Tuesday 11 September 2012

తెలంగాణా.. ఒక సవర్ణదీర్ఘసంధి!


అబ్బబ్బ! మొన్నటిదాకా చిదంబరం. ఇప్పుడు షిండే. మనుషులు మారారుగానీ.. పద్ధతులు మారలేదు. అందరిదీ మా తెలుగు మాస్టారి విధానమే!

'ఎవరా తెలుగు మాస్టారు? ఏమా విధానం?'

నాకు మా మాజేటి గురవయ్య హైస్కూల్లో ఎనిమిది నుండి పది వరకు.. మూడేళ్ళపాటు తెలుగు సబ్జక్టుకి ఒక టీచరే continue అయ్యారు. ఆయన మాకు సంధులు చెప్పేవారు. సంధులలో మొదటిది సవర్ణదీర్ఘసంధి. అది వివరంగా చెప్పేవారు. అందరికీ సూత్రం కంఠతా రావాలి. అది ఆయన policy. మాస్టారు క్లాసుకి రాంగాన్లే అందరం చేతులు కట్టుకుని నించొని.. ఒకళ్ళ తరవాత ఒకళ్ళం సవర్ణదీర్ఘసంధి అప్పచెప్పేవాళ్ళం.

క్లాసుల్లో ఒకళ్ళిద్దరు నిద్ర పొయ్యేవాళ్ళు. కొందరు కిటికీలోంచి కాకుల్ని, కుక్కల్ని చూస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు. వాళ్ళల్లో ఏదోక దరిద్రుడు సూత్రం సరీగ్గా అప్పచెప్పేవాడుకాదు. ఇంక చచ్చామన్నమాటే! మేస్టారు మళ్ళీ సవర్ణదీర్ఘసంధి వివరంగా చెప్పేవాడు. మళ్ళీ అప్పజెప్పించుకోవడం మొదలు. ఈవిధంగా మాకు భూమి గుండ్రంగా ఎందుకుందో అనుభవపూర్వకంగా అర్ధమైంది. రెండోసంధి గుణసంధి. అది సగంలో ఉండగానే పదోతరగతి పరీక్షలొచ్చాయి. అమ్మయ్య!

ఈ సవర్ణదీర్ఘసంధి బాధ భరించలేక ఒకసారి మా సత్తిగాడు గుణసంధిలోకి రమ్మని మాస్టారుకి మొరపెట్టుకున్నాడు. 'వెధవా! నాకే పాఠాలు చెబుతావా?' అంటూ మాస్టారు సత్తిగాడి వీపు సాపు చేశారు. అప్పట్నించి ఎవరూ నోరెత్తే సాహసం చెయ్యలేకపోయారు. మన తెలుగు మాస్టారుకి సవర్ణదీర్ఘసంధి మాత్రమే వచ్చునని.. అందుకే ఇట్లా manage చేశారని మా సుబ్బు అంటాడు.

నాకీమధ్య మళ్ళీ సవర్ణదీర్ఘసంధి గుర్తొస్తుంది. రాష్ట్రవిభజన గూర్చి కేంద్ర హోమ్ మినిస్టర్లు చేసే ప్రకటనలు 'అప్పురేపు'లా ఒకేవిధంగా ఉంటాయి. వాళ్ళు 'ఏకాభిప్రాయ సాధన' అన్నపుడల్లా నాకు 'సవర్ణదీర్ఘసంధి' అన్నట్లు వినిపిస్తుంది!

రేపోమాపో చంద్రబాబు ఉత్తరం ఇస్తాట్ట. మరి ఒవైసీ ఎప్పుడిస్తాడో? ఎవరోకళ్ళు ఇవ్వకపోయినా సమస్య మళ్ళీ మొదటికే. అందరూ ఉత్తరాలిచ్చినా.. సంతకాలు సరీగ్గా లేవనో, స్టాంపులు సరిపడా అతికించలేదనో తిప్పి పంపొచ్చు. మళ్ళీ fresh గా ఇమ్మని అడగొచ్చు! దటీజ్ సవర్ణదీర్ఘసంధి!

'సమస్య సున్నితమైనది.' కాదన్నదెవరు?

'లోతైనది.' ఒప్పుకున్నాం.

అయితే ఏంటి? ఎక్కడైనా, ఎప్పుడైనా రాజకీయ నిర్ణయాలు, పరిష్కారాలు ప్రజల జీవితాలతోనే ముడిపడే ఉంటాయి. అందుకేగదా మీకు ఓట్లేసి గెలిపించి మా భవిష్యత్తు మీచేతిలో పెట్టింది. సున్నితం, లోతు అంటూ కాకమ్మ కబుర్లు చెప్పే బదులు తప్పుకోవచ్చుగా!

షిండేగారికి ఎవరో చిన్న రాష్ట్రాల వల్ల నక్సలైట్ల సమస్య పెద్దదైపోతుందని చెప్పారట! మూడేళ్ళనుండి సీమాంధ్ర నాయకులు ఈసంగతి ఇల్లెక్కి అరుస్తున్నారు. దానికి ప్రతిగా తెలంగాణా నాయకులు ఎలుగెత్తి సమాధానం చెబుతున్నారు. కానీ home department కి మాత్రం ఇప్పుడే వినబడుతుందిట! ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఒకే రాష్ట్రంగా కలిపేసి నక్సలైట్ సమస్యని అంతమొందిస్తారేమో!

ఏమిటో! అంతా సవర్ణదీర్ఘ సంధి మయం! ఇంతకీ కాంగ్రెస్ దగ్గర గుణసంధి సూత్రం ఉందా? లేక మా తెలుగు మాస్టారిలా....

(photo courtesy : Google)