Monday 9 July 2012

తెలుగుజాతికి అవమానం! ఎంత ఘోరం!!


"రమణ మామ! కాఫీ." అంటూ హాడావుడిగా వచ్చాడు సుబ్బు.

"కూర్చో సుబ్బు! ఒక తెలుగువాడికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది. నాకు బాధగా ఉంది." దిగులుగా అన్నాను.

"ఎవరా తెలుగువాడు? ఏమా అన్యాయం?" ఆసక్తిగా అడిగాడు సుబ్బు.

"మన పి.వి.నరసింహారావు మీద ఏదో కుట్ర జరుగుతుంది సుబ్బు. పేపర్ చదవలేదా?" ఆశ్చర్యంగా అన్నాను.

"ఓ అదా! నేనింకేదో అనుకున్నాను." అంటూ నవ్వాడు సుబ్బు.

"సుబ్బు! నీ నవ్వు పరమ దరిద్రంగా ఉంది. ఒకపక్క తెలుగుజాతి పరువు నట్టేట మనిగిపోతుంది." చికాగ్గా అన్నాను.

"ఇందులో తెలుగుజాతికి జరిగిన నష్టమేంటో నాకర్ధం కావట్లేదు. పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎమర్జన్సీలో కూడా పార్టీలో కీలక వ్యక్తి. ఒకానొక ప్రత్యేక పరిస్థితుల్లో.. అదృష్టవశాత్తు ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రధానమంత్రి అయ్యాడుగానీ.. తెలుగువాడు కాబట్టి ప్రధానమంత్రి కాలేదు." అన్నాడు సుబ్బు.

"కానీ ఆయన తెలుగువాడు.. "

"అవును. నే చెప్పేదీ అదే! ఆయన మాతృభాష తెలుగు. గొప్పపండితుడు. వేయిపడగల్ని హిందీలోకి అనువదించాడు. ఆయన భాషాశాస్త్ర పాండిత్యానికి శతకోటి వందనాలు. అయితే పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి కావడానికి ఇవేవి కారణం కాదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే కారణం. కానీ.. మనం ప్రముఖులైనవారికి మన తెలుగుభాష ముద్ర వేసుకుని వారిని మనలో కలిపేసుకుని ఆనందిస్తాం. వారి గూర్చి తెగ తాపత్రయ పడిపోతాం. మంచిదే. ఇక్కడిదాకా నాకు పేచీ లేదు."

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ  చెప్పసాగాడు సుబ్బు.

"కానీ ఈ కారణాన ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి చెందిన రంగంలో గుడ్డిగా సమర్ధించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి ఆల్ ఇండియా ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ లో కార్డియాక్ సర్జన్ వేణుగోపాల్ కి, కేంద్ర ఆరోగ్యమంత్రి అంబుమణి రాందాస్ కి గోడవయింది. అది కేవలం రెండుగ్రూపుల మధ్య తగాదా. అప్పుడుకూడా ఆ డాక్టరుకి 'తెలుగు తేజం' అంటూ ఒక కిరీటం తగిలించి ఏదో ఘోరం జరిగిపోయిందని గగ్గోలు పెట్టాం. మనకిదో రోగం."

"సుబ్బు! నీకసలు భాషాభిమానం లేదు. నీ చెత్త ఎనాలిసిస్ ఆపెయ్యి." విసుగ్గా అన్నాను.

"నాకు భాషాభిమానం లేకపోవచ్చు. కానీ నీది భాషా దురభిమానం. ఇప్పుడు ఢిల్లీలో రాబోయే ఎన్నికలకి సన్నద్ధమయ్యే తతంగం నడుస్తుంది. బాబ్రీ మసీదు కూలగొట్టినప్పటి అలసత్వం ఒక మరకగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెడుతుంది. ఎలాగైనా ఆ మరక తుడిచేసుకోవటానికి తంటాలు పడుతుంది. అందులో భాగంగానే ఆ మురికంతా పి.వి.నరసింహారావుకి పూసే ప్రయత్నం జరుగుతుంది. 'మసీదు కూల్చివేత సమయంలో ఆయన పూజామందిరంలో ఉన్నాడా? బాత్రూంలో ఉన్నాడా?' అన్నవి ప్రజలకి సంబంధం లేని అనవసర విషయాలు. పి.వి. తెలుగువాడయినా, బెంగాలీవాడయినా ఈ ప్రచారం జరగక మానదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. మధ్యలో మనమెందుకు బాధ పడటం?" అంటూ చిన్నగా నవ్వాడు సుబ్బు.

"కానీ తెలుగువాడి రక్తం.. "

"రక్తం లేదు. రసనా లేదు. ఎవడి రాజకీయ అభిప్రాయాలు వాడికున్నాయి. గ్లోబలైజేషన్ అనుకూలం వాళ్ళకి  పి.వి. దేవుడు. వ్యతిరేకులకి ఆయనొక దెయ్యం. హిందూమత రాజకీయ భావాలు కలవారికి పి.వి. రాజకీయ చాణుక్యుడు. సెక్యులర్ భావాలవారికి ఆయనొక అసమర్ధ ప్రధాని. రాజకీయాలు మనం చూసే దృష్టికోణం బట్టి ఉంటాయి." అన్నాడు సుబ్బు.

"కానీ పి.వి.నరసింహారావు దేశప్రధానిగా చేశాడు. ఇవ్వాళ కాంగ్రెస్ ఆయన్ని గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తుంది." అన్నాను.

"రాజశేఖరరెడ్డి నిన్నగాక మొన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసినవాడు. ఇప్పుడు రాజశేఖరరెడ్డి ఫొటో గాంధీభవన్లో పెట్టటానికి ప్రయత్నించి చూడు. కాంగ్రెస్ నాయకులు నిన్ను పిడిగుద్దులతో చంపేస్తారు. ఇవి రాజకీయాలు నాయనా! అత్యంత క్రూరమైనవి. ఇవ్వాళ నిన్ను ఒకందుకు పల్లకిలో ఎక్కిస్తారు. రేపు మరొకందుకు కుళ్ళబొడుస్తారు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ పై పెట్టాడు సుబ్బు.

"నువ్వు చెప్పేది బాగానే ఉంది. కానీ నాకు నచ్చలేదు." అన్నాను.

"నీకు నచ్చకపోతే కొంపలేమీ మునగవులే! స్వాతంత్ర్యానంతరం మనదేశంలో సంభవించిన అత్యంత ముఖ్యమైన ఘటనని రాజకీయ కోణం నుండి కాక.. ప్రాంతీయ, భాషాకోణం నుండి ఆలోచించే నీకు నేను అర్ధం కాను. పి.వి.నరసింహారావుకి జరుగుతున్న అన్యాయానికి నువ్వు తీరిగ్గా బాధపడు. నాకు పనుంది. వెళ్ళాలి!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు!

(photo courtesy : Google)