Wednesday, 18 April 2012

కోడి విలాపం


అయ్యలారా! అమ్మలారా! దయగల తల్లులారా! ఇది నా కథ, మనోవ్యధ, ఆత్మఘోష. నేనెవర్ని? తెలీదు! నేను కోడినా? కోడిలాంటిదాన్నే - కానీ కాదు. ప్రాణిలాంటిదాన్నే - కానీ కాదు. ఇదేదో పొడుపుకధలా ఉంది కదూ? కానీ కాదు! ఇదొక దిక్కులేని, దిక్కుమాలిన కోడికాని కోడికథ.
                              
అనగనగా ఒక కోడి. ఆ కోడికి ఎన్నోరంగులు. మగకోడిని 'పుంజు' అనీ, ఆడకోడిని 'పెట్ట' అనీ పిలిచేవారట. గ్రామాల్లో కోడి 'కొక్కొరొక్కో' అని కూస్తేగానీ తెల్లారేదికాదట! కోడిపెట్ట గుడ్లు పెడుతుందట, గుడ్లు పొదుగుతుందట! తన బుజ్జి పిల్లల్ని వెంటేసుకుని దర్జాగా తిరుగుతూ పురుగుల్నీ, గింజల్నీ ఏరుకుని తింటూ, తన పిల్లలికి తినిపిస్తూ ఊరంతా తిరుగాడుతుందట!

రోజురోజుకీ జనాభా పెరిగిపోతుంది, కోళ్ళూ అంతరించిపోతున్నారు. మానవుడు తెలివైనవాడు. ఎప్పటికప్పుడు తన అవసరాలకి తగినట్లు కొత్త వస్తువులు సృష్టించుకుంటాడు, కొత్త ఆహారాన్నీ తయారు చేస్తుంటాడు. మనుషుల తిండి కోసం (వ్యాపార కోసం) నేను కనిపెట్టపడ్డాను. నన్ను 'బ్రాయిలర్ చికెన్' అంటారు. మేం చూడ్డానికి దొరల్లా తెల్లగా, అందంగా ఉంటాం.
                     
పేరుకు కోడినే, కానీ నేనొక కృత్రిమ కోడిని. నన్ను నాతల్లి తన గుడ్డు పొదగి జన్మనివ్వ లేదు. తలిదండ్రులు లేకుండా పుట్టాను కాబట్టి నేను పుట్టుకతోనే అనాధను. పుట్టి బుద్ధెరిగి ఏనాడూ నాలుగడుగులు నడిచిన పాపాన పోలేదు. పుట్టంగాన్లే నన్ను ఇరుకైన గది(కేజ్)లో బంధిస్తారు, కాబట్టి నేను పుట్టుకతోనే బందీని కూడా!

నా జైలు జీవితం బహుదుర్భరం. నా గది అత్యంత చిన్నది. ఆ గదిలోనే ఇంకో నలుగురైదుగురితో సహజీవనం. వెలుతురుండదు, గాలి ఉండదు, దుర్గంధపూరితం. జీవితంలో కనీసం ఒక్కసారయినా మనసారా రెక్కలు విప్పి టపటపలాడించాలని నా కోరిక. కానీ నా గదిలో నాకు నించునే జాగా కూడా ఉండదు, ఇంక రెక్కలు ఎలా విప్పేది? ఎలా ఆడించేది?

నా కేజ్ నుండి మెడ మాత్రమే బయటకి పెట్టి నిర్ణీత ఆహారం తీసుకోవాలి. నాకు అత్యంత శ్రద్ధగా ఒక పద్ధతి ప్రకారం వేక్సిన్లు పొడుస్తారు, రోగాలు రాకుండా యాంటీ బయోటిక్స్ ఇస్తారు. నేను తినేతిండీ, మందులూ సమతూకంలో ఉండాల్ట. అప్పుడే నేను మంచి కండబట్టి, ఖర్చుకు తగ్గ బరువుతో నన్ను పెంచినవాడికి లాభాలు తెస్తాంట.

నా శరీరంలో ఏ భాగం ఎంత పెరగాలో కూడా మందులే నిర్ణయిస్తాయి. ఒక్కోసారి నా బ్రెస్ట్ కండ నా శరీరానికి మించి పెరుగుతుంది. అప్పుడు నేను సరీగ్గా నించోలేను, కాళ్ళు కూడా విరిగిపోతుంటాయి, గుండె ఆగిపోతుంటుంది. అయినా - మీక్కావలిసింది నా రెక్కల జాయింట్లు బలవడమే కానీ నా కష్టం కాదుగా?

మేం కేజిల్లో కోళ్ళం, మేం ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని గాయాల పాలవకుండా మా ముక్కులు కత్తిరించేస్తారు. కత్తిరించబడ్డ ముక్కునొప్పితో ఇవ్వాళ నా పక్కనున్న కోడిపిల్ల ఒకటి - 'మనదీ ఒక బ్రతుకేనా? కుక్కల వలె, నక్కల వలె! మనదీ ఒక బ్రతుకేనా? సందులలో పందుల వలె!' అంటూ ఒకటే ఏడుస్తుంది! ఓసి దీని అమాయకత్వం దొంగల్దోలా! ఆ జంతువులు మాకన్నా చాలా నయం!

నాకీ ప్రపంచమంతా కేవలం నాలుగు కోళ్ళ మయం! నా కేజ్‌లో ఉండే నాలుగు కోళ్ళే నా ప్రపంచం. హీనమైన జీవనాన్ని 'కుక్కబ్రతుకు' అని అంటారు కానీ - 'బ్రాయిలర్ కోడి బ్రతుకు' అని ఎవరూ అనరు. ఎందుకంటే - మాదసలు బ్రతుకే కాదు కాబట్టి!

