Friday, 13 July 2012

బీనాదేవి 'ఫస్ట్ కేస్'.. కొన్ని ఆలోచనలు!


కొన్నికథలు చదుతున్నప్పుడు బాగుంటాయి. మరికొన్ని కథలు చదివిన తరవాత కూడా బాగుంటాయి. అతికొన్ని కథలు చదివిన తరవాత చాలాకాలం వెంటాడుతుంటాయి, మన  ఆలోచనల్ని  ప్రభావితం  చేస్తుంటాయి. నన్నలా వెంటాడిన కథ 'ఫస్ట్ కేస్'. ఈ కథని 'బీనాదేవి' 1967 లో రాశారు. ఈ కథ సంక్షిప్తంగా - (ఎర్ర అక్షరాలు బీనాదేవివి).

డబ్బులో పుట్టి పెరిగిన ఆనందరావు డాక్టర్ పట్టా పుచ్చుకున్నాడు. అతని సూట్లు టెర్లిన్వి. అతని సిగరెట్లు ఇంగ్లీషువి. అతని కారు ఫ్రెంచిది. అతని ఊహలు అమెరికన్వి. అమెరికా వెళ్దామన్న ఆలోచన ఉంది. అతనెలాంటివాడన్న ప్రశ్నకి, బహుశా అతనే చెప్పలేడేమో! అతని జీవితమంతవరకు కరగని కలలా ప్రశాంతంగా జరిగిపోయింది.

మిత్రుడు రాజు ఆహ్వానం మేరకు డాక్టర్ ఆనందరావు ఒక పల్లెటూరుకి వెళ్తాడు. రాజు ఇంటి నుండి కొంతదూరంలో పల్లె వస్తుంది. దాన్ని దాటుకుని పోతే రాజుగారి తోట వస్తుంది. ఒక శీతాకాలపు సాయం సమయాన ఆనందరావు ప్రకృతి అందాలని ఆస్వాదించు చుండగా -

ఎనిమిదేళ్ళ పిల్లొకర్తె వచ్చి నిలబడింది. దూరం నుండి చూస్తే కాకిపిల్లలా అసహ్యంగా ఉంది. ఆర్రోజులై అన్నం మొహం ఎరగనట్లుందా పిల్ల. "డిస్టింక్టిలీ ఏన్ ఎడ్వాన్సెడ్ కేస్ ఆఫ్ మాల్‌న్యూట్రిషన్." అనుకున్నాడానందరావా పిల్లని చూడగానే. ఆ కాకిపిల్ల తన చెల్లికి చాలా అనారోగ్యంగా ఉందని, వైద్యం చెయ్యమని ప్రాధేయ పడుతుంది.

డాక్టర్ పట్టా మాత్రమే పుచ్చుకున్న ఆనందరావు ఇంతవరకూ పేషంటుని చూళ్ళేదు. చూడమని అతన్ని ఎవరూ బ్రతిమాలనూ లేదు. ఈ కొత్త అనుభవాన్ని ఎంజాయ్ చెద్దామని ఆనందరావు ఆ  పిల్లతో పాటు వాళ్ళ గుడిసెకి వెళ్తాడు. అక్కడ కనిపించిన దరిద్రానికి ఖిన్నుడవుతాడు.

ఇంత దరిద్రం, ఇంత మంచిగా కనిపించే తన ప్రపంచంలోనే వుంటుందని అతనూహించలేకపోయాడు.

ఒక మూల తాళ్ళు తెగిన నులక కుక్కిమంచంలో విరిగిన బొమ్మలాంటి ఒక ఆరేళ్ళ పిల్ల పడుకునుంది. ఆరేళ్ళు కేవలం వాయుభక్షణం మాత్రం చేసినట్లుంది. చేపల్లాంటి ఆ పిల్ల కళ్ళు తెరచి వుండటం వల్ల చచ్చితేలిన ఎర్రచేపల్లా వున్నాయి.

నశించిపోతున్నాశలా మంచంవారనే ఆ పిల్ల తల్లి నిల్చొనుంది. ఆమెకెన్నేళ్ళుంటాయి? ఎన్నున్నా నూరేళ్ళు నిండిపోయినట్లుంది.

తిండిలేక ఎండిపోయిన ఆ పిల్లకి మందులతో పాటు ఆహారం కూడా కావాలని ఆనందరావుకి అర్ధమౌతుంది.

"పిల్లకేదేనా అర్జంటుగా తింటానికివ్వాలి."

"బిందెలో నీల్లూ, బొందిలో పానాలు తప్ప నాకాడేట్నేవు."

"దేశంలో ఇంత దరిద్రమా?" అని బాధపడ్డాడానందరావు. తను నమ్మిన దేవుడు తనని మోసం చేసినట్లూ, తను పెంచిన పావురం పెనుపక్షై గోళ్ళతో తన పీక పట్టుకున్నట్లు ఫీలయ్యాడు.

