Friday 6 July 2012

తెల్లతోలు 'తెలుగు' హీరోయిన్లు.. ఒక పిచ్చిథియరీ!

'తెలుగు సినిమాల్లో తెలుగెప్పుడో చచ్చిపోయింది, కొన్నాళ్ళుగా హీరోయిన్‌గా తెలుగమ్మాయీ చచ్చిపొయ్యింది. ఇప్పుడు బొంబాయి నుండి దిగుమతైన తెల్లతోలు అమ్మాయిలు మాత్రమే హీరోయిన్లు.' 

అతగాడు నా చిన్ననాటి స్నేహితుడు, సినిమా ప్రేమికుడు. ఇప్పటి తెలుగు సినిమాల దుస్థితి గూర్చి బోల్డంత బాధ పడ్డాడు. నాకతని బాధ అర్ధం కాలేదు. నా దృష్టిలో - సినిమా చూడ్డం దురదేస్తే గోక్కోడంలాంటిది. సిగరెట్లు తాగనివాడికి సిగరెట్ రేటు ఎంత పెరిగితే మాత్రం లెక్కేంటి! అలాగే - సినిమాలు చూడ్డం నేనెప్పుడో మానేశాను. నేను చూడని సినిమా బ్రతికినా చచ్చినా నాకనవసరం.

'మేం సినిమాలు కళాపోషణ కోసం తియ్యట్లేదు, మిర్చివ్యాపారంలా మాదీ ఒక వ్యాపారం' అని సినిమావాళ్ళే చెబుతున్నారు - కాబట్టి వాళ్ళతో పేచీ లేదు. తెల్లతోలు అమ్మాయిల్ని తెలుగువాళ్ళు చూస్తున్నారు కాబట్టే వాళ్ళని బొంబాయి నుండి నిర్మాతలు దిగుమతి చేసుకుంటున్నారు. నిర్మాతలకి వ్యాపార ప్రయోజనం తప్ప ఇంకే ప్రయోజనం వుంటుంది? వాళ్ళెవరికైనా డబ్బులివ్వాల్సిందే గదా! తెలుగు అమ్మాయిలు ఫ్రీగా నటిస్తారా?

ఇప్పుడు - 'తెలుగు ప్రేక్షకుడు తెల్లతోలు అమ్మాయిల్ని ఎందుకంతగా ఇష్టపడుతున్నాడు?' అనే ప్రశ్నకి సమాధానం ఆలోచిద్దాం. 

సినిమా అంటే వెండితెరపై కథ చెప్పడం. రచయిత కథని కాగితంపై రాసినట్లే, దర్శకుడు సినిమాని వెండితెరపై రాస్తాడు. కొన్ని కథలు బాగుంటాయి, మరికొన్ని బాగోవు. ఈ బాగోగులు అనేది మనం కథతో కనెక్ట్ కావడంపై ఆధారపడి వుంటుంది. ఇలా కనెక్ట్ కావడం అనేది విజయానికి కీలకం.

ఇప్పుడు కొన్ని ఉదాహరణలు - డెబ్భయ్యో దశకంలో యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి మొదలగు రచయిత్రీమణులు తెలుగు నవలా ప్రపంచాన్ని యేలేశారు. పడవకార్లు + రాజ భవంతులు + ఉన్నిసూట్లతో ఆరడగుల ఆజానుబాహు హీరోల్ని పాపులర్ చేశారు. హీరోలు - కల్యాణ్, రాజేష్, అవినాష్, సునీల్.. ఇలా కళకళ్ళాడే పరభాషా పేర్లతో వెలిగిపొయ్యారు. వీళ్ళందరికీ గురువు శరత్‌చంద్ర చటర్జీ అనే బెంగాలీ రచయిత. 

ఖరీదైన హీరో ఒక మధ్యతరగతి అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయికేమో డబ్బున్నవాడు వెధవనీ, వాజమ్మనీ నమ్మకం. అంచేత హీరోగారి ఖరీదైన ప్రేమని కూడా గడ్డిపోచలా తిరస్కరిస్తుంది. ఆ అమ్మాయికి కావలసింది నీతి + నిజాయితీ +  ప్రేమించే స్వచ్చమైన మనస్సు!

