Saturday, 22 September 2012

'అసూబా'ల ఆహార్యం"మాదో అమెరికా తెలుగు సంఘం, అక్కడ తెలుగువాళ్ళ సేవలో తరిస్తున్నాం." అంటూ కొందరు సూటూబూటూరాయుళ్లు ఆంధ్రదేశంలో తిరుగుతుంటారు. వీళ్ళు తెలుగు రాజకీయ పార్టీల సేవకులనీ, కేవలం తమ సొంత ప్రయోజనాల కోసం అలా తిరుగుతుంటారనీ కిట్టనివారు అంటారు.. నిజానిజాలు తెలీదు. ఈ అమెరికా సూటుబాబుల (ఇకనుండి 'అసూబా') సేవాతత్పరతకు ముగ్ధుడనవుతున్నాను.     
                     
ఇక్కడ మన ఎండల్లో, ఉక్కపోతలో వారు సూట్లేసుకుని చెమటలు కక్కుకుంటూ, కంఠ లంగోటీ (tie) సరిచేసుకుంటూ, వారి సేవా కార్యక్రమాల్ని యేకరువు పెడుతుంటే నాకు వొళ్ళు పులకిస్తుంది, ఆనందభాష్పాలు రాల్తాయి. ఇంత గొప్ప సమాజసేవకులక్కూడా చెమట ధారలు కార్పిస్తున్న మన దుష్టవాతావరణానికి సిగ్గుతో తల దించుకుంటుంటాను.  
                     
ఎదుటివాడు జడుసుకుంటాడని బట్టలేసుకుంటాం గానీ, అసలు మన వాతావరణం బట్టలకి సూటవదు. ఇక్కడ యోగివేమన డ్రెస్సే కరక్ట్. 'అసూబా'లకి సూటూబూటూ వేసుకోవాలని రూలుందా? ఈ వేషాల్ని 'ఆహార్యం' (ఆహారం కాదు) అంటారని యెక్కడో చదివాను.  
                      
నా క్లాస్మేట్లు చాలామంది అమెరికాలో స్థిరపడ్డారు. ఒకసారి ఒక అమెరికావాసి యేదో పార్టీలో కోటేసుకొచ్చి 'అసూబా'గా తన ఆహార్యం ప్రదర్శించాడు. మన భారతీయులకి సున్నితత్వం ఉండదు, బొత్తిగా అసూయపరులు. ఆరోజు పార్టీలో మా 'అసూబా' అనేక విధాలుగా హింసింపబడ్డాడు. అమెరికాకి వెళ్ళి ఒక మంచి సూటుగుడ్డ కొనుక్కున్నందుకు అభినందించాం. సూట్లో అచ్చు దొరబాబులా ఉన్నావని పొగిడాం. కోటేసుకున్నావు కాబటి నువ్వు కోటేస్సర్రావ్వి అంటూ ముద్దుగా పిలుచుకున్నాం. కొద్దిసేపటికి అతగాడు రెండుచేతులూ జోడించి నమస్కరించి కోటు విప్పి అవతల పడేశాడు.       

పురాణపురుషులక్కూడా ఈ ఆహార్యమే ప్రధానం. విష్ణుమూర్తి పొద్దస్తమానం పాముమీద పడుకుని లక్ష్మీదేవితో కాళ్ళొత్తించుకుంటుంటాడు, అందుక్కారణం ఆయనకి కాళ్ళనొప్పి కాదు. కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి లేకపోతే ఆయ న్నెవరూ గుర్తు పట్టలేరు - అందుకని! పింఛంలేని కృష్ణుణ్ణీ, నాగలి చేతలేని బలదేవుణ్ణీ - ఇలా ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు. ఎంత బరువుగా ఉన్నా, మరెంతో దురదగా ఉన్నా ఈ ఆభరణాలూ, వారి ట్రేడ్మార్క్ ఆయుధాలూ మోయక తప్పదు. ఆహార్యం అంటే అదే మరి!
                      
ఈ వేషభాషల గోల పురాణ పురుషులకేం ఖర్మ, వృత్తుల్లో కూడా చాలా ముఖ్యం. వాస్తురత్న, వాస్తుబ్రహ్మలకి మునుల్లాగా పొడుగు జుట్టు, పెద్ద బొట్టు, మెళ్ళో రుద్రాక్షలే ఆహార్యం. ఈ అవతారం లేకుండా ఈశాన్యమ్మూల బరువుందనీ, ఆగ్నేయం లోతుందనీ వారు చెప్పలేరు.. చెప్పినా ఎవడూ పట్టించుకోడు. 

ఎంగెల్స్‌కి ఒకసారి గడ్డం దురదెట్టి గీసేద్దామనుకున్నాట్ట! గడ్డం తీసెయ్యటానికి గతితార్కిక భౌతికవాదం ఒప్పుకోదని మార్క్స్ వాదించాడు. వెధవ గడ్డానికి సిద్ధాంతాల రాద్ధాంతం ఎందుకులెమ్మని ఎంగెల్స్ కేరళీయ వైద్యం లాంటిదేదో చేసుకుని  మూతి దురదని తగ్గించుకున్నాట్ట! ఇది నిజం, ఒట్టు. నన్ను నమ్మండి. నమ్మకపోతే కమ్యూనిస్టు మేనిఫెస్టో రెండో అధ్యాయం, పధ్నాలుగో పేజీ చూడండి!            
                      
రాయలసీమ ఫ్యాక్షనిస్టులకి తెల్ల టాటా సుమోలే ఆహార్యం. ఆమధ్యన టాటా కంపెనీవాళ్ళు సుమోల ప్రొడక్షన్ ఆపేద్దామనుకున్నారు. కానీ - "ఒరే టాటా! నువ్వు సుమోలని ఆపావో.. అమ్మతోడు. అడ్డంగా నరికేస్తా" అంటూ ఒక ఫ్యాక్షనిస్టు తొడగొట్టి మరీ తన్ టాటాని బెదిరించాట్ట. తన సుమోలకి ఇంత చరిత్ర ఉందని తెలుసుకున్న రతన్ టాటా, ఫ్యాక్షనిస్టు పరిశ్రమ దెబ్బతినకుండా ఉండేందుకు, ఒక సాటి పారిశ్రామికవేత్తగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాట్ట.


నాకు తెలిసిన పోలీసాఫీసర్ ఒకాయన Royal Enfield మోటర్ సైకిల్ని ఎంతో శ్రమకోర్చి నడుపుతుండేవాడు. చూసిచూసి ఒకరోజు ఉండబట్టలేక ఎందుకా దున్నపోతుని వెంటేసుకు తిరడగమంటూ అడిగేశా. అతను పెద్దగా నవ్వి "భలేవాడివే! బుల్లెట్ నడపకపోతే నేరస్తుల గుండెల్లో నిద్ర పోయేదెట్లా? చట్టం, న్యాయం, ధర్మం అనే మూడుసింహాలని కాపాడేదెట్లా?" అన్నాడు. అదీ నిజమే!  
                     
తరచి చూడగా - ఇంతమంది ఇన్నితిప్పలు పడుతూ తమ వేషాలు మోస్తూ ఉండటం మనకీ, వాళ్ళకీ కూడా అవసరమేననిపిస్తుంది. వేషాలు మనకి సౌకర్యంగా ఉండటం కోసం కాదు, కానేకాదు. ఎదుటివాడికి మన స్థాయీ, అంతస్తు తెలియజెయ్యటానికి మాత్రమే! ఇది దేవుళ్ళకే తప్పలేదు, ఆఫ్టరాల్ మన 'అసూబా'లెంత!

(picture courtesy : Google)