ఇది తన 'ఫస్ట్ కేస్'. ఎలాగైనా ఈ పిల్లని బ్రతికించాలి. అంచేత ఆ పిల్ల అక్కని తనతోబాటు మిత్రుడి ఇంటికి తీసుకెళ్ళి ఒక ఫ్లాస్క్ నిండా హార్లిక్స్ పోసి, త్వరగా ఇంటికెళ్ళి చెల్లికి తాగించమంటాడు. మందుల బీరువా తాళాలు వెతుక్కుని, సిరెంజి బోయిల్ చేసుకుని పరుగుపరుగున తన ఫస్ట్ కేస్ దగ్గరకి వెళ్తాడు ఆనందరావు.

ఆనందరావు వెళ్ళేప్పటికి ఆకలితో ఆ పేషంట్ చనిపోతుంది. ఆ పిల్ల అక్క దరిదాపుల్లో కనబడదు. తన ఫస్ట్ కేస్ ఇలా ఫెయిల్ అయినందుకు.. కాళ్ళు మొయ్యలేనంత బరువెక్కిపోయిందతని మనసు.

కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే! బాధతో మిత్రుడి ఇంటికి తిరిగి వెళ్తున్న ఆనందరావుకు దారిలో ఓ గోడకి ఆనుకుని నిద్రపోతున్న రోగి అక్క కనపడుతుంది. ఆ పిల్ల వెనక కసిగా పడగ విప్పి ఒక నల్లత్రాచు ఉంది. ఆ పిల్ల వెనకాల రాతిపలక మీదున్న ఖాళీఫ్లాస్కుని చూస్తాడు. ఆ పిల్ల అతనికి మరోపాములా కనబడుతుంది!

రోగికి చేరవలసిన హార్లిక్స్‌ని మధ్యలోనే అక్క తాగేసింది! చెల్లి ఆకలితో చచ్చిపోయింది! ఆకలితో కాలే కడుపుకి అనుబంధం, ఆత్మీయత గుర్తుండవు. మనిషిలోని అన్ని బంధాల్ని చెరిపేసే శక్తివంతమైనది ఆకలి.

కొంత ద్వైదీభావం తరవాత - ఆర్నెల్లలో అమెరికా వెళ్ళిపోవడం ద్వారా ఆనందరావు సమస్య పరిష్కారమైపోతుంది. టూకీగా ఇదీకథ.

నా మాట -

సరే! ఈ బీనాదేవి కథ తెలుగు సాహిత్యంలో చాలా ప్రముఖమైనది. ఈ కథ గుణగణాలని విశ్లేషించే ఉద్దేశం నాకు లేదు. ఫస్ట్ కేస్ కథావస్తువు, శిల్పం వంటి ఎకడెమిక్  అంశాల్ని కొందరు విశ్లేషించారు. కాబట్టి ఆ విషయాలు పక్కన పెడదాం. అయితే - ఈ కథ నలభై అయిదేళ్ళ కన్నా ఇప్పుడే రిలవెంట్ అనుకుంటున్నాను.

మారుతున్న కాలం.. మారుతున్న సమాజం.. మారుతున్న విలువలు.. పెరుగుతున్న డబ్బు ప్రాధాన్యత.. వేగంగా వ్యాపారీకరించబడుతున్న వైద్యవిద్య, వైద్యం - ఈ కథ విలువని మరింతగా పెంచుతున్నాయి. ఎల్కేజీ నుండే వేల ఖర్చుతో.. సమాజానికి దూరంగా.. మెరిట్ కి దగ్గరగా.. కేవలం సబ్జక్ట్ విషయాల్నే వల్లె వేయిస్తూ.. డబ్బు సంపాదనే ధ్యేయంగా, ఆశయంగా ఈ సమాజం అనేక ఆనందరావుల్ని తయారుచేస్తుంది. మనం ఆనందరావుల్ని నిందించి ప్రయోజనం లేదు. బీనాదేవి కూడా ఆనందరావుని చెడ్డవాడిగా చెప్పలేదు.

కథ మొదటిసారి చదివినప్పుడు చెల్లి చావుకి కారణమైన అక్కని కోపగించుకున్నాను. పాఠకుణ్ణి ఆకట్టుకోవడానికి రచయిత చేసిన జిమ్మిక్ లాగా కూడా అనిపించింది. కడుపు నిండినవాడికి కడుపు కాలేవాళ్ళ పనులు అరాచకంగానూ, అకృత్యాలుగానూ కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడయితే ఈ ముగింపే ఈ కథని ఎంతో గొప్పగా ఎలివేట్ చేసిందని నమ్ముతున్నాను.

ఈ కథ ప్రతి మెడికల్ కాలేజి వార్షిక మ్యాగజైన్లలో ప్రచురించాలని, ప్రతి వైద్యుడూ తప్పక చదవాలని - ఆ రోజుల్లో మా స్నేహితులం అనుకుంటుండేవాళ్ళం. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రముఖమైన ఈ కథని చదవనివారు ఉండకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా చదవనివారు ఉంటే దయచేసి చదవండి. ఈ పోస్ట్ ఉద్దేశ్యం కూడా ఇదే!

(photo courtesy : Google)