Wednesday 11 April 2012

నాన్న పొదుపు - నా చిన్నికష్టాలు


"ఈణ్నాకొడుకయ్యా! అన్నం సరీంగా తిండు, తిన్నదొంటబట్టట్లేదు. ఒక బలంసీసా రాయి సార్!" అడిగాడు కోటయ్య. 

కోటయ్యది దుర్గి మండలలో ఓ గ్రామం. పొడుగ్గా, బక్కగా, కాయబారిన దేహం. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చిరుగు చొక్కాతో పేదరికానికి బట్టలు తోడిగినట్లుంటాడు. కొన్నాళ్ళుగా నా పేషంట్. ఎప్పుడూ భార్యని తోడుగా తెచ్చుకునేవాడు, ఈసారి తన పదేళ్ళ కొడుకుతో వచ్చాడు.

ఆ 'సరీంగా అన్నం తినని' కోటయ్య కొడుకు వైపు దృష్టి సారించాను. బక్కగా, పొట్టిగా అడుగుబద్దలా ఉన్నాడు. డిప్పకటింగ్, చీమిడిముక్కు, మిడిగుడ్లు. తన లూజు నిక్కర్ జారిపోకుండా ఎడంచేత్తో పట్టుకుని, కుడిచేత్తో తండ్రి చెయ్యిని గట్టిగా పట్టుకుని, ఇంజక్షన్ ఎక్కడ పొడిచేస్తానో అన్నట్లు నావైపు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. మాసిన తెల్లచొక్కా మోకాళ్ళ దాకా లూజుగా వేళ్ళాడుతుంది. చొక్కా గుండీలకి బదులు రెండు పిన్నీసులు. ఈ ఆకారాన్ని ఎక్కడో చూశాను, ఎక్కడ చూశాను? ఎక్కడ? ఎక్కడబ్బా? ఎక్కడో ఏంటీ! అది నేనే!!
                                                    
గుంటూరు శారదా నికేతనంలో నేను ఒకటి నుండి ఐదోక్లాసు దాకా చదువుకున్నాను. ఎడ్మిషన్ ఫీజు అక్షరాల ఒక రూపాయి, అటుతరవాత ఒక్కపైసా కట్టే పన్లేదు. విశాలమైన ఆవరణలో చుట్టూతా క్లాసురూములు, మధ్యలో ఆటస్థలం. వాతావరణం సరదా సరదాగా వుండేది. బడికి ఒక మూలగా రేకుల షెడ్డు, అందులో ఒక పిండిమర. బడి ప్రాంగణంలో ఈ పిండిమర ఎందుకుందో నాకు తెలీదు, కానీ నాకా పిండిమర ఓ ఇంజినీరింగ్ మార్వల్‌లా అనిపించేది.

సర్రుమంటూ శబ్దం చేస్తూ తిరిగే పెద్ద నవ్వారు బెల్టుల్ని ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని చూస్తుండిపొయ్యేవాణ్ణి. రకరకాల ధాన్యాల్ని గిన్నెలు, డబ్బాల్లో వరస క్రమంలో పెడతారు. 'పిండిమరబ్బాయి' వాటిని అదే వరస క్రమంలో, చిన్న స్టూలు మీద నిలబడి, పిండిమర మిషన్‌పైన కప్పలా నోరు తెరుచుకునున్న వెడల్పాటి రేకు డబ్బాలోకి పోసేవాడు. వెంటనే గింజలు 'పటపట'మంటూ శబ్దం చేస్తూ పిండిగా మారి కిందనున్న రేకుడబ్బాలోకి పడేవి. ఆ 'పిండిమరబ్బాయి' నా హీరో. నా హీరో శరీరమంతా పిండి దుమ్ముతో తెల్లగా మారిపోయి గ్రహాంతరవాసిగా అగుపించేవాడు.

