Wednesday, 25 April 2012

చిత్తూరు నాగయ్య.. ద సైకోథెరపిస్ట్!


"ఒకే విషయం ఎన్నిసార్లని చెప్పాలి? చెప్పేప్పుడు బుద్ధిగా తలూపుతారు, పని మాత్రం చెయ్యరు! అసలు మీ సమస్యేంటి? వినపడదా? అర్ధం కాదా?" విసుగ్గా అన్నాను.

నా హాస్పిటల్లో స్టాఫ్ అవడానికి సీనియర్లే. కానీ వాళ్లకి ప్రతిరోజూ, ప్రతివిషయం కొత్తే! ఇవ్వాళ మరీ చిరాగ్గా ఉంది - 'వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్!' - పదోసారి అనుకున్నాను.

ఇంతలో - 

గదిలో ఏదో అలికిడి, తలెత్తి చూశాను. ఎదురుగా ఒక ఆజాను బాహుడు! ధవళ వస్త్రాల్లో ప్రశాంత వదనంతో, దరహాసంతో నన్నే చూస్తున్నాడు. ఈయన్ని ఎక్కడో చూసినట్లుందే? ఎవరబ్బా! ఈయన.. ఈయన.. చిత్తూరు నాగయ్య! 

ఆయన - 'నాయనా! నువ్విక మారవా?' అని నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించింది.

'అబ్బా! ఈ నాగయ్యగారితో చచ్చేచావుగా ఉంది, ప్రశాంతంగా కోపాన్ని కూడా తెచ్చుకోనివ్వడు గదా! వేలకి వేలు జీతాలిస్తున్నాను, ఏం? నా స్టాఫ్‌ని మందలించే హక్కు నాకు లేదా? సినిమా చూస్తున్నప్పుడు లక్షాతొంభై అనుకుంటాం. అంతమాత్రానికే అప్పులాడిలా యెప్పుడు పడితే అప్పుడు ఇలా వచ్చెయ్యడమేనా?'

అంతలోనే నా చికాకు, కోపం, అసహనం అన్నీ ఒక్కసారిగా ఆవిరైపొయ్యాయి. సిగ్గుతో తల దించుకున్నాను!

నేనెందుకు ఇంత చెత్తగా ఆలోచిస్తున్నాను! దిసీజ్ నాట్ కరెక్ట్. చిత్తూరు నాగయ్యని నా థెరపిస్ట్‌గా ఎప్పాయింట్ చేసుకున్నది నేనే. ఈ therapeutic alliance తో నాగయ్యకి ప్రమేయం లేదు. అన్నట్లు అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను - నాకూ, చిత్తూరు నాగయ్యకి పేషంట్ డాక్టర్ రిలేషన్‌షిప్ గత కొన్నాళ్ళుగా నడుస్తుంది. 

చిత్తూరు నాగయ్య గొప్ప నటుడు, గాయకుడు అని నా అభిప్రాయం. అయన మరీ అంత గొప్పేం కాదు అని ఎవరైనా అంటే నాకస్సలు అభ్యంతరం లేదు. నా అభిప్రాయాలేవో నాకున్నాయి, అవి ఇతరుల్తో match అవ్వాలని నేనెప్పుడూ అనుకోను. అయితే నాగయ్య పట్ల నా అభిమానం స్వార్ధపూరితమైనది. వాడ్డూయూ మీన్ బై - 'స్వార్ధాభిమానం'?! 

వృత్తిరీత్యా కోపాన్ని తగ్గించుకోడానికి కౌన్సిలింగ్ ఇచ్చే నాకు, నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు! మీరు నా కన్ఫెషన్‌ని మోడెస్టీగా భావించనక్కర్లేదు, శిక్ష పడదంటే హంతకుడు కూడా నేరాన్ని ఒప్పుకుంటాడు!

అది అర్ధరాత్రి, అందరూ హాయిగా నిద్రపొయ్యే సమయం. నాకు నిద్ర పట్టని రోగం వుంది. దూరదర్శన్‌లో నాగయ్య నటించిన 'యోగి వేమన' వేస్తున్నారు. 'సుఖమయ నిద్ర కోసం ఈ పురాతన సినిమాకి మించిన మంచి సాధనమేముంది?' అనుకుని ఆ సినిమా చూడ్డం మొదలెట్టాను. క్రమేపి సినిమాలో లీనమైపోయ్యాను.

