Wednesday 4 April 2012

నా పులి సవారి

ఇవ్వాళ  సోమవారం, హాస్పిటల్ వాతావరణం పేషంట్లతో హడావుడిగా ఉంది. తప్పనిసరిగా ఓ ముఖ్యమైన పెళ్ళికెళ్ళి హాజరుపట్టీలో సంతకం చెయ్యాలి, అదే - అక్షింతలు వెయ్యాలి. మధ్యాహ్నం రెండైంది, అయినా పెళ్ళికి వెళ్ళే వ్యవధి దొరకడం లేదు. వెళ్ళాలి, వెళ్ళక తప్పదు, వెళ్ళి తీరాల్సిందే. కానీ - ఎలా? ఎలా? ఎలా?

నాకీ పెళ్లిళ్ళు, అక్షింతల, భోజనాలు అంటే చిరాగ్గా, విసుగ్గా వుంటుంది.ఈ కార్యక్రమాలకి వెళ్ళడం దాదాపుగా మానేశాను. వాళ్ళు పిల్చిన పెళ్ళి ఎటెండ్ అవ్వకపోతే, కొందరు నన్ను దుష్టుల కేటగిరీలోకి నెట్టడం ఆశ్చర్యపరిచింది. పెళ్ళికి వెళ్ళాలా లేదా అనేది పూర్తిగా మన హక్కు. అయితే పెళ్ళివిషయాల్లో హక్కుల ప్రస్తావన పనికిరాదని ఆలస్యంగా గ్రహించిన కారణాన - కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళకి హాజరవడం అలవాటు చేసుకున్నాను. 

ఆ తరవాత ఒకట్రెండు పెళ్ళిళ్ళకి వెళ్ళిన తరవాత విషయం అర్ధమైంది. వెనుకటి రోజుల్లోలా భోజనం చెయ్యమని మనకి ఎవరూ మర్యాదలు చెయ్యరు. అసలక్కడ మన్నెవరూ పట్టించుకోరు. కానీ వెళ్ళకపోతే మాత్రం బాగా పట్టించుకుంటారు! ఎందుకంటే - ఆ పెళ్ళి చాలా ఖర్చుతో అట్టహాసంగా చేస్తారు. అది మనం మెచ్చుకోవాలి, అందుకని! అంచేత - వరద బాధితుల్ని మంత్రిగారు పలకరించినట్లు, ఈ పెళ్ళిళ్ళకి ఫ్లాష్ విజిట్స్ వేస్తే చాలు, సరిపోతుంది. పిల్చినవాడు కొడా ఖుషీ అయిపోతాడు.  

మా ఊళ్ళోఎ వుంటానికి రోడ్లున్నయ్. కానీ ఆ రోడ్డు కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళూ, రిక్షాల్తో భారంగా వుంటుంది. వీటికితోడుగా రోడ్డు మాధ్యలో ఆవులు, వాకర్లు, టాకర్లు వుండనే వున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఊరేగింపులూ వుండొచ్చు. కాబట్టి అంత ట్రాఫిక్‌ని తట్టుకుని పెళ్ళీ అటెండ్ అవడం ఎలా అని కొద్దిసేపు ఆలోచించాను. 

ఐడియా! యే ఊళ్ళోనైనా ట్రాఫిక్‌ని ఛేధించగల సత్తా ఎవరికుంది? ద ఆన్సర్ ఈజ్ సింపుల్ - ఆటోకి! ఆటోని పిలిపించి ఆస్పత్రి బయట వెయిటింగులో వుంచాను. 'సమయం గూర్చి ఎందుకు చింత? ఆటో ఉండగా నీ చెంత!' అనుకుంటూ వడివడిగా బయటకి నడచి ఆటోలో కూలబడ్డాను.  
                  
నేనింకా పూర్తిగా కూర్చోలేదు, ఆటో ముందుకి దూకింది. ఆ ఊపుకి సీటు వెనకనున్న కుషంకి గుద్దుకున్నాను. వెన్నులో ఎక్కడో కలుక్కుమంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కుషన్‌కి బదులుగా ఓ చెక్కుంది! నడుం సవరించుకుంటూ సీటులో సర్దుక్కూర్చునే లోపునే ఒక బడ్డీ కొట్టు ముందు సడన్ బ్రేక్ వేసి ఆపాడు, ఒక్కసారికి ముందుకొచ్చి పడ్డాను, ఇప్పుడు డ్రైవర్ వెనకుండే కడ్డీ మోకాళ్ళకి పొడుచుకుంది. 

