Wednesday 24 August 2011

ప్రాణంబుల్ ఠావున్దప్పె

సోమవారం, సమయం మధ్యాహ్నం వొంటిగంట. ఆస్పత్రంతా హడావుడిగా వుంది. సాధ్యమైనంత త్వరగా కేసులు డిస్పోజ్ చేస్తున్నాను.

కన్సల్టేషన్ చాంబర్లో నా యెదురుగా ఓ మధ్యవయసు ఇల్లాలు. ముక్కు తుడుచుకుంటూ నిశ్శబ్దంగా రోదిస్తుంది.

"నేను బ్రతకను, చచ్చినా బ్రతకను. అసలు నేనెందుకు బ్రతకాలి? చావే నాకు గతి. మా అత్తో సూర్యాకాంతం, నన్ను రాచి రంపాన పెట్టడమే ఆ ముసల్దాని పని. నా మొగుడో చేతగాని సన్నాసి. నాకు వైద్యం వద్దు, చావడానికి విషం కావాలి."
                     
ఇంతలో - బయట వెయిటింగ్ హాల్లో 'దబ్బు'న  శబ్దం. పెద్దగా కేకలు, అరుపులు, ఆర్తనాదాలు.

అడ్డు పడుతున్న నర్సుని తోసేసుకుంటూ ఆరడగుల భారీమనిషి సుడిగాలిలా లోపలకి దూసుకొచ్చాడు. అతను కొన్నాళ్లుగా నా పేషంట్, పేరు రాంబాబు. లోపలకొచ్చి నా యెదురుగా నిలబడి, నావైపు తీక్షణంగా చూడసాగాడు. వెయ్యి వడగాల్పుల ఆ చూపు పదునైన కత్తిలా, మృత్యుకౌగిలిలా వుంది.  

క్షణకాలం నాకేమీ అర్ధం కాలేదు. అర్ధమయ్యాక భయమేసింది, కాళ్ళల్లో వణుకు మొదలైంది. ఇప్పుడెలా? కనీసం పారిపోయే అవకాశం లేదు. రాంబాబు బలిష్టుడు, బరువు వందకిలోల పైమాటే. నాలాంటి అర్భకుణ్ణి వొకే వొక్క గుద్దుతో చంపగల ధీశాలి. నా మనసంతా బరువుగా అయిపొయింది. రౌడీగాడు చివరాకరికి తోటి రౌడీచేతిలో చచ్చినట్లు - నా చావు నా పేషంట్ చేతిలోనే రాసిపెట్టి వుందన్నమాట! 

మిత్రులారా! సెలవు, సెలవు, సెలవు. భగవాన్! నా తప్పులు మన్నించు. ఓసారి శంకర విలాస్‌లో టిఫిన్ చేసి బిల్లెగ్గొట్టాను, మెడికల్ కాలేజ్ లైబ్రరీలో పెథాలజీ బుక్కొకటి జాతీయం చేశాను. ఇవన్నీ ఇప్పుడెందుకు చెబుతున్నానంటే - చేసిన పాపం చెబితే పోతుందంటారు, అందుకే పొయ్యేముందు నా జీవితంలోని చీకటి కోణాలు చెబుతున్నా. దేవుడా! నీవెంత నిర్దయుడవి! సినిమా టికెట్ చింపినంత ఈజీగా నేటితో నా టికెట్ చింపేస్తున్నావా?

సరే! నా చావెలాగూ ఖాయమైపోయింది, అదేదో నొప్పి లేకుండా వస్తే బాగుండు (ఇలా కోరుకోవడం మినహా ఇప్పుడు నాదగ్గర ఆప్షన్ లేదు). అంచేత - చావుకి సిద్ధమై కసాయివాని ముందు నిలబడ్డ గొర్రెలా టెన్షన్‌గా రాంబాబుని చూస్తూ అలా వుండిపొయ్యాను.

ఇంతలో -

రాంబాబు రెండుచేతులూ జోడించి వినయంగా నమస్కరించాడు! 

