Saturday 21 July 2012

యోగాసనాలు.. కొన్ని సందేహాలు


"యోగాసనాల వల్ల ఉపయోగం వుంటుందా?" ఇది నన్ను నా పేషంట్లు తరచుగా అడిగే ప్రశ్న.

"తెలీదు." నా స్టాండర్డ్ సమాధానం.

నేనెప్పుడూ ఆసనాలు వెయ్యలేదు. అప్పుడెప్పుడో ఓసారి టీవీలో నేచూసినప్పుడల్లా ఒకతను చాపమీద పడుకుని.. వివిధభంగిమలలో శరీరాన్ని మడతబెడుతూ.. ఘాట్టిగా గాలిపీల్చి వదిలాడు. నాకవి స్ట్రెచింగ్ ఎక్సర్సైజుల్లా అనిపించాయి. అసలు - యోగా, యోగాసనాలు ఒకటేనా? తెలీదు. ధ్యానం చేసుకోవటం యోగాసనం వెయ్యడం అవుతుందా? అదీ తెలీదు. ఇన్ని 'తెలీదు'లు వున్నాయి కాబట్టే నా సమాధానం - 'తెలీదు'.

బరువు తగ్గాలంటే మనం కేలరీలని burn చెయ్యాలి. కొంత ఆహారనియంత్రణ ద్వారా.. ఇంకొంత వ్యాయామం ద్వారా కేలరీల్ని మైనస్ చెయ్యొచ్చు. నడవడం, పరిగెత్తడం, టెన్నిస్, స్విమ్మింగ్ మొదలగు ఏరోబిక్ ఎక్సర్సైజుల ద్వారా కేలరీలని ఫైర్ చెయ్యొచ్చు. అయితే.. చాపమీద పడుకుని, కూర్చుని, ఒంగొని కేలరీల్ని ఎలా burn చేస్తాం?!

ఆసనాలు వేస్తే ఎక్కువరోజులు బ్రతుకుతారంటే తప్పకుండా చెయ్యొచ్చు. అయితే 'యోగా చేస్తే దీర్ఘాయుష్షు' అనేదానికి ఋజువుల్లేవు. అనేకమంది యోగా గురువులు రోగాల్తో తీసుకుంటున్నారు. అర్ధంతరంగా 'హరీ'మంటున్నారు. ముప్పైయేళ్ళగా క్రమం తప్పకుండా యోగాసనాల్ని వేసే మా మేనమామ.. ఆసనాల వల్ల తన మనస్సు ప్రశాంతంగా ఉందంటాడు. ఏనాడూ పట్టుమని పద్మాసనం కూడా వెయ్యని నా మనసు కూడా ప్రశాంతంగానే ఉంది మరి!

మనదేశంలో మనిషి ప్రాణానికి భత్రత లేదు. దోమలు, ఈగల వల్ల ప్రతియేడాదీ లక్షలమందిమి చనిపోతుంటాం. వర్షమొస్తే మునిసిపాలిటీ manhole లో కూడా పడి చస్తుంటాం. ఇన్నిరకాలుగా మనకి చావు పొంచిఉండగా - కడుపు మాడ్చుకుని, మెలికలు తిరుగుతూ, ఆసనాలు వేసినా.. యే దోమకాటుకో చస్తే? పడ్డ కష్టం వృధా అయిపోతుంది కదా! ఫలానా విధంగా చస్తామని ముందుగానే తెలిస్తే - ఆ దిశగా నివారణోపాయాలు తీసుకోగలం. సమస్యేమంటే - మనం యెలాంటి చావు చస్తామో తెలిచ్చావదు!
       
మనది పేదదేశం. యెంతోమంది సరైన తిండిలేక పోషకాహార లోపాల్తో రోగాల బారి పడుతుంటారు. మెజారిటీ ప్రజలు వ్యవసాయ పనులు చేసుకుంటారు. పన్లేనప్పుడు దర్జాగా కాలుమీద కాలేసుకుని బీడీలు కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళకి ఆసనాలతో అసలు పనే లేదు.

నగరాల్లో జిమ్ములుంటాయి. ఇవి ప్రధానంగా డబ్బున్నవారికి ఉపయోగపడుతుంటాయి. ఎటొచ్చీ మధ్యతరగతివాళ్లకే సమస్య. డబ్బు ఖర్చు కాకూడదు, కానీ వ్యాయామం కావాలి. అంచేత వీరు ఉచిత యోగాసనాల క్యాంపుల్లో ఆసనాలు నేర్చుకుంటారు (ఎంట్రీ ఫీజు ఒక్కరూపాయి పెట్టినా ఎవరూ వెళ్లరని మా సుబ్బు అంటాడు). 