శారదా నికేతనం హెడ్మాస్టారుగారు గాంధేయవాది. ఆయన బాగా పొడుగ్గా, బాగా బక్కగా, బాగా బట్టతలతో, ఖద్దరు బట్టల్తో, మందపాటి గుండ్రటి కళ్ళజోడుతో అచ్చు గాంధీగారి తమ్ముళ్ళా ఉండేవారు. ఆయన గదిలో గోడపైన గాంధి, నెహ్రు, బోస్, పటేల్ మొదలైన దేశనాయకుల చిత్రపటాలు ఉండేవి. ఆ రూంలో ఓ మూలగా మంచినీళ్ళ కుండ ఉంటుంది. క్లాసు మధ్యలో దాహం వేస్తే ఆ కుండలోని చల్లని నీళ్ళు తాగేవాళ్ళం. హెడ్మాస్టరుగారి టేబుల్ మీద పెన్సిల్ ముక్కు చెక్కుకునే మిషన్ (షార్పెనెర్) ఉంటుంది. ఆయన గదికి వెళ్ళినప్పుడల్లా ఆయన 'మనది పవిత్ర భారత దేశం, చదువుకుని దేశానికి సేవ చెయ్యటం మన కర్తవ్యం. చక్కగా చదువుకోండి. మిమ్మల్ని చూసి తలిదండ్రులు గర్వించాలి' అంటూ చాలా చెప్పేవాళ్ళు.

బడి గోడల్నిండా 'సత్యము పలుకుము, పెద్దలని గౌరవించవలెను.' లాంటి సూక్తులు రాసుండేవి. అబద్దం చెబితే సరస్వతి దేవికి కోపమొచ్చి చదువు రాకుండా చేస్తుందని గట్టిగా నమ్మేవాణ్ని, భయపడేవాణ్ణి. ఓంకార క్షేత్రంలో ప్రసాదం సమయానికి ఠంచనుగా  హజరయ్యేవాణ్ని. ఒక్క ఎగురు ఎగిరి గంటకొట్టి, రెండు చేతులూ జోడించి, కళ్ళు గట్టిగా మూసుకుని బాగా చదువొచ్చేట్లు చెయ్యమని దేవుణ్ణి తీవ్రంగా వేడుకునేవాణ్ణి. పుణ్యానికి పుణ్యం, చేతినిండా ప్రసాదం!

మా స్కూలుకి యూనిఫాం లేదు. నాకు రోజువారీ తోడుక్కోడానికి శుభ్రమైన బట్టలు రెండుజతలు ఉండేవి. సాయంత్రం స్నానం తరవాత  పోట్టైపోయి పోయినేడాది బట్టలే గతి. అవి - బిగుతుగా, (ఇప్పటి మన సినిమా హీరోయిన్ల బట్టల్లా) ఇబ్బందిగా  ఉండేవి. అమ్మకి చెబితే - 'మగాడివి, నీకు సిగ్గేంట్రా!' అనేది. ఆ విధంగా మగాళ్ళకి  సిగ్గుండక్కర్లేదని చాలా చిన్నతనంలోనే గ్రహించాను! బట్టలు సరిపోటల్లేదని ఎంత మొర పెట్టుకున్నా అందరిదీ ఒకటే సమాధానం - ' అసలీ వయసులో నీకెందుకన్ని బట్టలు? ఎట్లాగూ  పోట్టైపోతాయ్ గదా!'

నాకు దెబ్బలు తగిలించుకోటంలో గిన్నిస్ రికార్డుంది. కోతికొమ్మచ్చి ఆడుతూనో, గోడ దూకుతూనో.. ఏదో రకంగా శరీరంలోని అనేక భాగాల్లో అనేక దెబ్బలు తగుల్తుండేవి. వాటిల్లో కొన్ని మానుతున్న గాయాలైతే, మరికొన్ని ఫ్రెష్ గాయాలు. ఒక రోజు సైకిల్  నేర్చుకుంటూ  కింద  పడ్డాను. మోకాలు భయంకరంగా దోక్కుపోయింది, బాగా రక్తం కారుతుంది. వీధి చివర మునిసిపాలిటీ పంపు నీళ్ళధార కింద దెబ్బని కడుక్కున్నాను. రక్తంతో కలిసిన నీళ్ళు ఎర్రగా కిందకి జారిపొయ్యాయి. అబ్బ! భరించలేని మంట. కుంటుకుంటూ, ఏడ్చుకుంటూ ఇంటికి  చేరాను.