బాధతో మోకాలు రుద్దుకుంటూ - 'ఎదురుగా వాహనాలేం లేవుగా? మరి ఇంత భీభత్స బ్రేకెందుకబ్బా!' అని ఆశ్చర్యపోతుండగా -

ఆటోవాలా బడ్డేకొట్టు ముందువెళ్ళాడుతున్న దండల్లోంచి ఒక కైనీ పాకెట్ తుంచుకుని, దాన్ని వొడుపుగా అడ్డంగా చించి తలెత్తి మొత్తంగా నోట్లో ఒంపేసుకున్నాడు. 'పావుగంటలో వచ్చేస్తా, జిలానీ వస్తే వుండమని చెప్పు.' అంటూనే ఒక్క ఉదుటున ఆటోని ముందుకు దూకించాడు. 

నాకున్న చిన్నిఆనందాల్లో ఆటో ప్రయాణం ఒకటి. అడవిలో దర్జాగా, పులిమీద సవారి ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు? అర్ధం కాలేదా! ఏమాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టమొచ్చినట్లుగా, అడ్డదిడ్డంగా స్వైరవిహారం చేసే ఆటోలంటే నాకు సంభ్రమం. అందుకే ఆటోలు పులుల్తో సమానం అని నా అభిప్రాయం.

లక్షల ఖరీదు చేసే కార్లు ఆటోలకి గజగజ వణుకుతూ దారినిస్తాయి. ద్విచక్రీయులు కూడా ఆటోలకి దూరంగా బిక్కుబిక్కుమంటూ డ్రైవ్ చేసుకుంటుంటారు. కాళ్ళూచేతులు విరగ్గొట్టుకునే ధైర్యం ఎవరికుంటుంది చెప్పండి? రోడ్డు మొత్తం ఆటోలకి అణుగుణంగా, వినయంగా, క్రమశిక్షణగా ఎడ్జెస్ట్ అయిపోతుంది. రోడ్డే అడవి అనుకుంటే పులి మన ఆటో, భయపడి ఒదిగిపోయే అర్భకప్రాణులు మిగతా వాహనదారులు. 
                
ఆటో ప్రయాణం భలే థ్రిల్లుగా ఉంటుంది. ఎదురుగా వస్తున్న వాహనం వందడుగుల దూరంలో కనబడుతున్నా, సరీగ్గా 99.9 అడుగుల దాకా స్పీడుగా వెళ్లి - 'గుద్దేశాడ్రా బాబోయ్!' అని కళ్ళు మూసుకుని 'కెవ్వు' మనేలోపు, కీచుమంటూ భయంకరమైన బ్రేకేసి, మన్ని ఎగ్గిరి పడేసి లాఘవంగా వాహనాన్ని తప్పించుకుని, శరవేగంగా పరుగులు తీస్తుంటుంది. ఈ సీక్వెన్స్ బంగీ జంపంత థ్రిల్లుగా ఉంటుంది. మీది వీక హార్టా? బి కేర్ఫుల్! ఇది చాలా డేంజర్ గురూ!

ఆటోవాలాతో పాటుగా మనం కూడా ట్రాఫిక్‌ని జాగ్రత్తగా గమనిస్తుంటేనే మన ఆరోగ్యానికి భద్రత!

'ట్రాఫిక్‌ని ఫాలో అవ్వాల్సింది డ్రైవర్ కదా! మనం దేనికి?' అనుకుంటున్నారా?

'ఏంటి మాస్టారు! ప్రతొక్కటి ఎక్కడ విడమర్చి చెబుతాం? దేనికంటే - ఆ మెలికల డ్రైవింగ్‌కీ, సడన్ బ్రేకులకీ సీట్లోంచి క్రిందకి పడిపోవడమో.. నిన్న తాగిన కాఫీ వాంతి చేసుకోవడమో జరగొచ్చు. పులి మీద సవారీనా మజాకా!'
               
ఈ క్షణంలో వందోవంతు బ్రేక్ కొట్టే కళ యొక్క గుట్టు ఆటో డ్రైవరైన నా పేషంట్ వెంకట్రావు విప్పాడు. 

"ఓనర్లు నడిపే కార్లు మేవఁసలు లెక్కచెయ్యం. బోల్డు డబ్బు పోసి కొనుక్కుని బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా నడుపుతుంటారు. అందుకే మాకందరూ సైడిస్తారు." అన్నాడు వెంకట్రావు.అంటే- ఇక్కడ సైకాలజీ గుద్దడానికైనా సరే ఎవడు తెగిస్తాడో వాడిదే అంతిమ విజయం. 