ఆరోజుల్లో మధ్యతరగతి అమ్మాయిలు స్కూల్ ఫైనల్ (అంతకన్నా ఆడపిల్లలకి చదువెందుకు? ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా?) తరవాత తీరిగ్గా పెళ్లికోసం ఎదురుచూస్తూ వుండేవాళ్ళు. రాబోయే భర్త కోసం అందమైన కలలు కన్డానికి వాళ్ళోకో ముడిసరకు కావాలి. సరీగ్గా ఈ అవసరం కోసమే రచయిత్రుల నవలా సాహిత్యం పుట్టింది. అమ్మాయిలు ఆ నవలా హీరోయిన్లో తమని చూసుకుని మురిసిపోయ్యారు. దీన్నే 'ఐడెంటిఫికేషన్' అంటారు. 

హీరో అందగాడు, ధనవంతుడు. అతను తమవెంట పడటం అనే ఊహ (నిజజీవితంలో గుడికి వెళ్ళాలన్నా తమ్ముడు తోడు లేకుండా వెళ్ళలేని పరిస్థితి) ఆ అమ్మాయిలకి భలే 'కిక్' ఇచ్చి ఉంటుంది. ఇదీ ఐడెంటిఫికేషన్ గొప్పదనం. ఇట్లాంటి నవలలు రాయడం అనేది గుడి ముందు కొబ్బరికాయల వ్యాపారంలా మంచి గిట్టుబాటు వ్యవహారం.

మనమిప్పుడు 'ఐడెంటిఫికేషన్' పవర్ అర్ధం చెసుకున్నాం. ఇదే అవగాహనతో తెలుగు సినిమాల్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. అనాదిగా తెలుగు సినిమాల పోషకులు ఆటోడ్రైవర్లు, మెకానిక్కులు, చేతిపనివాళ్ళు, రైతుకూలీలు మొదలైనవాళ్ళు. వీరిలో ఎక్కువమంది డార్క్ స్కిన్‌తో అయిదున్నర అడుగులు మించకుండా వుంటారు. ఈ వర్గాలవాళ్ళు హీరోతో ఐడెంటిఫై అవ్వగలిగితే హీరో విజయవంతంగా నిలబడగలడు. 

సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి హీరో స్థానంలో తనని ఊహించుకోవడం చాలా ఈజీ అవ్వాలి. అందుకే తమలో వొకడిగా కనపడే చిరంజీవిని తెలుగువాళ్ళు, రజనీకాంత్‌ని తమిళంవాళ్ళు పెద్ద హీరోలుగా మార్చేశారు. దీన్నే సినిమా పండితులు 'ఇమేజ్' అంటారు. చిరంజీవి సొఫెస్టికేటెట్‌గా ఉన్నా, రజనీకాంత్ నల్లగా లేకున్నా వారికిప్పుడున్న స్టార్‌డమ్ వచ్చేది కాదు. ఇలా తమకంటూ వొక ఇమేజ్ వున్న నటులతో కథ నడిపించడం దర్శకుడికి సులువు.  

సగటు సినిమా ప్రేక్షకుడి నిజజీవితం యెలా వుంటుంది? అతనికి గర్ల్ వుండదూ, ఫ్రెండూ వుండదు. యే అమ్మాయీ అతన్ని కన్నెత్తి చూడదు. తను కూలిపని చేస్తున్న ఇంటి యజమాని కూతురు.. రోజూ తన ఆటో ఎక్కే ఆంటీ.. తను కాలవలు క్లీన్ చేస్తుండే లేడీస్ హాస్టల్ అమ్మాయిలు.. వీరంతా అందంగా ఉంటారు (డబ్బుకీ అందానికి అవినాభావ సంబంధం వుంది). మనవాడికి వాళ్ళని తీరిగ్గా చూసే ధైర్యం ఉండదు. జీవితంలో వెలితి, అసంతృప్తి, చికాకు, అసహనం.

ఇప్పుడు 'ఫాంటసీ థింకింగ్' గూర్చి రెండుముక్కలు. మానవుడికి వాస్తవ ప్రపంచంలో అనేక సమస్యలు. ఈ సమస్యల ప్రపంచం నుండి గొప్పరిలీఫ్ ఫాంటసీ థింకింగ్! పేదవాడు పచ్చడి మెతుకులు తిని.. తన మహరాజా పేలెస్‌లో కన్యామణులు వింజామరలు వీచుచుండగా.. వైన్ సిప్ చేస్తూ బిరియానీ భోంచేస్తున్నట్లు ఈష్ట్‌మన్ కలర్లో (కనీసం గేవా కలర్లో) ఊహించుకోవచ్చు. దీనిక్కావలసిందల్లా దిండూ, దుప్పటి.. కించిత్తు ఇమాజినేషన్ (ఈ 'ఫాంటసీ థింకింగ్' ఒకస్థాయి దాటితే మానసిక రోగం అవుతుంది).

