Sunday 15 July 2012

మిత్రుడు బి.చంద్రశేఖర్‌కి అభినందనలు


'న్యాయవాది' అనగా ఎవరు? న్యాయం తరఫున నిలబడేవాడే కాదు, న్యాయం కోసం పోరాడేవాడు అని అర్ధం. అయితే - కాలక్రమేణా అనేక వృత్తుల్లాగే 'న్యాయవాది' అర్ధం కూడా మారిపోయింది. రావిశాస్త్రి న్యాయవ్యవస్థ గుట్టు విప్పేసి నడిబజార్లో నిలబెడ్డేసినాక 'చట్టం, న్యాయం' లాంటి పదాల పట్ల నాకు భ్రమలు తొలగిపొయ్యాయి. 

లోకంలో అవినీతి, అన్యాయాలు మాత్రమే సూర్యచంద్రుల్లా పోటీ పడుతూ ప్రకాశిల్లుతుంటాయనీ.. ఆ ప్రకాశం తరిగిపోకుండా న్యాయవాదులు కడు అన్యాయంగా వాదిస్తూ తమవంతు పాత్ర పోషిస్తూ వుంటారనీ, కోర్టులనేవి అన్యాయపు దేవాలయలనీ అర్ధమయ్యాక - నేను న్యాయవాదుల గూర్చి పట్టించుకోవటం మానేశాను.

ఇక్కడంతా మట్టిగడ్డలే, అన్నీ కంకర్రాళ్ళే అని తీర్మానించేసుకున్నవాడు.. హఠాత్తుగా ఒక బంగారపు రాయో, వజ్రపు తునకో కనపడితే ఆశ్చర్యపోతాడు. సరీగ్గా ఇట్లాంటి ఆశ్చర్యం నాకు మిత్రుడు భువనగిరి చంద్రశేఖర్‌ని చూసినప్పుడు కలిగింది. చంద్రశేఖర్ న్యాయవాది! అటు తరవాత కొన్ని కేసుల్లో చంద్రశేఖర్ నిబద్దతా, తపనా చూసినప్పుడు న్యాయవాద వృత్తి పట్ల గౌరవం కలిగింది. 

భవనగిరి చంద్రశేఖర్ నాకు చాలాకాలంగా స్నేహితుడు. చంద్రశేఖర్ని స్నేహితులం 'చంద్రా' అని పిలుచుకుంటాం. మొదటిసారిగా మిత్రుడు గోపరాజు రవి ఇంట్లో ఏసీ కాలేజ్ లా విద్యార్ధిగా వున్నప్పుడు కలిశాడు. ఇద్దరికీ సిగరెట్లు కాల్చే అలవాటు, ఇద్దరికీ పుస్తకాలు చదివే అలవాటు, ఇద్దరికీ కబుర్లు చెప్పే అలవాటు. అందువల్ల మా స్నేహం మా ప్రమేయం లేకుండానే, ఎటువంటి ప్రయత్నం లేకుండానే బలపడింది!

చంద్రశేఖర్ పుస్తకాలు విపరీతంగా చదువుతాడు, మంచి పుస్తకాలు మన్చేత చదివించడానికి ప్రయత్నం చేస్తాడు. 'సమాజంలో బలహీనుల హక్కులు కోసం పోరాడతావు గానీ - బలవంతంగా పుస్తకాలు చదివిస్తూ స్నేహితుల హక్కులు హరిస్తున్నావ్!' అని నేను విసుక్కున్న సందర్భాలు వున్నయ్! చంద్రశేఖర్ న్యాయానికి అన్యాయం చెయ్యడు. అన్యాయానికి మాత్రం అన్యాయమే చేస్తాడు. ప్రత్యక్షంగా చూసాను కనుక ఈ విషయం గట్టిగా చెప్పగలను. 

చంద్రశేఖర్ ఇంగ్లీషు రాసినా, తెలుగు రాసినా ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ రాసినట్లు అక్షరాలు ముత్యాలు పేర్చినట్లుగా ముచ్చటగా వుంటాయి. నేనేది రాసినా మలయాళీ మాంత్రికుడు పాళీ భాషలో రాసినట్లు అడ్డదిడ్డంగా వుంటుంది. అందువల్ల నాకు చంద్రా అంటే జెలసీ! చంద్రశేఖర్ మంచి వక్త. ఆంధ్రాంగ్లముల్లో అనర్గళంగా ఆలోచింపజేసే ఉపన్యాసాలు ఇవ్వగలడు. అందువల్ల కూడా నాకు చంద్రా అంటే జెలసీ!

చంద్రశేఖర్ భార్య చంద్రిక. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నాకు స్నేహితురాలు, మేమిద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. కొడుకు శశాంక్ కూడా న్యాయశాస్త్రాన్ని చదువుకుంటున్నాడు. వాణ్ని చిన్నప్పుడు ఎత్తుకున్నాను, ఇప్పుడు బారుగా ఎదిగిపొయ్యాడు.

బి.చంద్రశేఖర్ గూర్చి కొన్ని వివరాలు -

కె.జి.కన్నాభిరాన్‌కి ప్రియశిష్యుడు.

1927 లో అమెరికాలో ఉరిశిక్షకి గురికాబడ్డ 'శాక్కో - వాంజెట్టి' (వ్యధార్త జీవిత యధార్ధ దృశ్యం) కేసు పూర్వాపరాలతో  1995 లో పరిశోధానాత్మకమైన పుస్తకాన్ని వెలువరించాడు. (పర్‌స్పెక్టివ్స్ ప్రచురణ)

2003 లో 'ఏన్జీవోల కథ' అంటూ విదేశీ నిధులతో నడిచే స్వదేశీ స్వచ్చంద సంస్థల గుట్టు విప్పుతూ ఒక పుస్తకాన్ని రాశాడు. (పర్‌స్పెక్టివ్స్ ప్రచురణ)

చిలకలూరిపేట బస్ దహనం కేసులో ఉరిశిక్ష రద్దు కోసం రాష్ట్రపతి భవన్ గేట్లు తట్టాడు. 

చుండూరు మారణకాండ కేసులో సుదీర్ఘకాలం (స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా) దళితుల తరఫున వాదించాడు. ఇప్పుడీ కేసు హైకోర్టులో నడుస్తుంది. ప్రస్తుతం హైకోర్టులో కూడా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధితుల తరఫున వాదిస్తున్నాడు.

'చట్టబద్ద పాలనలో శిక్షలు విధించాల్సింది కోర్టులే కానీ - పోలీసు వ్యవస్థ కాదు.' నిందితుల్ని తనదైన స్టైల్లో శిక్షించిన ఒక పోలీసుకి (ఐపీఎస్ ఆఫీసర్) వ్యతిరేకంగా జాతీయ మానవ హక్కుల కమీషన్ నుండి నేడు న్యాయాన్ని రాబట్టాడు.

'ఆల్ ద బెస్ట్ చంద్రా! వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్!'

చంద్రా, చంద్రిక, శశాంక్‌లకి అభినందనలతో -

(photo courtesy : B.Chandrasekhar)