"నిజమేననుకో! ఒకవేళ పొరబాటున బ్రేక్ పడకపోతే గుద్దేస్తారు గదా!" ఆసక్తిగా అడిగాను.

"ఆఁ! గుద్దితే ఏవఁవుద్ది? ఆ కారు షెడ్డుకి పోద్ది, పదేలు బొక్క, మన ఆటోకి రెండు సుత్తి దెబ్బలు.. కొంచెం పసుపు రంగు, యాభయ్యో వందో ఖర్చు." తాపీగా అన్నాడు వెంకట్రావు, ఆరి దుర్మార్గుడా!
               
రహస్యం బోధపడింది, సింపుల్ మ్యాథమెటిక్స్! వందకన్నా పదివేలు ఎన్నోరెట్లు ఎక్కువ. ముల్లు, అరిటాకు సామెత! ప్రపంచమంతా డబ్బున్నోడిదే ఇష్టారాజ్యం. అయితే - ఇక్కడ డబ్బున్నోడి మీద పేదవాడిదే విజయం. మార్క్స్ ఆర్ధికశాస్త్రం తిరగబడింది! ఆరోజు నుండీ నాకు మాఊళ్ళో ఆటోవాలాలో చె గువేరా కనబడసాగాడు.
               
ప్రస్తుతం నా ఆటో ప్రయాణానికొస్తే - ఎసీ కాలేజ్ రోడ్డులో ట్రాఫిక్ కొంచెం తక్కువగా వుంది. నా ఆటోవాలా హ్యాండిల్ వదిలేసి, చేతులు పైకెత్తి బద్దకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. భయంతో నా గుండె ఒక బీట్ మిస్సయింది. ఐనా ఆటో స్టడీగానే పోతుంది? ఈ ఆటోకి 'ఆటో పైలట్' మోడ్ ఉందా! 

ఓవర్ బ్రిడ్జి (ఈమధ్య కొందరు దీన్నే 'ఫ్లై ఓవర్' అంటున్నారు, మాకైతే బ్రిడ్జి అని పిల్చుకోడమే ఇష్టం) మీద ట్రాఫిక్ జామ్. మాములే! మన పులి వంకరటింకర్లు తిరుగుతూ ట్రాఫిక్ లోంచి బయటపడింది.

శంకరవిలాస్ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు. మళ్ళీ మన ఆటో 'ఆటో పైలట్' మోడ్‌లోకి వెళ్ళింది. మళ్ళీ నా గుండె బీట్‌లో తేడా! పిసిసర్కార్ మేజిక్ లాగా ఆటోవాలా చేతిలో ఒక మాసిన ఖాకీ చొక్కా ప్రత్యక్షం, క్షణంలో తొడిగేసుకున్నాడు. 

ఇదేంటి నా కుడికాలు నొప్పిగా ఉంది! ఎందుకబ్బా? అర్ధమైంది. టెన్షన్లో ఎక్కిందగ్గర్నుండీ కుడికాలుతో బ్రేకులేస్తున్నాను. అదీ సంగతి! అందుకే సుబ్బు ఆటోలని 'టార్చర్ చాంబర్లు' అంటాడు. ఆటో నడిపే వ్యక్తికి 'ఆటోక్రాట్' అని ముద్దుపేరు కూడా పెట్టాడు. 

సరీగ్గా పదినిమిషాల్లో ఆటో కళ్యాణ మండపం చేరుకుంది. మంటపం బయట రోడ్డు పక్కన కార్ పార్కింగ్ చేసుకోడానికి సరైన స్థలం కోసం వెతుక్కుంటున్నారు.. పాపం! ఖరీదైన కార్ల బాబులు (మా ఊళ్ళో ఫంక్షను హాళ్ళకి ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేసులుండవు, రోడ్డు మార్జిన్లే పార్కింగ్ ప్లేసులు)! ఆ అమాయక అజ్ఞానులని జాలిగా చూస్తూ - "ఐదే ఐదు నిముషాల్లో వచ్చేస్తా, ఆ పక్కన వెయిట్ చెయ్యి." అని ఆటోవాలాకి చెప్పి వడవడిగా లోపలకెళ్ళాను. 