నాన్న ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే అన్నం తిని, మంచం మీద పడుకుని ఆంధ్రప్రభ చదువుకుంటున్నాడు. నా అవతారం చూడంగాన్లే వీరావేశంతో నన్ను ఉతికి ఆరేశాడు. ఆయనకంత కోపం రావడానికి కారణం నాకు దెబ్బ తగలడం కాదు, అసలాయన నా దెబ్బనే పట్టించుకోలేదు - దెబ్బవల్ల నిక్కర్ అంచు కొంచెం చిరిగింది, అదీ సంగతి!

ఈవిధంగా శరీరంతో పాటు బట్టలకి కూడా అవుతున్న రకరకాల గాయాలకి కట్లు కట్టించుకుంటూ (దీన్నే టైలర్ల భాషలో 'రఫ్' తియ్యడం అంటారు), బొత్తాలు ఊడిపోయిన చొక్కాకి పిన్నీసులు పెట్టుకుంటూ, నిక్కర్ (మేం 'లాగు' అనేవాళ్ళం) జారిపోకుండా మొలతాడుని నడుం చుట్టూ బిగిస్తూ కొత్తబట్టల కోసం భారంగా ఎదురు చూపులు చూస్తుండేవాణ్ణి.   

ఈ కొత్తబట్టలకి ఒక లెక్కుంది. ఎండాకాలం సెలవల తరవాత స్కూళ్ళు తెరిచేప్పుడు రెండుజతల బట్టలు, అటుతరవాత ముఖ్యమైన పండగలకి ఒకజత. ఓవర్ బ్రిడ్జ్ పక్కన మూడోలైన్లో కొత్తమాసువారి బట్టల దుకాణం ఉంది. ఆ దుకాణదారుడు నాన్నకి స్నేహితుడు. అంచేత  ఎప్పుడైనా కొత్తమాసువారి  కొట్లో మాత్రమే గుడ్డ కొనాలి. కొద్దిగా బాగున్న గుడ్డ కొందామనుకుంటే ఆ షాప్ ఓనరుదీ ఇంట్లోవాళ్ళ పాటే! 'అంత ఖరీదైన గుడ్డెందుకు బాబు? ఎదిగే వయసు, ఊరికే పొట్టైపోతాయి. ఈ పన్నా చించుతున్నా, రేటు తక్కువ, గట్టిదనం ఎక్కువ.' అంటూ చేతికందిన గుడ్డని కత్తెరతో పరపర కత్తిరించేసేవాడు. ఆయన నాన్నకి స్నేహితుడవడం చేత నన్ను డామినేట్ చేసేవాడు, ఎంతన్యాయం!

నాకా కొత్తబట్టల ప్యాకెట్ ఎంతో అపురూపంగా అనిపించేది. దాన్ని రెండు చేతుల్త్లో ఆప్యాయంగా దగ్గరకి  తీసుకుని, కొత్తబట్టల సువాసనని ముక్కారా ('మనసారా'కి అనుకరణ) ఎంజాయ్ చేస్తూ, నాన్నతోపాటు టైలర్ దగ్గరికి వెళ్ళేవాణ్ణి.

ఓవర్ బ్రిడ్జ్ పక్కన రెండో లైన్ మొదట్లో బాజీ అని మా ఆస్థాన టైలర్ ఉండేవాడు. తెల్లజుట్టు, మాసిన గడ్డం, శూన్యదృక్కులు. అతని మొహం నిర్లిప్తత, నిరాశలకి శాశ్విత చిరునామాలా ఉంటుంది. అతనికీ ప్రపంచంతో, ప్రాపంచిక విషయాల్తో ఆట్టే సంబంధం ఉన్నట్లుగా తోచదు. అతను చిన్నగా, తక్కువగా మాట్లాడతాడు. అతనికి పదిమంది పిల్లల్ట, చాలా కష్టాల్లో కూడా ఉన్నాట్ట. అతని బావ హైదరాబాదులో టైలరుగా బాగా సంపాదిస్తున్నాట్ట, కానీ తన కుటుంబాన్ని అసలు పట్టించుకోట్ట. ఈ విషయాలన్నీ నాన్న అమ్మకి చెబుతుండగా విన్నాను. 

