Saturday 28 April 2012

hmtv వందేళ్ళకథకు వందనాలు.. గొప్ప కామెడీ షో!

గొల్లపూడి అభిమానుల కోసం..  
hmtv వందేళ్ళకథకు వందనాలు.. గొప్ప కామెడీ షో!
"మిత్రమా! ఇవ్వాళ రాత్రి hmtv చూడు. రావిశాస్త్రి గూర్చి ఏదో ప్రోగ్రామ్ వస్తుందిట." నా స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు.
నాకు తెలుగు న్యూస్ చానెల్స్ చూసే అలవాటు లేదు, రావిశాస్త్రి కార్యక్రమం కాబట్టి చూద్దామని నిర్ణయించుకున్నాను.
ప్రోగ్రామ్ పేరు 'వందేళ్ళకథకు వందనాలు', సాహిత్య సంచికా కార్యక్రమం. సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు. ప్రోగ్రామ్ మొదలైంది, గొల్లపూడి ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు.
ఇంతకీ ఈ ప్రోగ్రామ్ యెవరి కోసం? 1.ఆయాకథలు ఆల్రెడీ చదివేసి.. చదివిన కథల్ని టీవీలో చూసుకుని కొత్త అనుభూతి పొందేవారి కోసమా? 2.సమీప భవిష్యత్తులో ఆయారచయితల కథలు చదువుదాం అనుకునేవారి కోసమా? 3.క్రైం వార్తలు, సీరియళ్ళు చూస్తూ పొరబాటున చానెల్లోకి వచ్చేవారి కోసమా?
తెలుగు సాహిత్యంలో గొల్లపూడి మారుతీరావు స్థాయి నాకు తెలీదు. నాకు తెలీకపోవడం నా తప్పవుతుందిగానీ గొల్లపూడిది కాదు. వందేళ్ళ తెలుగు కథేమోగాని.. సెట్ మాత్రం వందేళ్ళ క్రితం వేసినట్లు ఉంది. ఒక టీపాయ్, రెండు కుర్చీలు - అంతే!
ఈ వందేళ్ళకథకి ఒక పాలసీ వున్నట్లుంది. ఈ ఇరుకు సెట్లో రచయితకి ఒకకుర్చీ. సదరు రచయిత మరణించిఉంటే ఆకుర్చీలో రచయిత భార్య, భార్య కూడా పొతే కొడుకు.. మనవడు.. మునిమనవడు. వీళ్ళెవ్వరూ దొరక్కపోతే రచయితగారి పక్కింటాయన! ఈ లెక్కననుసరించి రావిశాస్త్రి లేడు కావున ఆయన కొడుకు గొల్లపూడి ఎదురుగా కూర్చున్నాడు.
పాపం! ఆ అబ్బాయి గొల్లపూడి వాగ్ధాటికి బెదిరిపోయ్యాడు. గొల్లపూడి తన ట్రేడ్మార్క్ హావభావాల్తో రావిశాస్త్రిని పొగిడేస్తున్నాడు. అప్పుడప్పుడు రావిశాస్త్రి కొడుకుని మాట్లాడనిస్తున్నాడు. మధ్యమధ్యలో ప్రశ్నలు - 'నాన్నగారు రాత్రిళ్లు రాస్తారా? పగలా? టేబుల్ మీద రాస్తారా? మంచంమీద రాస్తారా?' ఇవీ ఆ ప్రశ్నలు!
కొంతసేపటికి ఆ అబ్బాయి రావిశాస్త్రి కథనొకదాన్ని కూడబలుక్కుంటూ చదవసాగాడు. గొల్లపూడి ఆ కుర్రాణ్ణి తన తండ్రికథని పట్టుమని పదిలైన్లు కూడా చదవనీలేదు. ఆ కుర్రాడి చేతిలోంచి లాక్కుని తనే చదవడం మొదలెట్టాడు.
రావిశాస్త్రి కొడుకు అక్కడ మిస్‌ఫిట్. ఆస్తులకి వారసత్వం ఉంటుంది. ఈమధ్య సినిమాల్లో, రాజకీయాల్లో వారసత్వం మొదలైంది. ఈ సూత్రం తెలుగు సాహిత్యానిక్కూడా అప్లై అవుతుందా?!
శ్రీశ్రీ, రావిశాస్త్రి, కుటుంబరావులు తెలుగువారి ఆస్థి. పుస్తకాలపై వచ్చే రాయల్టీతో వారసులకి సంబంధం వుంటుంది. అంతేకాని ఫలానా రచయిత మనవళ్లనీ, మునిమనవళ్లనీ వెతికి పట్టుకొచ్చి ఆ రచయితల వ్యక్తిగత అలవాట్లని చర్చించడం సాహిత్య కార్యక్రమం ఎలా అవుతుంది?!
మెడికల్ సైన్సులో బ్రాంచిలున్నట్లు సాహిత్యంలోనూ చాలా స్పష్టమైన విభజన రేఖలున్నయ్. తెలుగు కథలన్నింటికీ టీవీ యాంకర్లా ఒకళ్లే వుండటం సరికాదు. కథా పరిచయం, విశ్లేషణ ఒక సీరియస్ సాహిత్య ప్రక్రియ. సందర్భాన్ననుసరించి రకరకాల వ్యక్తుల అభిప్రాయాలు, రిఫరెన్సులు అవసరమవుతాయి. ఇక్కడ గొల్లపూడి వాగ్ధాటి తప్ప ఇంకేదీ లేదు!
చిరాగ్గా నాస్నేహితుడికి ఫోన్ చేసాను. "ఏమి నాయనా! నీకు నామీద ఇంత కోపముందని తెలీదు. ఒక దిక్కుమాలిన ప్రోగ్రాం చూడమంటావా?" అన్నాను.
ఆతను పెద్దగా నవ్వాడు. "ఆ ప్రోగ్రామ్ అసలుపేరు 'గొల్లపూడి టాక్ షో'. అది అర్నబ్ గోస్వామిలా తన నాలెడ్జిని, వాక్చాతుర్యాన్ని ప్రదర్శించే వేదిక. గొల్లపూడి వాక్ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతిధుల తిప్పలు చూస్తుంటే భలే కామెడీగా వుంటుంది, కాదేది కామెడీకనర్హము!"
"ఆ కామెడీ ఏదో నువ్వే ఎంజాయ్ చెయ్యొచ్చుగా! నా సమయాన్ని వృధా చెయ్యడం దేనికి?"
"హి.. హి.. హి.. నీతో తిట్టించుకోవటం కూడా కామెడీగా ఉంది." అంటూ ఫోన్ పెట్టేశాడు నా స్నేహితుడు.

(posted in fb on 23/1/2018) and on 13/12/19