నా ఆయుష్షు నలభై రోజులే. నలభై రోజల తర్వాత - నేను తినేతిండికి సరిపడేంత బరువు పెరగను, అందువల్ల నాకు తిండి దండగ. 'దిగుబడి' రాకపొతే పెంచేవాడికి నష్టం వస్తుంది కాబట్టి నాకు నలభై రోజులకే నూరేళ్ళు నిండుతాయి. ఆ రోజు నా పీక పరపరా కోసి చంపేస్తారు.

'నిప్పులు చిమ్ముకుంటూ.. నింగికి నే నెగిరిపోతే.. నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు క్రక్కుకుంటూ.. నేలకి నే రాలిపోతే.. నిర్ధాక్షిణ్యంగా వీరె' అని మహాకవి రాశాడు. ఆయన ఎవరి కోసం రాసాడో తెలీదు కానీ - నాకు మాత్రం నా గూర్చే రాసినట్లనిపిస్తుంది.

కనీసం చంపబోయే ముందు కూడా మేం ప్రాణులమని గుర్తించరు. డొక్కువేన్లలో, ఇరుకైన బోనుల్లో మమ్మల్ని గడ్డి కుక్కినట్లు కుక్కుతారు. అంచేత ఊపిరాడక కొందరం వేన్లోనే చస్తాం. అక్కణ్ణుండి మా కాళ్ళు కట్టేసి, గుట్టగా పడేసి ద్విచక్రవాహానాల్లో తీసికెళతారు. రోడ్డుకి తల గీసుకుని కొందరం, చక్రంలో పడి నలిగిపోయి ఇంకొందరం దార్లోనే చస్తాం.

చికెన్ సెంటర్లలో మా కళ్ళముందే మా స్నేహితుల పీకల్ని కత్తిరిస్తుంటారు. రక్తం కారుతూ గిలగిల కొట్టుకుంటుండగా, మమ్మల్ని మా సోదరుల విగత శరీరాలపై గుట్టగా పడేస్తారు. 'భగవంతుడా! తొందరగా చావు ప్రసాదించవయ్యా!' అని దుఃఖంతో, భయంతో వణుకుతూ కళ్ళు మూసుకోవడం తప్ప ఏం చెయ్యగలం?
             
జాషువా 'గబ్బిళం' రాసుకున్నాడు. తిలక్ 'గొంగళీ పురుగులు' రాశాడు. పువ్వు కష్టాలపై కరుణతో కరుణశ్రీ 'పుష్పవిలాపం' రాసుకున్నాడు. మామీద మాత్రం ఎవ్వరూ ఏమీ రాయలేదు, రాయరు కూడా. కేవలం 'దిగుబడి' కోసమే మా బ్రతుకు. మీ ఇళ్ళల్లో, హోటళ్ళల్లో - మా శరీర ఖండాలు భోజన పదార్ధాలవుతాయి, అదే మా జీవన పరమార్ధం.

------------------

అమ్మయ్య! ఇన్నాళ్ళకి మాకో తోడు దొరికింది. భూమండలంలో ఇండియా అనే దేశం ఒకటుందిట. ఆ దేశం ఈ మధ్య విపరీతంగా అభివృద్ధి సాధిస్తుందట. అక్కడ చదువులే పెట్టుబడిట, ఉద్యోగాలే దిగుబడిట. ఆ దేశంలో ఆడపిల్లల్ని తల్లి గర్భంలోనే చంపేస్తారట. ఆడపిల్లలకి దాణా దండగ. వాళ్ళు చదువుకుని ఉద్యోగం చేసినా దిగుబడి మొగుడికి వెళ్ళిపోతుందిట - అందుకని!

ఇండియాలో మగపిల్లల్ని ఈ లోకంలోకి ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతార్ట. కొన్నాళ్ళకి ఆ పిల్లల కాళ్ళ క్రింద నుండి ఆ ఎర్రతివాచీ లాగేసి మడత పెట్టేస్తార్ట. వారు బుడిబుడి నడకలతో 'అమ్మా, అత్తా' అంటూ ముద్దుపలుకులు మొదలెట్టంగాన్లే ఎల్కేజీ (ఇదో రకమైన కేజ్)లో పడేస్తార్ట. ఆ బుజ్జిగాళ్ళకి చదువు (ఆరోగ్యకరమైన దాణా) కుక్కుతార్ట (వేస్తారు). వాళ్ళకి పద్ధతిగా పరీక్షలు (వేక్సీన్లు) పెడతార్ట (వేస్తారు). పాపం! ఈ పిల్లలు కూడా మాలాగే బందీలు, వీళ్ళకి బాల్యం ఉండదు.

వీరికి ఆటపాటలంటే యేంటో తెలీదుట. చదువుడే చదువుడు, రుద్దుడే రుద్దుడు, గుద్దుడే గుద్దుడు. పుస్తకాల బ్యాగులు మోసీమోసీ వెన్నుపూస ఒంగిపోతుందిట. పిల్లలకి జ్ఞాపకశక్తిని పెంచడానికి 'పర్సనాలిటీ డెవలప్‌మెంట్' అనే దుకాణదారులు ఉంటార్ట. వీళ్ళు విజయానికి వెయ్యిమెట్లు ఎక్కిస్తార్ట. ఈ మెట్లెక్కలేని దురదృష్టవంతుల్ని మధ్యలో అర్ధంతరంగా తోసేస్తార్ట. మేం రోగాలోచ్చి చచ్చినట్లే - పరీక్షలు తప్పిన విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చస్తుంటార్ట!

నా జీవచ్ఛవ బ్రతుకు కేవలం నలభై రోజులే, ఈ పిల్లగాళ్ళ బ్రతుకులు అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు నాకనిపిస్తుంది - నేను చాలా అద్రుష్టవంతుణ్నని!