Tuesday, 2 August 2011

మిర్చిబజ్జీలు.. ఒక దారుణ హత్యాకాండ!

బంగాళాఖాతంలో వాయుగుండమట. రెండ్రోజులుగా ఒకటే వర్షం. ఎడతెరిపి లేకుండా సినిమా వానలా ఝాడించి కొడుతుంది. వాతావరణం చలిచలిగా, మబ్బుమబ్బుగా, స్తబ్దుగా ఉంది. 

ఇట్లాంటి వాతావరణంలోనే పద్మరాజు 'గాలివాన' రాసి ఉంటాడు. నాకు మాత్రం - వేడివేడిగా మిర్చిబజ్జీలు తినాలనిపించింది. ఈ చల్లని సమయంలో 'మిరపకాయ బజ్జీలు తిననివాడు దున్నపోతైపుట్టున్!' అనే నాకు తెలిసిన న్యూనుడి నా భార్యకి కూడా నచ్చుటచే వంటిల్లు బజ్జీలతో సిద్ధమైంది.

అసలు 'బజ్జీ' అన్న పేరే సెక్సీగా వినిపిస్తుంది కదూ! మన 'భోజనం'లోని మొదటి రెండక్షరాల్లోంచి పుట్టుకొచ్చిన పదంలా ఉంటుంది. అందువల్ల బజ్జీ లేని విందుభోజనం కర్ణుడు లేని భారతంలాంటిదని అనుకోవచ్చు. 

ఘాటైన మిర్చిబజ్జీలు, కమ్మటి వంకాయ బజ్జీలు, రుచికరమైన బంగాళదుంప బజ్జీలు, మెత్తటి అరటికాయ బజ్జీలు, కరకరలాడే ఉల్లిపాయ బజ్జీలు.. ఇలా బజ్జీల్లో రకాలు రాసుకుంటూ పోవచ్చు.

చదువుకొనే రోజుల్లో దాదాపు ప్రతి సాయంకాలం మిరపకాయ బజ్జీలు తినడం, గోళీసోడా తాగుతూ కబుర్లు చెప్పుకోవడం.. నాకు నిన్నమొన్నలా అనిపిస్తుంది. మా 'బజ్జీ సాయంకాలపు' కబుర్ల వివరాలు నా మిత్రులు ఈ రోజుకీ చెబుతుంటారు. 

అప్పటిదాకా సౌమ్యంగా ఉండే 'రాముడు మంచి బాలుడు' కూడా మిరపకాయ బజ్జీ నోట్లో కెళ్ళంగాన్లే వీరావేశంతో ఊగిపోయేవాడు.. గుంటూరు మిర్చి ఘాటు ప్రభావమేమో! కాంగ్రెస్ అనుకూల, ప్రతికూల గ్రూపులు.. అమెరికా అనుకూల, ప్రతికూల గ్రూపులు.. గవాస్కర్, విశ్వనాథ్ క్యాంపులు.. కాదేది వాదనకనర్హం? అదో పెద్ద ఓపెన్ ఫోరం. వాదనలు క్రమేపి అరుపులుగానూ, వ్యక్తిగత దూషణలుగానూ రూపాంతరం చెందేవి.    

నా పిల్లలిద్దరికీ బజ్జీ విశిష్టతనీ, ప్రాచుర్యాన్నీ.. మరీ ముఖ్యంగా బజ్జీలకి నాయకుడైన మిర్చిబజ్జిగాడి రుచిని వివరించి.. నా ఆహారపు నియమాల్ని కాసేపు వదిలేసి.. ఓ రెండు మిర్చిబజ్జీలు ఆరగించితిని. 

కంట్లోంచీ, ముక్కుల్లోంచి నీళ్ళు కారుతుండగా, నోరు కారంతో మండుతుంది. 'ఉఫ్ ఉఫ్' అంటూ కారంతో మండుతున్న నోటిని ఊదుకుంటూ, చల్లని నీళ్ళతో కడుపులో సంభవించిన అగ్నిప్రమాదాన్ని నివారుస్తూ,  భోరున కురుస్తున్న వర్షాన్నితిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నా.   

అప్పుడు నా కంటపడిందో దారుణ దృశ్యం. పిల్లలిద్దరూ మిరపకాయ బజ్జీలని మిరపకాయలుగానూ, బజ్జీలుగానూ విడగొట్టుకుని (బజ్జీలకి తోళ్ళూడగొట్టి), మిరపకాయలని వేరే ప్లేట్లో పడేసి, బజ్జీ పిండిభాగాన్ని టొమేటో సాస్‌తో నంజుకుంటూ - 

"నాన్నోయ్! నువ్వు చెప్పినట్లే వర్షం కురుస్తున్నప్పుడు బజ్జీలు తింటుంటే భలే రుచిగున్నయ్!" అన్నారు. 

నా మనసు చివుక్కుమంది. గుండె బరువెక్కింది. మిరపకాయ లేని ఆ శనగపిండి తోళ్ళని బజ్జీలంటారేమిటి!  పైగా వాటి పక్కన రక్త పిశాచిలా భీతి గొలుపుతూ బోడి టొమేటో సాసొకటి! 

ప్లేట్లో - తోళ్ళు కోల్పోయిన మిరపకాయలు, రైలు యాక్సిడెంటయ్యాక వరుసగా పడుకోబెట్టిన నగ్నశవాల వలే అత్యంత విషాదంగా, దయనీయంగా పడున్నాయ్. 

ఏమిటీ దుస్థితి? బజ్జీలని ఇలా హత్య చేసే హక్కు ఈ పిల్లకాకులకి ఎవరిచ్చారు? తెలుగుభాష  కోసం ఉద్యమాలు చేస్తున్నారు. తెలుగువంటకాలని కూడా రక్షించే ఉద్యమం చేపట్టాలేమో! బజ్జీలు తిన్డం కూడా చేతకాని ఈ కొత్తతరం అజ్ఞానులని శిక్షించడానికి కొత్తరకం చట్టాలు అవసరమేమో!