బాజీలాగే బాజీ కుట్టు మిషన్ అత్యంత పురాతనమైనది, ఇంకా చెప్పాలంటే శిధిలమైనది. బ్రిటీషు వాడు దేశానికి స్వతంత్రం ఇచ్చేసి, ఈ కుట్టు మిషన్ కూడా వదిలేసి వెళ్లిపొయ్యాడని నా అనుమానం. బాజీ దించిన తల ఎత్తకుండా పొద్దస్తమానం బట్టలు కుడుతూనే ఉండేవాడు. నాకతను కుట్టు మిషన్తో పోటీ పడుతున్న మనిషి మిషన్లా కనపడేవాడు.. యాంత్రికతలో అతను యంత్రాన్ని జయించినవాడు.

మనుషుల్లో రెండురకాలు - ధనవంతులు, పేదవారు. వస్తువులు కూడా రెండురకాలు కొత్తవి, పాతవి. బాజీ కొలతలు తీసుకునే టేపు పాతది మాత్రమే కాదు, అంటువ్యాధిలా దానికి బాజీ పేదరికం కూడా పట్టుకుంది. అందువల్లా అది చీకిపోయి, పెట్లిపోయి ఉంటుంది. దానిపై అంకెలు అరిగిపోయి కనబట్టం మానేసి చాల్రోజులైంది. కనబడని ఆ టేపుతో కొలతలు తీసుకుంటూ, సరీగ్గా అంగుళం మాత్రమే ఉండే పెన్సిల్‌తో బట్టలు కొన్న బిల్లువెనక ఏవో అంకెలు కెలికేవాడు. 

బాజీ మెజర్‌మెంట్స్ లూజుగా తీసుకునేవాడు. అంచేత లూజు కొంచెం తాగించి ఆదులు తీసుకొమ్మని బాజీకి చెప్పమని నాన్నని బ్రతిమాలేవాడిని. నాన్న పట్టించుకునేవాడు కాదు. బాజీ గూర్చి రాయడం దండగ. అతను వినడు, మాట్లాడడు, రోబోలాగా నిర్వికారంగా కొలతలు తీసుకునేవాడు. ఆవిధంగా నాన్న నాకు అరణ్యరోదన అంటే ఏంటో చిన్నప్పుడే తెలియజెప్పాడు. గుడ్డ అంగుళం కూడా వేస్ట్ కాకూడదు, అదే అక్కడ క్రైటీరియా! ఈ మాత్రం దానికి కొలతలు ఎందుకో అర్ధం కాదు!
                     
నిక్కర్ భయంకరమైన లూజ్ - పొలీసోళ్ళ నిక్కర్లకి మల్లే (ఆరోజుల్లో పోలీసులు నిక్కర్లు వేసుకునేవాళ్ళు) మోకాళ్ళని కవర్ చేస్తుంది. నిక్కర్ కింద అంచు లోపలకి రెండుమూడు మడతలు మడిచి కుట్టబడేది (పొరబాటున ఆ సంవత్సరం నేను హఠాత్తుగా పదడుగులు పొడవు పెరిగినా ఆ మడతలు ఊడదీస్తే సరిపోతుందని నాన్న దూరాలోచన). చొక్కా వదులుగా, అందులో ఇంకా ఇంకోనలుగురు దూరగలిగేంత విశాలంగా ఉండేది. 

చొక్కా ఎంత పొడవున్నా, నిక్కర్ దానికన్నా పొడవుండడం వల్ల పరువు దక్కేది. లేకపోతే చొక్కాకింద ఏమీ వేసుకోలేదనుకునే ప్రమాదం ఉంది! ఇన్నిమాటలేల? నా బట్టలు నాన్నక్కూడా సరిపోతాయి! ఆ బట్టలు నా శరీరాన్ని ఎంత దాచేవో తెలీదు కానీ, వాటిని మొయ్యలేక దుంప తెగేది. ఏ మాటకామాటే - కొంత సుఖం కూడా దక్కేది, గాలి ధారాళంగా ఆడేది. ఆ పెద్దజేబుల్లో బోల్డన్ని మరమరాలు కుక్కొచ్చు, పెన్సిల్ ముక్కలు దాచుకోవచ్చు.
                                 
