ్? ఇది నా దోమహక్కులకి భంగం కలిగించటం కాదా?" ఆ దోమ రెట్టిస్తూ అడిగింది.

ఇదేదో మానవహక్కుల ఉద్యమకారుల రక్తం తాగి హక్కులు ఒట్టబట్టించుకున్న దోమవలేనున్నది.

"ఓ అలాగా! అయితే విను. ఈ ఆఫీస్ నాది. ఇందులో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే పూర్తి స్వేఛ్చ నాకుంది. నువ్వు నా పర్మిషన్ లేకుండా లోపలకొచ్చావు. పైగా నువ్వు దోమవు. మా మనుషులని కుట్టి బాధించటమే కాక మమ్మల్ని అనేక రోగాల బారి పడేస్తావు. నిన్ను చంపక ముద్దెట్టుకోమంటావా?" వెటకారంగా అన్నాను.

నా ప్రశ్నకి దోమ ఒకక్షణం ఆలోచించి.. దీర్ఘంగా నిట్టూర్చింది. ఆపై నిదానంగా చెప్పసాగింది.

"నిజమే! నేనో దోమని. మీ మునిసిపాలిటీ వాళ్ళు కల్తీ దోమలమందు కారణాన.. విజయవంతంగా మా అమ్మ గుడ్డులోంచి బైటకొచ్చాను. ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చానో నాక్కూడా మీ మనుషులకిమల్లే జీవించే హక్కు ఉంటుంది. నువ్వైతే పెసరట్లూ , బిరియానీలు తింటావ్. మా దోమలకి మనుషులని కుట్టి రక్తం పీల్చుకుని బ్రతకమని ఆ ఈశ్వరుడే నిర్ణయించాడు. శివుడాజ్ణ లేనిదే చీమైనా కుట్టదన్నారు. మా శరీర పోషణకి తప్పదన్నట్లు మీ నుండి రక్తాస్వాదన చేస్తున్నామేగానీ మా దోమజాతి మీ మానవుల్లా శాడిస్టులు కారు."

"ఆపు నీ మెట్టవేదాంతం. సరే ఇంతలా వేడుకుంటున్నావు కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తా. తలుపు తెరుస్తున్నాను. నా మనసు మారకముందే పారిపో." చికాగ్గా అన్నాను.

దోమకి రోషమొచ్చింది.

"నాకేమీ నీ దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. బయట ఉక్క పోస్తుంది. ఇక్కడ ఏసీ రూం చల్లగా ఉంది. అందుకే లోపలకొచ్చా. అయినా నువ్వు డాక్టరువి. మనలో మనం పరస్పరం సహకరించుకోవాలేగానీ కలహించుకోరాదు. మేం లేకపోతే మీ డాక్టర్లకి చాలా నష్టం. మేం కష్టపడి మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికన్‌గున్యా వ్యాధులు వ్యాప్తి చేస్తాం. మీ రంతా ఆ టెస్టూ, ఈ టెస్టూ అంటూ రోజుల తరబడి వైద్యం నానబెడుతూ బోలెడు డబ్బులు పోగేసుకుంటున్నారు. మీ ఆస్తుల్లో మాక్కూడా వాటా ఉంది. అన్నం పెట్టిన చేతిని నరుకుతాననటం నీ అల్పబుద్ధికి నిదర్శనం." అంటూ చిన్న లెక్చర్ ఇచ్చింది.

"ఓరేయ్ దోమగా! నా ఆస్తిలో వాటా అడుగుతున్నావ్. నీవంటి రక్తపిశాచితో ఇప్పటిదాకా మాట్లాడటమే దండగ. నీ దరిద్రపుగొట్టు లాజిక్కులతో నన్ను వొప్పించాలని చూడకు. అసలు నీ బ్రతుకే...." ఈసడించుకోబొయ్యాను.

"హ.. హ.. హా! మమ్మల్ని రక్తపిశాచిలంటున్నావ్! మేం పొట్ట నింపుకోటానికే రక్తం తాగుతాం. మరి మీరో? దురాశతో ఒకళ్ళనొకళ్ళు నరుక్కోటల్లేదా? మీ రాజ్యంతో పోలిస్తే మేమెంతటి సాధుస్వభావులమో అర్ధమౌతుంది." అని విసురుగా అంది.

సందేహం లేదు, ఇది కమ్యూనిస్టు దోమే. 

ఇంతలో నైట్ డ్యూటీ స్టాఫ్ లోపలకొచ్చాడు. నాకెదురుగా, మొహానికి దగ్గరగా ఎగురుతున్న దోమని చేతిలోనున్న కేస్ షీటుతో ఒక్కదెబ్బ వేశాడు. దోమకి మాడు పగిలింది. "చచ్చాన్రో దేవుడా!" అంటూ ఆర్తనాదం చేస్తూ బయటకి పారిపోయింది.

అర్ధగంట తరవాత - తలకి కట్టుతో దోమ కనబడింది.

"మిత్రమా! దెబ్బ బాగా తగిలినట్లుంది." జాలిగా పలకరించాను.

"నీకు నాతో శాంతి చర్చలు జరపటం ఇష్టం లేదు. తరతరాలుగా మా జాతిని నాశనం చెయ్యటానికి కుట్రలు పన్నుతున్న మీ మనుషులతో చర్చలు అర్ధరహితం. కాబట్టి ఇకనుండి దొరికినవాణ్ణి దొరికినట్లు రక్తం పీల్చి పడెయ్యటమే నా ప్రణాళిక." కోపంగా అంటూ నా మెడమీద వాలి, కసిగా కసుక్కున కుట్టి పారిపోయింది దోమ.

మెడమీద సర్రున మండింది.

'ష్.. అబ్బా! ఈ దోమ ముండకి బుర్ర పగిలినా తొండంలో పవర్ మాత్రం తగ్గలేదు.'  

(picture courtesy : Google)