ఇట్లా ఆసనాలు నేర్చుకున్న కొన్నాళ్ళకి.. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని, కొద్దిసేపు తెలుగు న్యూస్ పేపర్ తిరగేసి (తెలుగు న్యూస్ పేపర్లో న్యూస్ ఉండదు, అందుకే తిరగేస్తే చాలు.).. చాపెక్కేస్తారు (అనగా - చాప పరుచుకుని, దానిపై కూర్చుంటారని అర్ధం). ఇక ఆసనాలు అనబడు కాళ్ళూచేతులు ఆడించు కార్యక్రమం మొదలెడతారు. కాకపొతే ఇంట్లోవాళ్ళ కాళ్ళకీ, చేతులకీ అడ్డం పడకుండా చూసుకోవలసివుంది.

మనం తెలుగువాళ్ళం. ఆకల్లేకపోయినా ఆహారాన్ని అదేపనిగా పొట్టలోకి నెట్టడం తెలుగువాడి జన్మహక్కు. పరిమిత ఆహారం ఆసనాలలో ఒక భాగం కాబట్టి తిండిమీద కంట్రోల్ వచ్చే అవకాశముంది. కాకపోతే ఆసనాలు వేసి, నీరసంగా ఉందని నాలుగు నేతిపెసరట్లు లాగించే యోగాగ్రేసురులు కూడా వున్నారు.

ఈ ఆసనాలు అనేవి స్వదేశీ వ్యవహారం. నా సైకియాట్రీ సబ్జక్ట్ పూర్తిగా విదేశీగోల. ఆసనాల వల్ల కలిగే లాభనష్టాలు శాస్త్రబద్దంగా సరైన విధానంలో బేరీజు వెయ్యబడలేదు. జాకబ్సన్ అనే ఆయన అప్పుడెప్పుడో PMR (progressive muscle relaxation) అనే టెక్నిక్ చెప్పి వున్నా.. ఆ టెక్నిక్కీ, మన ఆసనాలకీ సంబంధం లేదు. 

ఆసనాలని తెల్లతోలు విదేశీయులు కూడా వేసేస్తున్నారనీ, మన భారతీయ వ్యాయామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని మనం గర్వించనక్కర్లేదు. వాళ్ళు మనకన్నా బుర్ర తక్కువ సన్నాసులు. అందుకనే మన ఆధ్యాత్మిక వ్యాపారంగాళ్ళంతా తెల్లతోలు వెధవల్ని భక్తులుగా ముందువరసలో కూర్చుండబెట్టి ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తున్నారు.

మానసిక వైద్యంలో ఆసనాల ఉపయోగం గూర్చి కొన్ని స్టడీస్ ఉన్నాయి. నాకవి 'చేసినట్లు'గా కాదు, 'రాసినట్లు'గా తోస్తుంది. అంచేత ఈ స్టడీస్ ని ఆధారం చేసుకుని మనం ఒక నిర్ధారణకి రాలేం. నన్ను నా పేషంట్లు అడిగేది 'వైద్యుడి'గా నా సలహా, కాలక్షేపం సలహా కాదు.  

మనదేశంలో చదువుకున్నవాడు సర్వజ్ఞుడని, వాడికి తెలీనిదేదీ వుండదని నమ్ముతారు. ఈ లక్జరీ ఎంజాయ్ చెయ్యడానికి బానే ఉంటుందిగానీ, కొన్నిసందర్భాల్లో ఇబ్బందిగా ఉంటుంది. నాకీ ఆసనాల గోల తెలీదు. నాకేమాత్రం తెలీని విషయంలో రొగోత్తముడకి (ఫీజ్ ఇస్తాడు కాబట్టి రోగి ఎప్పుడూ ఉత్తముడే) ఎలా సలహా చెప్పేది? 

"మన్దగ్గర్నుండి సమాధానం రాబట్టాలనే కుతూహలం తప్ప అడిగేవాడెప్పుడూ ఆసనాలు వెయ్యడు. మనమిచ్చే మందులు సరీగ్గా పని చెయ్యకపొతే ఆ నెపం ఆసనాల మీదకి నెట్టేసే సౌలభ్యం వస్తుంది. అంచేత యోగా చేయ్యమని చెబితేనే మన వృత్తికి మంచిది." అని నా సైకియాట్రిస్ట్ మిత్రులు అంటారు.

అదీ నిజమే! ప్రతిదీ సందేహాల తోమసయ్య (doubting Thomas) లాగా ఎక్కువ ఆలోచించేకన్నా, లౌక్యంగా తోచిన సలహాలిచ్చిన - స్వామికార్యము, స్వకార్యము చక్కబెట్టుకొనవచ్చును! ఇంత చిన్నవిషయం నా బుర్రకి తట్టలేదేమి?!