"గుడ్మార్నింగ్ డాక్టర్!" 

ఇది కలా, నిజమా? మండుతున్న అగ్నిగుండంలోంచి చల్లని స్విమ్మింగ్ పూల్‌లోకి దూకినంత హాయిగా అనిపించింది. ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్నవాడికి కేసు కొట్టేసినంత రిలీఫ్‌గానూ అనిపించింది. 
                 
"మీరు నాయందు దేవుడు డాక్టర్. ఇన్నాళ్ళూ నా మెదడులో మైక్రోచిప్ పెట్టి నా ఆలోచనలల్ని పాకిస్తాన్ వాళ్ళకి ప్రసారం చేస్తున్న దుర్మార్గుడు దొరికేశాడు. వాడెవడో కాదు, నా అన్నే. డబ్బు మనిషిని యెంత హీనానికైనా దిగజార్చేస్తుంది." అన్నాడు రాంబాబు.    
                   
ముక్కు తుడుచుకుంటూ ఇల్లాలు కుర్చీలోంచి లేవబోయింది.

"లేవకు, కూర్చో అక్కా! ఈ డాక్టర్ దేవుడు. నువ్విక్కడే వైద్యం చేయించుకో. ఎంతోమంది డాక్టర్ల దగ్గిర మందులు వాడాను, మైండంతా గజిబిజిగా ఉండేది. ఈ డాక్టర్ చేతిచలవతో నా మైండ్ క్లీన్‌గా అయిపోయింది." అన్నాడు రాంబాబు.
                 
సో, రాంబాబుకి నామీద దాడిచేసే ఉద్దేశ్యం లేదు. ధైర్యం పుంజుకున్నాను.  

"రాంబాబు, నీతో మాట్లాడాలి" వణుకుతున్న గొంతుతో అన్నాను. 
                 
రాంబాబు నాకు మళ్ళీ నమస్కారం చేశాడు.

"నాకు జబ్బు పూర్తిగా నయమైపోయింది డాక్టర్. నాకిక మీ మందులు అవసరం లేదు. మా అన్నని బాగా కొట్టాను. ఒక దేశద్రోహిని శిక్షించకుండా వదిలితే అది దేశద్రోహమంత నేరం." అంటూ ఒక్కఉదుటున బయటకెళ్ళిపోయాడు.    
                 
ఆలోచనా రహితంగా అలా కూర్చుండిపొయ్యాను. 

నర్సు చెప్పింది - "రాంబాబు అన్న పారిపొయ్యాడు, అతన్ని వెతుక్కుంటూ రాంబాబూ వెళ్లిపొయ్యాడు."
                 
హమ్మయ్య! చల్లబడ్డ కాళ్ళూ, చేతుల్లోకి నిదానంగా రక్తప్రసరణ మొదలయ్యింది. ఏసీలో పట్టిన చెమట చల్లగా అనిపిస్తుంది. వేగంగా కొట్టుకున్న గుండె నిమ్మళిస్తుంది. భయంతో తడారిన గొంతుని చల్లని నీళ్లతో తడుపుకున్నాను. 

గుండెల్లోకి తుపాకీగుండు దూసుకెళ్లినా, కంఠాన్ని కత్తితో కసుక్కున కోసినా యెవీఁ అవకపోతే యెలా వుంటుందో ఇప్పుడు నాకలా వుంది! 
               
"నేను బ్రతికి ప్రయోజనవేఁంటి? చిటికెడు విషం ఇప్పించండి, పీడా వదిలిపోతుంది." ముక్కు తుడుచుకుంటూ మళ్ళీ మొదలెట్టింది ఇల్లాలు.

అబ్బబ్బ! అసలు చావు తప్పింది గానీ ఈ ఇల్లాలితో చచ్చే చావు ఛస్తున్నాను!!

(సంఘటన - వాస్తవం, 'రాంబాబు' పేరు - కల్పితం.)

(posted in fb on 17/07/2017)