సినిమావాళ్ళు కలల వ్యాపారాలు. సామాన్యూల కలలకి అందమైన రంగులద్ది ఒక ఊహాప్రపంచం సృష్టించి ఆ ప్రపంచానికి ఎంట్రీ ఫీజు వసూలు చేసుకుంటారు. ఆ చీకటి గదిలో ప్రేక్షకుడే హీరో. ప్రేక్షకుది కలల ప్లాట్‌కి తగ్గట్టుగా చిరంజీవి, రజనీకాంత్‌లు భావాలు వ్యక్తీకరిస్తుంటారు. ఇదోరకమైన ప్లే స్టేషన్ విడియో గేమ్! 

ఈ ప్రేక్షకుడికి అర్జంటుగా ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. మనకి తెల్లతోలంటే పిచ్చి. ఇక్కడ తెల్లబడ్డానికి సబ్బులు, క్రీములకి మంచి గిరాకి. పెళ్ళప్పుడు పెళ్ళికూతుళ్ళకి మేకప్ తెల్లగా వేస్తారు. ఫొటోల్లో మొహం గొడకి కొట్టిన సున్నంలా తెల్లగా ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి హీరో పక్కన తెల్లతోలు పిల్లే కావాలి (రంగువిషయంలో రాజీపడే సమస్యే లేదు). ఆ తెల్లపిల్లతో విరగదీసుకుంటూ విచ్చలవిడిగా వొళ్ళంతా విరగదీసుకుంటూ భీభత్సంగా డ్యాన్సులు చెయ్యాలి. మన తెలుగువాళ్ళల్లో తెల్ల పిల్లలు తక్కువ, వున్నా వాళ్ళు exposing కి బిడియపడొచ్చు? ఈ సమస్యలేమీ లేకుండా అవకాశాల కోసం యెదురు చూస్తున్న తెల్ల పిల్లలు బొంబాయిలో బొచ్చదంతమంది. కాబట్టే హీరోయిన్లని దిగుమతి చేసుకోవడం!

సరే! మన ప్రేక్షకుడు (హీరో ద్వారా) హీరొయిన్‌తో డ్యూయెట్లు పాడేశాడు. కానీ.. ఇంకా ఏదో మిస్సవుతున్నాడు.. అదే ego satisfaction. ఇందుకోసం ఇద్దరు ఇద్దరు హీరోయిన్లుంటే బాగుంటుంది. హీరో 'నావాడంటే నావాడు' అంటూ ఆ ఇద్దరూ తన్నుకుచావాలి. అందుకోసం తమ చౌకబారు ప్రేమని వొలకబోస్తూ హీరోగారి కోసం వెంపర్లాడిపోవాలి. నడ్డి తిప్పుతూ, మెలికలు తిరిగిపోతూ హీరోగారితో పూనకం వచ్చినట్లు గంతులేయ్యాలి. అప్పుడా మజానే వేరు!

అంతేనా? ఇప్పుడు ఇంకొంచెం మసాలా! (ప్రేక్షకుల తరఫున 'నటన' అనబడే కూలి పని చేస్తున్న) హీరో ఆ అమ్మాయిల్ని గడ్డిపోచల్లా చూస్తాడు. ఛీ కొడుతూ humiliate చేస్తాడు. దీంతో పురుష దురహంకారం కూడా సంతృప్తి నొందుతుంది. అసలైన ego satisfaction అంటే ఇది! ఈ విధంగా - నిజజీవితంలో తనకి అందని ద్రాక్షపళ్ళయిన డబ్బున్న అందమైన ఆడపిల్లకి సినిమాహాల్లో రివెంజ్ తీర్చుకుంటాడు మన వర్కింగ్ క్లాస్ ప్రేక్షకుడు!      
                                           
మన సినిమా వ్యాపారస్తులు ఫ్రాయిడ్, ఎడ్లర్ కన్నా తెలివైనవాళ్ళు. అందుకే యెప్పుడూ నేలక్లాసు ప్రేక్షకుల కోసమే సినిమాలు తీశారు. హిందీ దర్శకుడు మన్‌మోహన్ దేశాయ్ 'క్లాస్' ప్రేక్షకులకి సినిమా నచ్చితే సినిమా ఫ్లాప్ అవుతుందేమోనని కంగారు పడేవాట్ట! సినిమావాళ్ళకి ఎవరికోసం ఏం తియ్యాలో ఖచ్చితమైన అవగాహన ఉంది. లేనిదల్లా నా స్నేహితుడులాంటి అమాయకులకే!