కళ్యాణ మంటపం బాగా పెద్దది. పెళ్ళికొడుకు అమెరికా సాఫ్ట్‌వేర్ కుర్రాట్ట. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్లున్నాడు, సగం బుర్ర బట్టతల. ఆడవాళ్ళు కష్టపడి ఖరీదయిన చీరలు, నగల్ని మోస్తున్నారు. మగవాళ్ళు పట్టు పంచెలు, షేర్వాణీలలో ఆడవాళ్ళతో పోటీ పడుతున్నారు. అంతా డబ్బు కళ! (విచిత్రం - పేదరికాన్ని గ్లోరిఫై చేస్తూ రాసే కవితలు బాగుంటాయి, డబ్బిచ్చే సుఖమూ బాగుంటుంది.)

అప్పటిదాకా ఏదో సినిమా పాటని ఖూనీ చేస్తున్న బ్యాండ్ మేళం వాళ్ళు, హఠాత్తుగా గుండెలు పగిలే ప్రళయ గర్జన చెయ్యడం మొదలెట్టారు. పెళ్లికొడుకు ముసిముసిగా నవ్వుకుంటూ మంగళ సూత్రం కట్టాడు. రాబోయే ప్రళయానికి సూచనగా, హెచ్చరికగా బ్యాండ్ మేళం వాళ్ళు భీకర పిశాచాల మ్యూజిక్ వాయించినా, తనెంత డేంజరపాయంలో ఇరుక్కుంటున్నాడో ఈ పెళ్లికొడుకు వెధవకి అర్ధమైనట్లు లేదు - మరీ అమాయకుళ్ళా వున్నాడు! 

స్టేజ్ ఎక్కి అక్షింతలు వేసి, పెళ్ళికూతురు తండ్రికి మీ అల్లుడు చాలా హ్యాండ్‌సమ్ అని ఒక అబద్దం, పెళ్ళికూతురు అన్నకి పెళ్లిభోజనాలు రుచిగా వున్నాయని ఇంకో అబద్ధం చెప్పి బయట వెయిట్ చేస్తున్న ఆటోలోకి వచ్చిపడ్డాను. 

ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు టి ట్వెంటీ మ్యాచిల్లాంటివి. స్టేజ్ ఎక్కి అక్షింతలు వేస్తూ యేదొక కెమెరాలో ఎటెండెన్స్ వేయించుకుంటే చాలు, మన హాజరు పట్టీ సంతకానికి సాక్ష్యం కూడా గట్టిగా ఉంటుంది! 
                
నా తిరుగు ప్రయాణం - షరా మామూలే. ఆటోలో నేను - నా పులి సవారి షురూ! డిస్కవరీ చానల్లో చూపిస్తున్నట్లుగా - పులిని చూసి కకావికములైపోయే జీబ్రాలు, జిరాఫీలు (అనగా  కార్లూ, స్కూటర్లు). 

మెలికల డ్రైవింగ్‌కీ, సడన్ బ్రేకులకి ఎగిరిపోకుండా ముందున్న కడ్డీని అతి ఘట్టిగా పట్టుకుని - 'ఒరే! రండ్రా చూసుకుందాం. అమ్మతోడు, అడ్డదిడ్డంగా గుద్దేస్తా!' అంటూ నిశ్శబ్దంగా పెడబొబ్బ పెడుతూ..  పొగరుగా, గర్వంగా వికటాట్టహాసం (ఇదికూడా నిశ్శబ్దంగానే) చేశాను (బయటకి సాధుజంతువులా మెతగ్గా కనబడే నాలో ఇంత ఘోరమైన విలన్ దాగున్నాడని ఇన్నాళ్ళు నాకూ తెలీదు)!

ఆహాహా! సుఖమన్న ఇదియే గదా! 'ఎంత హాయి ఈ ఆటో పయనం! ఎంత మధురమీ ఎగుడు దిగుడు యానం!' అంటూ కూనిరాగం తియ్యసాగాను.  

'తీసుకెళ్ళే దూరానికి మాత్రమే డబ్బులు చార్జ్ చేస్తూ, ప్రపంచాన్నే జయించిన రాజాధిరాజు ఫీలింగ్ కలిగిస్తున్న ఆటోలకి జై!' అని మనసులో అనుకున్నాను (బయటకి చెబితే నా ఫీలింగుకి ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తాడేమోననే భయం చేత)!  

(విజయవాడ ఆలిండియా రేడియోవారు 'హాస్యప్రసంగం' శీర్షికన చదివారు, తేదీ గుర్తు లేదు)