వేమారెడ్డికి అన్నకూతురంటే ఎంతో ప్రేమ. ఆ పాప జబ్బుచేసి చనిపోతుంది. నిర్వేదంగా స్మశానంలో తిరుగుతున్నాడు. ఒక మనిషి పుర్రెని చేతిలోకి తీసుకుని 'ఇదేనా! ఇంతేనా!' అంటూ పాడుతున్నాడు. వెచ్చగా నా బుగ్గల మీద స్పర్శ! అవి నా కన్నీళ్లు! అర్ధరాత్రి కాబట్టి నా కన్నీళ్ళని ఎవరూ గమనించే ప్రమాదం లేదు కాబట్టి నేనా కన్నీళ్ళని ఆపుకోవటానికి ప్రయత్నించలేదు. ఈ అనుభూతి నాకు కొత్త! సినిమా చివరిదాకా గుడ్లప్పగించి అలా చూస్తూ కూర్చుండిపొయ్యాను. 

ఆశ్చర్యం! ఆ మరుసటి రోజు నాకు కోపం రావాల్సిన సందర్భంలో కూడా కోపం రాలేదు. ఆ తరవాత చిత్తూరు నాగయ్య నటించిన సినిమాల్ని వరసగా చూశాను. నా కోపం క్రమేపి ఇంకాఇంకా తగ్గిపోసాగింది. 

నాగయ్యది ప్రశాంత వదనం. మృదువుగా, మార్ధవంగా మాట్లాడతాడు. నాగయ్యని నిశితంగా గమనిస్తాను, పాటల్ని ఏకాగ్రతతో వింటాను. ఇలా ఎందుకు చేస్తానంటే - నాకు కోపం వచ్చినప్పుడు నాగయ్యని గుర్తు చేసుకోవడం ఈజీగా ఉంటుందని!

ప్రోటీన్ ఫుడ్ శరీరానికి మంచిది, morning walk కూడా మంచిది. నాగయ్య చిత్రాలు కూడా ఇదే  కోవలోకి వస్తాయా?! ఫైటింగ్ సినిమాలు ఇష్టపడేవాళ్ళో నేరప్రవృత్తి ఉంటుందా? సెక్స్ సినిమాలవాడి ఆలోచనలు బూతుమయంగా వుంటాయా? నాగయ్య సినిమాలు చూసినవాడు ప్రశాంత చిత్తంతో సాత్వికుడుగా మారిపోతాడా? ఆలోచించాలి. 

'పాండురంగ మహత్యం'లో నాగయ్య ఎన్టీఆర్‌కి తండ్రి. భోగలాలసుడైన కొడుకు తలిదండ్రులపై దొంగతనం మోపి రాత్రికిరాత్రే ఇంట్లోంచి వెళ్ళ గొడతాడు. అప్పుడు నాగయ్యని చూస్తే నాకు దుఃఖం ఆగలేదు. కొడుకు పట్ల ప్రేమ, అవమాన భారం, నిర్వేదం, నిర్లిప్తత.. ఇన్నిభావాల్ని అలవోకగా ప్రదర్శిస్తాడు.

ఈ పాత్రని పృధ్వీరాజ్ కపూర్ వంటి నటుడు ఇంకా బాగా నటించవచ్చునేమో కానీ, నాగయ్యంత convincing గా వుండదు. ఎందుకు? నాగయ్యది నిజజీవితంలో కూడా అదే మనస్తత్వం, అందుకని! మానవ జీవితంలో అత్యంత విలువైనది డబ్బు. ఎవరెన్ని కబుర్లు చెప్పినా డబ్బు విలువని గుర్తించకుండా జీవించగలగడం అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమైంది. ఆ కొద్దిమందిలో నాగయ్య కూడా ఒకరని చరిత్ర చెబుతుంది. 

నాగయ్య సినిమాలు కోపానికి antidote గా పనిచేస్తాయి, అంచేత నా కోపాన్ని suppress చేసుకోడానికి నాగయ్య సినిమాల్ని వాడుకుంటున్నాను. కావున - సైకోథెరపీ ప్రిన్సిపుల్స్ ప్రకారం చిత్తూరు నాగయ్య బికమ్స్ ద థెరపిస్ట్.  

(photo courtesy : Google)