కొత్తబట్టలేసుకున్నానన్న ఆనందం ఒకపక్కా, అవి మరీ లూజుగా ఉన్నాయన్న దిగులు మరోపక్కా సమానంగా ఉండేవి. మరీ ఇంత వదులైతే ఎలా? పక్కింటివాళ్ళు ఆరేసుకున్న బట్టల్ని కాజేసి వాడుకుంటున్నాననుకోరూ! ఈ అవతారంతో బడికెళ్తే నా పరువేం కావాలి?  పైగా అక్కడ అమ్మాయిలు కూడా ఉంటారాయె. అందులోనూ మొన్న సుమతీ శతకం పద్యాలు గుక్కతిప్పుకోకుండా అప్పజెప్పినప్పుడు పక్కబెంచిలోంచి కె.లలిత నన్ను ఎంత ఎడ్మైరింగ్‌గా చూసింది!

బెరుకుగా బడికెళ్లాను, బిడియంగా నా 'బి' సెక్షన్లోకి అడుగెట్టాను. అక్కడ క్లాసులో ముప్పాతికమంది కొత్తబట్టలతో దర్శనం. ఆశ్చర్యం! వాళ్ళవి నాకన్నా వదులు దుస్తులు. వాళ్ళతో పోలిస్తే నా బట్టలు చాలా నయం. ఆలోచించగా - తండ్రులందరిదీ ఒకే జాతిలాగా తోస్తుంది. ఈ తండ్రుల పొదుపు వల్ల పిల్లల బట్టలకి రక్షణ లేకుండా పోయింది. పిల్లలు అమాయకులనీ, వారి హృదయాల్లో దేవుడుంటాడనీ.. కబుర్లు మాత్రం చెబుతారు, ఆచరణలో మాత్రం అందుకు వ్యతిరేకం, ఏమిటో ఈ మాయదారి ప్రపంచం!

వేసవి సెలవల తరవాత ఆ రోజే క్లాసులు మొదలు, అంచేత - క్లాసంతా గోలగోలగా ఉంది. సూరిని చూస్తే నవ్వొస్తుంది, తిరపతి పోయ్యాట్ట, వాడి బోడిగుండు నున్నగా ఇత్తడి చెంబులా మెరిసిపోతుంది. సీతారావుడు సూరి గుండుని రుద్దుతూ ఏడిపిస్తున్నాడు. శీనుగాడి కుడిచేతికి పిండికట్టు, పక్కింట్లో దొంగతనంగా మామిడి కాయలు కోస్తూ చెట్టుమీంచి పడ్డాట్ట. ఆ మూల వీరయ్య, సుబ్బిగాళ్ళ మధ్యన కూర్చునే ప్లేసుల దగ్గర తగాదా. అరె! నా ప్లేసులో వాడెవడో కొత్తోడు కూర్చున్నాడే! 'వురేయ్ ఎవడ్రా అది? ఆ ప్లేసు నాది, మర్యాదగా లేస్తావా లేదా?' ఆ క్షణంలోనే నా లూజు బట్టల వేదాంతం, సిద్ధాంతం, రాద్ధాంతం.. అన్నీ మర్చిపోయి నా హక్కుల సాధనలో మునిగిపొయ్యాను!
                              
అంకితం -

నా చిన్ననాటి జ్ఞాపకాలు, ముచ్చట్లు నెమరు వేయించిన వదులు దుస్తుల వీరుడు కోటయ్య కుమారుడికి.

కృతజ్ఞతలు -

కోటయ్య కొడుకు బొమ్మని అందంగా గీసిన అన్వర్ గారికి, అందుకు కారకులైన భాస్కర్ రామరాజు గారికి.